breaking news
Generic drug stores
-
జనరిక్ మందులకు నిర్లక్ష్యపు జ్వరం
తణుకు : సామాన్యుడి సంపాదనలో సగం వైద్యం ఖర్చులకే సరిపోతోంది. అందులో ఎక్కువ శాతం మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించే లక్ష్యంతో అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని 2009లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2011లో ఏలూరు, తణుకు ప్రభుత్వాసుపత్రుల ఆవరణల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ షాపులను ఏర్పాటు చేసి పేదలపై మందుల ధరల భారా న్ని తగ్గించాలని నిర్ణయించారు. నేటికీ ఈ ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు. మహిళా సంఘాలకు చేయూత జనరిక్ మందుల దుకాణాలను మహిళా సమాఖ్యల ద్వారా ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ షాపుల ద్వారా మహిళలకు చేయూతనివ్వాలని భావించారు. సాధారణంగా బయట లభించే మందులతో పోల్చితే జనరిక్ మందులు 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. అమ్మకాల్లో వచ్చిన 20 నుంచి 25 శాతం కమీషన్ మహిళా సమాఖ్యల ద్వారా మహిళా సంఘాలకు చేరుతుంది. ప్రస్తుతం ఏలూరు, తణుకుల్లో షాపులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జనరిక్ మందులను అందుబాటులో ఉంచితే పేదలకు భారం తగ్గుతుంది. చొరవ ఏదీ ? కేవలం బ్రాండెడ్ మందులను మాత్రమే ప్రభుత్వ వైద్యులు రోగులకు ప్రిస్కిప్షన్‌లో రాస్తున్నారు. దీంతో జనరిక్ మందులు సరిగ్గా పనిచేయవనే అపోహలో రోగులు ఉన్నారు. కొందరు వైద్యులు కూడా మందుల కంపెనీల పారితోషికాలు, బహుమానాలకు అలవాటు పడి.. సదరు కంపెనీల మందులనే రాస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు జనరిక్ మందులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు వాటిపై అపోహలను పోగొట్టే విధంగా అవగాహన కల్పించాల్సి ఉంది. రోగులకు ప్రయోజనం అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు లభిస్తాయి. ప్రతి మందుపై 45 నుంచి 70 శాతం వరకు రాయితీ ఇస్తారు. జ్వరానికి వాడే పారాసిట్మల్ 10 మాత్రలు మార్కెట్లో రూ.16 ఉంటే జనరిక్ దుకాణాల్లో రూ.7కే లభిస్తాయి. మల్టీ విటమిన్ మాత్రలు మార్కెట్లో రూ.40 ఉంటే ఇక్కడ మాత్రం రూ.29కు లభిస్తున్నాయి. జలుబుకు వాడే సిట్రజిన్ మాత్రలు మార్కెట్లో రూ.30 ఉంటే జనరిక్‌లో రూ. 2కు లభిస్తున్నాయి. త్వరలో 23 ప్రాంతాల్లో.. రాబోయే రోజుల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే 80 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చాం. జిల్లాలో 23 ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. - ఎ.శ్యాంప్రసాద్, పీడీ, డీఆర్డీఏ. -
నామమాత్రమే
