breaking news
b.kothapeta
-
ఇద్దరే ఇద్దరు !
సాక్షి, బి.కొత్తకోట : 2014 నవంబర్ 5న అంగళ్లులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి.కొత్తకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి, అందులో వృత్తిపరమైన కోర్సులు అందిస్తామని ప్రకటించారు. దానికోసం నిరుపేద విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా కదలికలేదు. 2016 చివర్లో కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసి చేతులు దులుపుకుంది. తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మరో జీఓ జారీ చేస్తూ అధ్యాపకులు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఖాళీ భవనాల్లో తరగతులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చేరిక కోసం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు పల్లెల్లో పర్యటించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. చేరింది ఇద్దరే.. కళాశాలలో మంగళవారం నాటికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. వీరిలో పెద్దతిప్పసముద్రం మండలం కమ్మపల్లెకు చెందిన సి.నరేంద్ర, రంగసముద్రానికి చెందిన షేక్ వలీ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికపై ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ప్రకటన చేసింది. తొలివిడతలో ఈ కళాశాలలో చేరిన వారు ఇద్దరే. ఈ నెలాఖరులో మరోసారి ప్రకటన ఇవ్వనుంది. బి.కొత్తకోట కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలంటే బీఏకు 25మంది, బీకాంకు 25 మంది విద్యార్థులు అవసరం. ఈ సంఖ్యను ఈనెల 30వ తేదీలోగా చేరుకోకుంటే తరగతులు ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే. కారణాలేమిటి? డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు చేరకపోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా జీఓ జారీ చేయడం, విద్యార్థుల చేరిక విషయంలో సరైన ప్రచారం లేకపోవడం కనిపిస్తోంది. ప్రయివేటు కళాశాల సిబ్బంది పల్లెలకు వెళ్లి ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను చేర్పించుకోవడం, టీసీలు తీసుకోవడం లాంటి చర్యలతో ప్రభుత్వ కళాశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ కళాశాల తరగతుల నిర్వహణకు తగిన సంఖ్య లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన 10 రోజుల్లోనైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునే వీలుంది. -
నడక యాతన!
=కాలిబాటలు, పొలంగట్లే రహదారులు =నిధులున్నా రోడ్లు వేయని పంచాయతీరాజ్ =చాలా చోట్ల గుంతలుపడి దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్లు =ప్యాచ్‌లే తప్ప శాశ్వత పనులు నిల్ =జిల్లాలో ఇదీ పరిస్థితి రాష్ట్ర రాజకీయాలను శాసించే అధినాయకులు మన జిల్లాలోనే ఉన్నారు. ఒకరు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. ఇంకొకరు మూడేళ్లకుపైగా సీఎం పదవిని పట్టుకుని ఊగిసలాడుతున్నారు. వీరిలో ఒక్కరూ తమ సొంత జిల్లాలోని రోడ్ల దుస్థితిపైన దృష్టి పెట్టలేదు. గుంతలు పడి.. రాళ్లుతేలి.. నడవడానికి వీలులేని స్థితికి చేరినా కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. అక్కడక్కడా నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో అవి మురిగిపోతున్నాయి. గ్రామీణ రోడ్ల దుస్థితిపై శుక్రవారం సమరసాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు : జిల్లాలోని రోడ్లు నరకానికి నకళ్లుగా మారా యి. