breaking news
IMF Managing Director Christine lagard
-
India Ideas Summit: వృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ► కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ► రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ► చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ► భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ► అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో టీ రబీ శంకర్ అన్నారు. -
అమెరికా వడ్డీరేట్లు పెంచితే కష్టమే..
ముంబై: అగ్రరాజ్యం అమెరికా వడ్డీ రేట్లను పెంచిన పక్షంలో వర్ధమాన దేశాల నుంచి మరోసారి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ హెచ్చరించారు. దీంతో పాటు మార్కెట్లలో మళ్లీ భారీ హెచ్చుతగ్గులు చూడాల్సి రావొచ్చన్నారు. ఈ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు భారత్ సహా వర్ధమాన దేశాలు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. ‘సంప్రదాయానికి భిన్నమైన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలు నేర్చుకోతగిన పాఠాలు’ అంశంపై మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా లగార్డ్ ఈ విషయాలు తెలిపారు. ‘సహాయక ప్యాకేజీల ఉపసంహరణ ప్రభావాలు ఇక్కడితో ఆగిపోకపోవచ్చు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తీరు మార్కెట్లను ఆశ్చర్యపర్చే విధంగానే ఉండొచ్చు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోల్లో మార్పులు, చేర్పులు చేయొచ్చు. దీంతో పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లిపోయి, మార్కెట్లు మరోసారి భారీ హెచ్చుతగ్గులకు లోను కావొచ్చు’ అని లగార్డ్ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల పెంపు ఎప్పుడు జరుగుతుంది, పెరుగుదల తీరు ఎంత వేగంగా .. ఏ విధంగా ఉంటుందనేది మార్కెట్లను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాలి... 2007-08 నాటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు అనుసరించిన ద్రవ్య విధానాలు.. వర్ధమాన దేశాలకు కొంత ప్రయోజనం చేకూర్చాయని లగార్డ్ చెప్పారు. 2009-12 మధ్య వర్ధమాన దేశాల్లోకి 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా, భారత్‌లోకి 47,000 కోట్ల డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో స్థానిక కరెన్సీల మారక విలువలతో పాటు బాండ్లు, షేర్లూ భారీగా పెరిగాయన్నారు. అయితే, ఈ సానుకూలాంశంతో పాటు వర్ధమాన దేశాలకు రిస్కులు కూడా క్రమంగా పెరిగాయన్నారు. 2013లో ప్యాకేజీల ఉపసంహరణ వార్తలు వచ్చిన తరుణంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ నుంచి దాదాపు 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకెళ్లిపోయారని ఆమె చెప్పారు. దీంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 68.85కి పడిపోయిందన్నారు. ఇలా.. రెండేళ్ల క్రితం చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులను నియంత్రించేందుకు వర్ధమాన దేశాలు సంసిద్ధంగా ఉండాలని లగార్డ్ సూచించారు. ప్యాకేజీల ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలసి పనిచేయాల్సి ఉంటుందన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలతో లగార్డ్ ఏకీభవించారు. పాఠాలు నేర్పాయి.. ప్యాకేజీల ఉపసంహరణ పరిణామాలు ప్రపంచానికి ప్రధానంగా మూడు పాఠాలు నేర్పాయని లగార్డ్ చెప్పారు. సంపన్న దేశాలు సహాయం అందించగలవన్నది మొదటి పాఠం అని వివరించారు. ముందు నుంచీ తమ మార్కెట్లను నియంత్రించుకోగలిగిన వర్ధమాన దేశాలు, ప్యాకేజీల ఉపసంహరణ అనంతరం కూడా మెరుగ్గా రాణించగలవన్నది రెండో పాఠం కాగా.. మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనైన పక్షంలో సెంట్రల్ బ్యాంకులు తక్షణమే తగు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉండాలన్నది మూడో పాఠమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు.. విదేశీ మారక విలువల్లో హెచ్చుతగ్గులను సరిదిద్దడంతో పాటు కొన్ని రంగాలకు తాత్కాలికంగానైనా తోడ్పాటు అందించాల్సి ఉంటుందన్నారు. రాజన్ హెచ్చరించినా.. 2008లో రుణ సంక్షోభం తలెత్తగలదంటూ 2005లోనే రాజన్ హెచ్చరించినా.. ఐఎంఎఫ్ పట్టించుకోకపోవడం పెద్ద తప్పిదమని లగార్డ్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చెప్పేదేదైనా సరే ఐఎంఎఫ్ శ్రద్ధగా ఆలకిస్తోందన్నారు. అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఆయన ఒకరన్నారు. ఇటు కరెన్సీ సంక్షోభం తలెత్తకుండా దేశాన్ని గట్టెక్కించడంలో రాజన్ భేషైన పాత్ర పోషించారంటూ లగార్డ్ కితాబిచ్చారు. ఆర్బీఐ కీలక రంగాలకు విదేశీ మారకం లభ్యమయ్యేలా చూడటం, రూపాయి క్షీణతను కృత్రిమంగా నిలువరించకుండా వదిలేయడం మొదలైనవి దేశ ఎకానమీ కోలుకునేందుకు తోడ్పడ్డాయని చెప్పారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇటు దేశంలో అంతర్గతంగా, అటు అంతర్జాతీయంగా వచ్చే సమస్యలను భారత్ సమర్ధమంతంగా ఎదుర్కొనగలిగిందన్నారు. రాజన్‌ను ప్రశంసిస్తూ.. భారత ద్రవ్యపరపతి విధానం సురక్షితమైన చేతుల్లోనే ఉందని లగార్డ్ చెప్పారు. భారతీయ నేతలతో సమావేశాలను బట్టి చూస్తే ప్రపంచ వృద్ధికి భారత్ చోదకంగా నిల్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న భావన కలుగుతోందని లగార్డ్ పేర్కొన్నారు.