ఉనికి కోల్పోతున్న జనరిక్ మందుల దుకాణాలు ఒక్కో దుకాణంలో నెలకు రూ.6 వేలే అమ్మకం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు అందుబాటులో లేని మందులు శిధిల స్థితిలో గదులు మరికొన్ని ఏర్పాటు చేస్తామంటున్న అధికారులు మందులు కొనాలంటే సామాన్య మధ్యతరగతి హడలిపోతున్నాయి. డాక్టరు చీటీ పట్టుకుని వెళ్లి చూపించాలంటే జంకుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అప్పో సప్పో చేసి కొనక తప్పని స్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించిన జనరిక్(జన ఔషధాలు)పై చాలామందికి అవగాహన కొరవడుతోంది. మందు ఒకటే అయినా పేరు మార్చి కంపెనీలు విక్రయించే బ్రాండ్లవైపే మొగ్గు చూపుతున్నారు. చౌకగా వచ్చే మందులను దూరం పెడుతున్నారు. తమ కమీషన్ల కోసం వైద్యులూ జనరిక్ మందులను సిఫార్సు చేయడం లేదు. దీంతో జనం జేబులకు చిల్లుపడుతోంది. జనరిక్ మందు జనానికి అందకుండా పోతోంది. విశాఖపట్నం: పేద ప్రజలకు తక్కువ రేటుకే ఖరీదైన మందులందించాలనే సుసంకల్పంతో ప్రారంభించిన జీవనధార ఫార్మసీ (జనరిక్ మందుల) షాపులు లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. వైద్యుల స్వార్ధం, అధికారుల అలసత్వంతో నీరసించిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా రోగులకు మందులు అందించే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ జనరిక్ షాపులకు అంకురార్పణ జరిగింది. సామాన్య జనావళికి మందులు సాధారణ ధరకు ఇవ్వాలనేది జనరిక్ లక్ష్యం. అప్పటి కలెక్టరు శ్యామలరావు జనరిక్ పట్ల అపారమైన ఆసక్తి చూపించడంతో దీనిని తర్వాత ప్రభుత్వం ఇతర జిల్లాలకూ విస్తరింపజేసింది. ఆరంభంలో బాగానే ఉన్నా రాన్రానూ ఉనికి కోల్పోయే స్థితికి ఈ జన ఔషధ శాలలు చేరుకున్నాయి. 11 ఫార్మసీల ఏర్పాటు: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 11 జీవన ధార ఫార్మసీలను ఏర్పాటు చేశారు. కింగ్‌జార్జ్ హాస్పటల్, విక్టోరియా హాస్పటల్, ఈఎన్టి హాస్పటల్, పెదవాల్తేరు, శ్రీహరిపురం, ఆగనంపూడి, తరగపువలస, అనకాప ల్లి, యలమంచిలి, నర్శీపట్నం, వడ్డాది ప్రాం తాల్లో వీటిని నెలకొల్పారు. నడుపుకోమని జిల్లా సమాఖ్యలకు అప్పగించారు. దీంతో మహిళలకు చేయూతనిచ్చేశామని, వారు ఆర్ధికంగా స్వావలంభన సాధించేందుకు అవకాశం ఏర్పడిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. అన్నీట్లో నష్టాలు: ైప్రైవేట్ మందుల దుకాణాల్లో దొరికే మందులన్నీ జనరిక్ మందుల దుకాణాల్లో దొరకవు. మందు మూలానికి సంబంధించిన వాస్తవ పేరు కాకుండా కంపెనీలు పెట్టుకున్న బ్రాండ్ నేమ్‌తో చేసే అమ్మకాలు ఇక్కడ ఉండవు. వాస్తవ మందులను డాక్టర్లెవరూ సిఫార్సు చేయడం లేదు. దీంతో జనరిక్ మందులు కొనేవారు కరువయ్యారు. వాస్తవ మందు పేరు ఎక్కడా ప్రిస్కిప్షన్లలో సిఫార్సు చేయడానికి వైద్యులు సిద్ధంగా లేరు. అసలు సిసలైన మందు రేటు వాస్తవానికి తక్కువే. కానీ అదే మందును ఫార్మసీ కంపెనీ ఒక్కో బ్రాండ్ పేరుతో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. జనరిక్ షాపుల్లో మందులు బయట రేటుకంటే బాగా తక్కువ ధరకు ఇస్తారు. ఈ లెక్కన ఈ దుకాణాలకు తాకిడి ఎక్కువగా ఉం డాలి. జనరిక్ అమ్మకాలను పరిశీలిస్తే ఇందుకు భిన్నంగా ఉంది. గతేడాది జిల్లాలో 11 షాపుల్లోనూ కలిపి రూ.2.10కోట్ల మందుల అమ్మకం జరిగింది. ఈ ఏడాది రూ.2.50 కోట్లకు అమ్మకా లు పెరిగాయని జిల్లా బిజినెస్ మేనేజర్ గురునాథ్ చెబుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ. 