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా పట్టించుకునే వారే లేకుండాపోయారు. కుప్పం నియోజకవర్గంలో 465 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. కృష్ణగిరి-కుప్పం రోడ్డు గుంతలమయంగా మారింది. వంద వసంతాల ఉత్సవాలు నిర్వహించిన నిధులతోనే మరమ్మతులు చేస్తున్నా రు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదు. పంచాయతీరాజ్ రోడ్లు గుంతలు పడి, కంకరతేలిపోయాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 25 గ్రామాలకు పూర్తిగా రోడ్డు సౌకర్యం లేదు. గత అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీరోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కోతకు గురయ్యాయి. బి.కొత్తకోట జాతీయ రహదారి అమరనారాయణపురం క్రాస్ నుంచి తుమ్మనంగుంట వరకు గుంతలు పడి పోయింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలో 481 కిలోమీటర్ల ఆర్అండ్బీ రాష్ట్ర రహదారులు, 60 కి.మీ మేర పీఆర్ రోడ్లు ఉన్నాయి. వీటిల్లో మూలతిమ్మేపల్లె నుంచి తప్పిడిపల్లె వరకు, ధర్మపురి నుంచి వెంకటాపురం, గంగవరం కేసీపెంట నుంచి అప్పిశెట్టిపల్లె, గాంధీనగర్, పెద్దపంజాణి మండలంలోని లింగమనాయునిపల్లె, నాగిరెడ్డిపల్లె, గుండ్లం వారిపల్లె, పలమనేరు మండలంలో జగమర్ల యానదికాలనీ రోడ్లు దుస్థితికి చేరాయి. 90 పంచాయతీల్లో 33 చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో చెరివి, పీవీ.పురం, గొల్లపాళెం, చమర్తకండ్రిగ, సత్యవేడు - మాదరపాకం రోడ్లు దెబ్బతిన్నాయి. చెరివి రోడ్డు ఆరు కిలోమీటర్ల మేర శ్రీసిటీ సెజ్‌లో ఉంది. ఈ రోడ్డు నిర్వహణను ఆర్అండ్బీ గాలికొదిలేసింది. పీవీ.పురం రోడ్డు క్వారీ వాహనాల తాకిడికి ధ్వంసమైంది. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు రాకపోవడంతో గుంతలు పడినా పూడ్చే పరిస్థితి లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 14 గ్రామాలకు రోడ్లు లేవు. చెరువుకట్టలు, బండ్లబాటల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాలకు పొలంగట్లే రహదారులు. పంచాయతీ రాజ్రోడ్లకు నామమాత్రంగా గుంతలు పూడ్చడం మినహా, శాశ్వత పనులు చేయడం లేదు. బీఆర్జీఎఫ్ నిధులతోనైనా మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో అక్కెరి దళితవాడ, వేణుగోపాలపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రామచంద్ర ఎస్టీ కాలనీకి రోడ్డు సౌకర్యమే లేదు. చెరువు కట్టపై రాకపోకలు సాగిస్తున్నారు. నగరి మండలంలో దువ్వూరు సుబ్బారెడ్డి కండ్రిగకు రోడ్డే వేయలేదు. కాసావేడు ఎస్టీ కాలనీకీ అదే పరిస్థితి. కృష్ణారామాపురం వద్ద రోడ్డు గతులమయమైంది. చెరుకు లారీలు, ట్రాక్టర్లతో రోడ్డు ధ్వంసమైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం గంగుడుపల్లె రోడ్డు, అనుప్పల్లెకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చంద్రగిరి ఇందిరమ్మకాలనీ, మల్లయ్యగారిపల్లె, రాయలపురం గ్రామాలకు రోడ్లు అంతంతమాత్రమే. మదనపల్లె మండలంలోని 16 పంచాయతీల్లో 384 పల్లెలు ఉంటే, 150 గ్రామాలకు కేవలం కాలిబాటలే దిక్కు. ఐదేళ్లుగా పీఆర్ నిధులున్నా ఖర్చుచేయని పరిస్థితి. చిన్నాచితకా రోడ్ల ప్యాచ్పనులనూ పట్టించుకునేవారే లేకుండా పోయారు. 61 రోడ్లు ఉంటే వీటిల్లో జాతీయ రహదారులూ గుంతలు పడిపోయాయి. మేకలవారిపల్లె, మిట్టామర్రి, మేడిపల్లె, ఆవులపల్లె గ్రామస్తులు శ్రమదానంతో రోడ్లు నిర్మించుకున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో బాలగంగనపల్లె, పెనూమూరు మండలంలో సామిరెడ్డిపల్లె ఎగువ దళితవాడ, రామాపురం గ్రామాలకు రోడ్లు లేవు. సామిరెడ్డిపల్లె దళితవాడకు చెరువులో నుంచి వెళ్లాలి. వర్షాలుకు నీళ్లొస్తే ఆ గ్రామంతో సంబంధాలు తెగిపోయినట్టే. వెదురుకుప్పం మండలం మాంబేడుకు రోడ్డే లేదు.