breaking news
darkest days
-
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
1975. జూన్ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్‌ముఖ్, ప్రకాశ్‌సింగ్ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్‌సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, కె.ఆర్.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందూస్తాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్‌తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్‌లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్‌కుమార్ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్‌లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్‌పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్‌ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘చీకటి రోజులు.. మోదీ విఫలం’
సాక్షి, న్యూఢిల్లీ : మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ.. వేలాది మంది రోడ్డెక్కి.. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్ ఉన్నతాధికారుల బృందం కథువా-ఉన్నావ్ ఘటనలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం.. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం’ అని లేఖలో వారు పేర్కొన్నారు. సుమారు 49 మంది సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు ఈ లేఖ రాసినట్లు సమాచారం. కథువా ఘటన.. పూర్తి కథనాలు అంతేకాదు ప్రస్తుత అధికార గణంపై వారు లేఖలో విరుచుకుపడ్డారు.‘వారు వారి విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలం అయ్యారు’అని లేఖలో మాజీ అధికారులు ప్రస్తావించారు. ఉన్నావ్, కథువా, అస్సాం, సూరత్.. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు మెట్రో నగరాలతోపాటు పలు పట్టణాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నారు. -
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ప్రధాని ఇందిరాగాంధీ.. ఈ పేరు వింటే ఒక ఉక్కు మహిళ గుర్తొస్తుంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన ప్రధానిగా ఆమెకు ఎంతో పేరుంది. ఇందిర హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆమె ఖ్యాతిని ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాయి. కానీ అధికారం మహా చెడ్డది. దానికి అలవాటు పడినవాళ్లు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇందిరాగాంధీనే ఉదాహరణ. ఆమె అధికార దాహానికి నిదర్శనమే దేశ చరిత్రలో బ్లాక్‌డేగా మిగిలిన ఎమర్జెన్సీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మాయని మచ్చలా మిగిలిన ఎమర్జెన్సీని ఇదేరోజు (1975 జూన్ 25న) విధించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌నారాయణ్ అనే సోషలిస్ట్ నేత ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేశారు. ఆమె అధికార దుర్వినియోగం చేసి గెలిచారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ సిన్హా ఇచ్చిన తీర్పు చరిత్రను మలుపు తిప్పింది. 1975 జూన్ 12న ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టు స్పష్టం చేసింది. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించడమే కాకుండా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరా గాంధీపై నిషేధం విధించింది. ఈ తీర్పు రాజకీయంగా పెను తుపాను సృష్టించింది.అధికారం లేకుండా ఉండలేని ఇందిర తన ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోయారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయ స్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. దాంతో చేసేది లేక పదవి వదులుకోలేక ఎమర్జెన్సీ వైపు మొగ్గు చూపారు. ఇష్టారాజ్యంగా.. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇందిరా గాంధీ తన అననూయులతో సమావేశమై చకాచకా పావులు కదిపారు. ఈ విషయాన్ని తన మంత్రి వర్గ సహచరులకు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ ముసాయిదాను సిద్ధం చేసి అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం పొందారు. దాంతో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌లకు ఆదేశాలు వెళ్లాయి. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వపరంగా జరిగిన దాషీ్టకం అంతాఇంతా కాదు. ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా మారారు. దాదాపు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ చీకటి రోజులకు 1977 మార్చి 21తో తెరపడింది. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ఇందిర ప్రకటించారు. ఇందుకు ఆమె తర్వాత జరిగిన ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఎమర్జెన్సీకి ప్రతీకారంగా ఆమె పార్టీని ప్రజలు దారుణంగా ఓడించారు. తిరిగి అధికారంలోకి.. ఇందిరా గాంధీని ఓడించి అధికారారంలోకి వచ్చిన జనతా పార్టీ స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి కేంద్ర కాంగ్రేసేతర పార్టీగా చరిత్ర సృష్టించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జయప్రకాష్ నారాయణ్ కలలు కన్న సంపూర్ణ విప్లవం వాస్తవ రూపం దాల్చకుండానే ‘జనత ప్రయోగం’ విఫలమైంది. రాజకీయ స్వలాభాల కోసం చేతులు కలిపిన పార్టీలు అదే స్వార్థంతో కత్తులు దూసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫలితంగా ఇందిరకు రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపించారు. ఏ ప్రజలైతే ఎమర్జెన్సీ కారణంగా తిరస్కరించారో.. తిరిగి మళ్లీ వారే ఇందిరా గాంధీకి అధికారం అప్పగించారు. మూడు ఎమర్జెన్సీలు.. మనదేశం స్వాతంత్య్రం పొందాక మూడుసార్లు అత్యవసర పరిస్థితులను చవిచూసింది. 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్–చైనాల మధ్య చెలరేగిన యుద్ధం కారణంగా ఎక్ట్సర్నల్ ఎమర్జెన్సీ విధించారు. అలాగే 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు ఇండో పాక్ వార్ సందర్భంగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. మూడోసారి ఇందిరాగాంధీ హయాంలో దేశ భద్రత, ఆంతరంగిక కల్లోలాలను బూచిగా చూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీఅమల్లోకి తెచ్చారు. అయితే మొదటి రెండూ అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇందిరా గాంధీ తెచ్చిన అత్యవసర పరిస్థితి మాత్రం ప్రజలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. మారిన మనిషిగా.. ప్రధాని అయిన తర్వాత ఇందిరలో మునుపటి తెంపరితనం తగ్గిపోయింది. విద్వేష పూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టేశారు. కానీ ఆమె దురదృష్టం.. ప్రజలు ఇచ్చిన రాజకీయ పునుర్జన్మను పూర్తిగా వినియోగించుకోలేక పోయారు. పదవీ కాలం పూర్తికాక ముందే అంగరక్షకుల తుపాకీ తూటాలకు బలైపోయారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఇందిరాగాంధీ తన జీవితకాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. అధికారం చేతిలో ఉందికదా! ఏం చేసినా చెల్లుతుందనుకునే వారికి ఇందిర జీవితమే ఒక ఉదాహరణ. ప్రజలు కొందరిని కొన్నాళ్లు నమ్ముతారు. అందరినీ ఎల్లకాలం నమ్మరు.