breaking news
henry higgins
-
ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం
తెలుసుకోదగ్గ పుస్తకం: ‘జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన ధర్మం ఒకటే ఒకటుంది. ఏమిటో తెలుసా? ఎప్పుడూ సంతోషంగా ఉండు. అంతేరా కన్నా’ అని చెప్పేవారు మా నాన్న. నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను.... ‘ఒక మనిషి... ఒక ఇల్లు.. ఒక ప్రపంచం’లో ప్రధాన పాత్రధారి హెన్రీ తనని తాను ఆవిష్కరించుకుంటూ అన్న మాటలు ఇవి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్ తమిళంలో రచించిన సుప్రసిద్ధ నవల ఇది. ఈ నవల సాహిత్య అకాడమి పురస్కారం పొందింది. జయకాంతన్ రెండు వందలకు పైగా కథలు, నలభై నవలలు రాశారు. ఈ నవలను తెలుగులోకి జిల్లేళ్ళ బాలాజీ అనువదించారు. ఒక మంచి నవల జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడుతుంది. దాని స్వభావాన్ని బట్టి విషాదాన్నో తాత్వికతనో మరో సుగంధాన్నో మోస్తూ ఉంటుంది. ఈ నవల అపారమైన సంతోషాన్ని మోసుకొస్తుంది. చదువుతున్నంత సేపూ ఈ ప్రపంచం మీద ఎనలేని నమ్మకం, మనుషుల పట్ల అంతులేని ప్రేమ కలుగుతాయి. ప్రధాన పాత్రధారుడు హెన్రీ గుర్తుకురాగానే మన మొహం మీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెలుస్తుంది. బక్క పలుచగా, నీలి కళ్లతో క్రీస్తులా ఉన్న అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. ప్రేమ, కామం, ద్వేషం ఇలాంటి విషయాలు ఏవీ లేకుండా ఇంతందంగా రాయడం జయకాంతన్కే సాధ్యం. కృష్ణరాజపురం ఒక అందమైన గ్రామం. సభాపతి పిళ్లై పండితుడు, ఊరి గుడి ధర్మకర్త కూడా. ఆయన భార్య ఇంటి మంగలి వాడితో లేచి వెళ్లిపోతుంది. ఈ విషయం ఊళ్లో వాళ్లకి తెలియక ముందే అతను ఊరు విడిచి మిలట్రీలో చేరుతారు. అక్కడ యుద్ధంలో ఆప్తమిత్రుణ్ని పోగొట్టుకుంటాడు. అతని భార్య దిక్కులేనిది కాకుండా ఉండేందుకు ఆమెతో సహజీవనం చేస్తూ రైల్వే షెడ్డులో దొరికిన కుర్రాణ్ని తెచ్చుకుని పెంచుకుంటాడు. ఆ కుర్రాడే ‘హెన్రీ’. మొదట తల్లి, తర్వాత తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోతూ ఊళ్లో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అతనికి వారసత్వంగా ఇస్తాడు. హెన్రీకి ఆస్తుల మీద వ్యామోహం లేదు కాని తన తండ్రి జ్ఞాపకాలతో పెనవేసుకున్న ఆ ఇంటిలో ఉంటే తనకి ఎంతో ఇష్టమైన తండ్రి లేని లోటు తీరుతుందని ఆ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఒక మనిషి తన పెంపుడు తండ్రి ఎప్పుడో ఊళ్లో వదిలేసిన ఒక ఇంటిని వెదుక్కుంటూ అందులో ఉండటం కోసం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అతని చుట్టూ ఏర్పరచుకున్న ఒక ప్రపంచం.. ఇది ఈ నవల సారాంశం. ఈ ప్రయత్నంలో తారసపడే పాత్రలు- ఇతనికి మొదటి నుంచి తోడుగా ఉన్న యువకుడు దేవరాజన్; అన్నగారు వదిలేసిన పొలాలను సంరక్షిస్తూ, తానొక ధర్మకర్తనని, ఎప్పుడు వారసుడు వస్తే, అతనికి ఆస్తి అప్పజెప్పాలనుకునే దొరైకణ్ణు; ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి వచ్చి ఆస్తి నాది అని ఋజువులు చూపించినపుడు, ఊళ్లోనే ఇంత కాలం తమ మధ్య ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగిపోతోందేమోనని మథనపడ్డ ఊరి పెద్దలు; అందరికీ తలలో నాలుక లాగా ఉండే దేవరాజన్ అక్క... ఇలా హెన్రీ ప్రపంచంలో చేరిన ప్రతీపాత్ర, పిచ్చి పిల్లతో, సహా ఎంతో సంస్కారవంతంగా ఉంటాయి. ‘హెన్రీ పాత్ర చాలా ఐడియలిస్టిక్. ఇలాంటి మనిషిని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే చూడగలరు.. చూడండి’ అని రచయిత తన ముందు మాటలో చెబుతాడు. ఎప్పుడు ఏ చిన్న విషాదానికో గుండె బరువెక్కినపుడు, మనసు కలత చెందినపుడు ఈ పుస్తకం తీసి చదవండి. మీ మీద మీకు విశ్వాసం, ఈ ప్రపంచం మీద అపారమైన నమ్మకం కలక్కపోతే అడగండి. - కృష్ణమోహన్బాబు -
యవో తియావో షెన్ షీ!