20.83లక్షలు, రోజుకి రూ.64.44వేలు చొప్పున అమ్ముతున్నారు.అంటే ఒక్కో షాపులో రో జుకి కేవలం రూ.6313 విలువైన మందులు మా త్ర మే విక్రయిస్తోంది. సాధారణంగా ప్రైవేట్ మం దుల షాపులు రోజుకి ఎంత తక్కువ లెక్కేసుకు న్నా రూ.20 వేల నుంచి రూ.1లక్ష వరకూ వ్యా పారం చేస్తుంటాయి. కానీ జనరిక్ మందుల షా పులు వాటి దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. ఉద్దేశ్యపూరకంగా నిర్వీర్యం: జనరిక్ మందుల దుకాణాలను వైద్యులు, అధికారులు కావాలనే నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు జీవనధార(జనరిక్) మందు ఒకటుందని, అక్కడ తక్కువ ధరకే మందులు దొరుకుతాయని చెప్పడం లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సినవి, అరుదుగా అవసరమయ్యేవి, అధిక ధర ఉండేవి దాదాపు 20 శాతం మందులు జనరిక్ దుకాణాల్లో దొరకవు. దీనిని సాకుగా చూపించి, ఇక్కడ దొరకని వాటితో పాటు దొరికే వాటిని కూడా ప్రైవేట్ మందుల దుకాణాల్లో తీసుకోవాల్సిందిగా వైద్యులే సూచిస్తున్నారని రోగులు చెబుతున్నారు. ప్రైవేట్ మందుల షాపులతో వైద్యులకు కమిషన్ల ఒప్పందాలు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. తమ కమిషన్లు పోతాయని వారు జనరిక్ దుకాణాల గురించి రోగులకు సిఫారసు చేయడం లేదు. అంతే కాకుండా అక్కడ అందుబాటులో ఉండే మందులు రాయకుండా దొరకని మందులు చీటీ రాసివ్వడంతో తప్పనిసరై రోగులు ప్రైవేట్ మందుల షాపుల్లోనే కొంటున్నారు. ప్రజలకు వీటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన సర్కారు చేతులు ముడుచుకుంది. సాధారణ ప్రజల్లో చాలామందికి జనరిక్ మందులకు ఇదే మూలంతో బ్రాండ్ నేమ్‌తో అమ్మే మందుకు వ్యత్యాసం తెలియడం లేదు.ఫలితంగా మందుల పేరిట భారీగా సొమ్ము వెచ్చించాల్సిన పరిస్థితి. తక్కువ ఖరీదుకు విక్రయిస్తున్నందున..వీటి నాణ్యతపై కొందరికి అపనమ్మకం ఉండటం కూడా జనరిక్ ఔషధ అమ్మకాలను ప్రభావితం చేస్తోందని ఒక వైద్యుడు వ్యాఖ్యానించారు. ఇక జీవనధార ఫార్మసీలను పర్యవేక్షించాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవి చాలా బాగా నడుస్తున్నాయని చెబుతుండటం విశేషం. కేజీహెచ్‌లో జీవన ధార ఫార్మశీ ఏర్పాటు చేసిన గదిలో సీలింగ్ ఊడి పడిపోతోంది. సరైన సౌకర్యాలు కూడా లేవు. జనరిక్ మందుల షాపులు బాగా నడుస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల రూపాయలకు మించి విక్రయాలు సాగిస్తున్నాం. దీంతో మరో వారం రోజుల్లో గోపాలపట్నం, నర్శీపట్నంలో రెండు షాఫులు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని 30 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున జనరిక్ మందుల షాపులను నెలకొల్పాలని భావిస్తున్నాం. -సత్యసాయి శ్రీనివాస్, ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ.