ఖాతాల ఏరివేతే రుణ మాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక కోటీ 14 లక్షల ఖాతాలుంటే అందులో 82.66 లక్షల ఖాతాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటామంటూ.. మిగతావాటిని (31.34 లక్షల ఖాతాలు) అసలు రుణ మాఫీకి పరిగణనలోకి తీసుకోకుండానే మొదట్లోనే ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులు, ఒకే సర్వే నంబర్‌తో రెండు బ్యాంకుల్లో రుణం తీసుకున్నారా? స్థానికులా కాదా? ఎలాంటి పంటలు వేశారు? కుటుంబంలో ఒక్కరేనా కాదా? బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికే రుణం తీసుకున్నారా? వంటి రకరకాల కొర్రీలతో తొలి విడత రెండో విడత అంటూ మొత్తంమీద ఇప్పటివరకు సగానికిపైగా రైతుల ఖాతాలను రుణ మాఫీ పరిధి నుంచి ప్రభుత్వం ఏరివేసింది.
రెండో దశలో 17.23 లక్షల ఖాతాలకు ఎగనామం
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్‌తోపాటు రబీ సీజన్ కూడా పూర్తి అయినప్పటికీ రైతులను రుణ భారం నుంచి చంద్రబాబు సర్కారు విముక్తులను చేయలేదు. ఇప్పటివరకు మొదటి విడత పూర్తి చేశామనీ రెండో విడతలో రైతుల నుంచి పలు వివరాలు సేకరిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తోంది. అయితే మొదటి విడతలోని ఖాతాలకే ఇంకా విముక్తి లభించలేదు. ఆ రైతులపై పడిన వడ్డీ భారం సంగతేంటో తెలియదు. ఇప్పుడు రెండో విడత లెక్కలకు కూడా ప్రభుత్వం కట్టుబడటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత డిసెంబర్ 4న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండోదశలో 42.23 లక్షల ఖాతాలకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం 25 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే కోరుతూ ఆ మేరకు రెండో దశ జాబితాలను విడుదల చేశారు. తద్వారా 17.23 లక్షల ఖాతాలను రెండో దశలోకి అసలు పరిగణనలోకి తీసుకోకుండానే తిరస్కరించారు.
ఇక 25 లక్షల ఖాతాలకుగాను కేవలం 14 లక్షల ఖాతాలకు చెందిన ఆధార్, రేషన్ కార్డు, భూమి రికార్డుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. అంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలోనే 11 లక్షల రైతు ఖాతాలను తిరస్కరించారు. తొలిదశకు చెందిన ఆరు లక్షల రైతుల ఖాతాలకు ఇప్పటివరకు నయాపైసా జమ చేయలేదు. మిగిలిన ఖాతాల్లో అరకొరగా జమ చేసినా సంబంధిత రైతుల ఖాతాల్లో ఇంకా అసలు, వడ్డీ భారం అలాగే ఉంది. అదెటూ తేలకముందే ఇప్పుడు ఖాతాల్లో కోతలు పెడుతూ రెండోదశ అంటున్నారు. అందులోనూ తొలివిడతగా 20 శాతం చెల్లిస్తామన్న డబ్బు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే తప్ప ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. తొలి దశ రూ.5 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటివరకు రూ.4,300 కోట్లనే వ్యయం చేశారు.
తొలి దశలో ఆరు లక్షల ఖాతాలు, రెండో దశలో వివరాలు స్వీకరించిన 14 లక్షల ఖాతాల్లో అర్హులెవరు, అనర్హులెవరో స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ నుంచి తీసే ప్రక్రియ మొదలుపెట్టారు. స్టేట్ రెసిడెంట్ డేటా హబ్.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కుటుంబం యూనిట్‌గా లెక్కిస్తుంది. ఈ ఖాతాల్లో ఆధార్, రేషన్ కార్డులు, భూమి రికార్డులు సరిగా లేనివి తిరస్కరణకు గురవుతాయి. ఈ రకమైన రకరకాల జిమ్మిక్కులతో నేరుగా రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రైతులు మాత్రం బ్యాంకుల్లో వడ్డీ పేరుకుపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని బ్యాంకులైతే రైతులు కుదవ పెట్టిన బంగారాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యాయి.
అధికారం చేపట్టిన మరుక్షణమే.. తొలి సంతకంతోనే రైతుల రుణాలన్నీ మాఫీ అవుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 9 నెలలవుతోంది. రైతుల రుణాలన్నీ ఎప్పట్లాగే ఉన్నాయి. పెపైచ్చు అపరాధ వడ్డీ భారంతో రైతు నడ్డి విరిచారు. రైతుల పాసు పుస్తకాలు, బంగారు ఆభరణా లన్నీ బ్యాంకుల్లో తనఖాలోనే ఉన్నాయి.
మరి ఇంతకాలం ఏం చేశారని ఒక్కసారి తరచి చూస్తే... రుణ మాఫీ పేరుతో అంతా హైడ్రామానే నడిపించారని స్పష్టమవుతుంది. చంద్రబాబు సహా మాట్లాడే ప్రతి నాయకుడూ రుణాలన్నీ మాఫీ అయ్యాయంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకూ రుణం మాఫీ కాలేదు. ఇదే బాబుగారి మార్కు మాయాజాలం. తొలి విడత, రెండో విడత... ఇలా విడతల వారీగా ఖాతాలు లెక్కించే పేరుతో కాలయాపన చేస్తున్న సర్కారు, రుణాలు మాఫీ చేయకుండానే ఖరీఫ్, ర బీ సీజన్లను విజయవంతంగా దాటేసింది. రైతులు రుణ విముక్తులు కాలేదు గానీ వారిపై మరింత రుణ భారం పడింది.
రూ.50 వేల లోపు ఒకేసారి చెల్లింపులోనూ నిజం లేదు
కుటుంబానికి రూ.50 వేలలోపు రుణాలను ఒకేసారి చెల్లించేశామని చెబుతున్న ప్రభుత్వ వాదనలోనూ నిజం లేదు. ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయం బయటపడింది. రూ.50 వేలలోపు రుణాలను చెల్లించినందున ఆయా రైతుల రుణ ఖాతాలను మూసివేయాలని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. దీనిపై బ్యాంకర్లు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రైతులు తీసుకున్న రుణం కన్నా తక్కువగా చెల్లించినందున మిగతా రుణాన్ని, వడ్డీని రైతులు చెల్లిస్తేగానీ ఆ ఖాతాలను మూసివేయలేమని స్పష్టం చేశారు. దీంతో రూ.50 వేలలోపు రుణాలను కూడా ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదని తేలిపోయింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణం కన్నా తక్కువ చెల్లించడంతో ఆయా కుటుంబాలకు పూర్తిగా రుణమాఫీ జరగలేదు. దీంతో ఆ రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను, భూమి పత్రాలను బ్యాంకులు వారికి తిరిగి ఇవ్వడం లేదు.
ఖాతాలను తిరస్కరించడమే రుణ మాఫీలో మాయ
మొత్తం వ్యవసాయ రుణాల ఖాతాలు: 1.14 కోట్లు
మొదట్లోనే తిరస్కరించిన
ఖాతాలు: 31.34 లక్షలు
తొలివిడత పరిగణనలోకి తీసుకున్నట్టుగా ప్రకటించిన
ఖాతాలు: 82.66 లక్షలు
తొలి దశలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సీఎం
{పకటించిన ఖాతాలు: 40.43 లక్షలు
రెండో దశలో పరిగణనలోకి తీసుకున్నట్టు బాబు చెప్పిన
ఖాతాలు:42.23 లక్షలు
రెండో దశలో విడుదలైన జాబితాల్లోని వాస్తవ ఖాతాలు: 25 లక్షలు
అంటే రెండో దశలో ఏరివేసిన ఖాతాలు: 17.23 లక్షలు
తీరా రెండో దశ 25 లక్షల ఖాతాల్లో 14 లక్షల ఖాతాల వివరాలే స్వీకరణ
వివిధ కారణాలతో తిరస్కరించిన ఖాతాలు: మరో 11 లక్షలు
స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌లో వేశాక మరిన్ని ఖాతాలకు ఎగనామం