తాజా కోణం ‘‘ఈ ఆడవాళ్లు మనలా ఎందుకు ఉండరు?’’ 1964 నాటి ‘మై ఫెయిర్ లేడీ’ చిత్రంలో ప్రొఫెసర్ హెన్రీ హిగ్గిన్స్ తన స్నేహితుడైన కల్నల్ పికరింగ్ని ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ అడిగిన ప్రశ్న ఇది. అవున్నిజమే! ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండరు? ఆ సినిమా వచ్చి యాభై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొందరు మగవాళ్లను వేధిస్తున్న ప్రశ్న ఇది. అయినా ఆడవాళ్లు మగవాళ్లలా ఎందుకు ఉండాలి? అసలు మగవాళ్లలా ఉండడం అంటే ఏమిటర్థం? ఏం లేదు. మగవాళ్లకు నచ్చే విధంగా ఉండడం! ఎందుకు ఉండాలీ అంటే, మగవాళ్ల కోసమే! ఇప్పుడీ మాట అని చూడండి, ఏం జరుగుతుందో?! ఐదు దశాబ్దాల క్రితం నాటికీ ఇప్పటికీ స్త్రీల ఆలోచనాధోరణిలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడంటే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ, అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే ఏ మగాడికైనా పురుషాహంకారి, స్త్రీద్వేషి అని పేరు పడిపోతుంది. కనుక ఆడవాళ్ల విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవడం ఎంత అవసరమో, సందేహాలను మనసులోనే దాచేసుకోవడం అంత ఆరోగ్యకరం. ఇదంతా ఒక కోణం. తాజా కోణం ఏమిటంటే ఆడవాళ్లు కూడా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు... ‘‘ఈ మగవాళ్లు మనలా ఎందుకు ఉండరు’ అని! అంటే వాళ్లకు నచ్చేవిధంగానట! ఎలాగంటే, మగాళ్లు చక్కగా వంటచేస్తూ, తాము చెప్పే కబుర్లు వింటూ ఉండాలట. అంతేకాదు, గాడ్జెట్లను, గిజ్మోలను పట్టించుకోకుండా నిరంతరం తమ చుట్టూ తిరుగుతూ ఉండాలట! నిజమేనా? ఎవరిదీ పరిశోధన! పరిశోధన కాదు. పరిశీలన. పెళ్లిళ్లు కుదిర్చే సైట్లకు వధువుల నుంచి వస్తున్న దరఖాస్తులలో ఎక్కువ శాతం ‘అబ్బాయికి వంట చేయడం వచ్చి ఉండాలి’ అనే షరతు ఉంటుంటే, వరుల వైపు నుంచి వచ్చే అప్లికేషన్లలో ‘మేం చక్కగా వండి పెడతాం’ అనే ఆశ, దోసె, అప్పడం కూడా ఉంటోందట! ఇదంతా చూస్తుంటే త్వరలోనే ‘మై ఫెయిర్ జెంటిల్మన్’ అని సినిమా వచ్చినా రావచ్చనిపిస్తోంది. ఆల్రెడీ 2009లో వచ్చేసింది కదా అంటారా. అది చైనీస్ మూవీ. ‘యవో తియావో షెన్ షి’ దాని పేరు. ఏంటో... ఆడామగా ఒకరిమీద ఒకరు చేసుకునే కంప్లైంట్లు కూడా యవో తియావో షెన్ షి అన్నట్లే అర్థం కాకుండా ఉంటాయి!