breaking news
Adharsh scam
-
డీఎఫ్‌కు గడ్డుకాలమే!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) కూటమి ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది...ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణం, జలవనరుల కుంభకోణం...తాజాగా పాల కుంభకోణం...ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో అధికార పార్టీల నేతల పేర్లు తెరమీదకు వస్తుండటంతో కాంగ్రెస్, ఎన్సీపీల ప్రతిష్ట దిగజారుతోంది. ఆయా కుంభకోణాలతో ప్రజల దృష్టిలో పలుచన అవుతున్న డీఎఫ్ కూటమికి ముందుంది మరింత గడ్డు కాలమేనని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే పదిహేనేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి (శివసేన, బీజేపీ) అందివచ్చిన ప్రతి అంశాన్ని విడవడం లేదు. అధికార పార్టీ నేతలపై అవినీతి విషయంలో రాజీలేని పోరు చేస్తోంది. దీనికితోడు ఇటీవల బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముంబైలో నిర్వహించిన సభ విజయవంతమవడంతో ఆ పార్టీ నేతలు మంచి ఊపుతో ముందుకెళుతున్నారు. ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతివ్వని గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతున్నారు. ముంబైకి కరువైన భద్రత, రోజురోజుకు ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, బస్సు చార్జీలు, కరెంట్ చార్జీలు ఇలా ప్రతి అంశాన్ని రాబోయే ఎన్నికల్లో అస్త్రాలుగా వినియోగించేందుకు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. అయితే అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఎన్నికల్లో ఏ వ్యూహన్ని అమలుచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి తిప్పలే... అవినీతి కుంభకోణాలు అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతోపాటు అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జల వనరుల కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాల కుంభకోణంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర మంత్రి నారాయణ రాణేలపై కేసు నమోదవడం వారికి రాజకీయంగా ఇబ్బంది కలిగించే పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంకు ఆదర్శ్ బురద... అయితే ఇటీవలే ఆదర్శ్ కేసులో అశోక్ చవాన్‌పై దర్యాప్తు చేసేందుకు సీబీఐ అనుమతి కోరగా, దాన్ని రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ తిరస్కరించారు. దీంతో అశోక్ చవాన్‌కు క్లీన్ఝట్డఏ లభించినట్టేనని అందరూ భావించారు. ఈ విషయమై అనేక పత్రికల్లో కూడా అశోక్ చవాన్‌కు మంచిరోజులు వచ్చాయన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో దర్యాప్తు నివేదికను ఎట్టకేలకు శీతాకాల సమావేశాల్లో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం కోసం ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని సీఎం పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శ్ వివాదంలో ఇరుక్కుపోయిన తమ నాయకులను రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ఇప్పటివరకు ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న సీఎం పృథ్వీరాజ్‌కు ఆదర్శ్ బురద అంటుకుంటోందని కొందరు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. నివేదికను, చర్చలను తోసిపుచ్చడంతోపాటు ప్రజల శ్రేయస్సు కోసమే ఇలా చేశానని పృథ్వీరాజ్ చెప్పడంపై ప్రజల్లో ఆయనకున్న గౌరవాన్ని పలుచన చేస్తుందని అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలను కాదనలేకపోతున్నారు. గవర్నర్ పునఃపరిశీలించాలి: వినోద్ తావ్డే ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని విధాన మండలి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డే కోరారు. ఈ విషయమై గవర్నర్ కె. శంకర్ నారాయణ్‌కు ఓ లేఖ రాశారు. అశోక్ చవాన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టవద్దని తీసుకున్న నిర్ణయంపై మళ్లీ పరిశీలించాలని ఆ లేఖలో కోరారు. సీబీఐకి ఆయనను దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘ఆదర్శ్’లో చవాన్ కుమ్మక్కు
షిండే, దేశ్‌ముఖ్, నీలంగేకర్ కూడా తప్పులు చేశారు జ్యుడీషియల్ దర్యాప్తు కమిటీ నివేదికలో వెల్లడి ‘ఆదర్శ్’ హౌసింగ్ సొసైటీ కేటాయింపుల్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన ఆయన సమీప బంధువులు కుమ్మక్కుకు పాల్పడ్డారని ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన జ్యుడీషియల్ కమిటీ తేల్చి చెప్పింది. ‘ఆదర్శ్’ కుంభకోణంపై దర్యాప్తు కోసం 2011లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల జ్యుడీషియల్ కమిటీ, 891 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదిక శుక్రవారం మహారాష్ట్ర శాసనసభ ముందుకురాగా, మహారాష్ట్ర కేబినెట్ దీనిని తోసిపుచ్చింది. కాగా, ఈ వ్యవహారంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే, శివాజీరావు నీలంగేకర్ పాటిల్‌ల చర్యలను కూడా జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది. దక్షిణ ముంబై లో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ చేపట్టిన 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణం పారదర్శకంగా జరగలేదని, దీనికి అనుమతుల మంజూరులో ‘క్విడ్ ప్రో కో’ జరిగిందని వెల్లడించింది. చవాన్ హయాంలో (2008 డిసెంబర్-2010 నవంబర్) ఆయన సన్నిహిత బంధువులు ముగ్గురికి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం లభించినట్లు తెలిపింది. జ్యుడీషియల్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం... చవాన్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు 2002లో ‘ఆదర్శ్’ సొసైటీలో 40 శాతం మంది సాధారణ పౌరులకు కూడా సభ్యత్వం కల్పించాలని సొసైటీని కోరారు. నిజానికి ఇది పూర్తిగా మాజీ సైనికోద్యోగుల కోసం ఏర్పడింది. ఇందులోని సభ్యత్వ ప్రక్రియను, చవాన్ మంజూరు చేసిన అనుమతులను పరిశీలిస్తే ‘క్విడ్ ప్రో కో’ జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ‘ఆదర్శ్’ సొసైటీలో సభ్యత్వం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా, మాజీ ఎమ్మెల్సీ దివంగత కన్హయ్యాలాల్ గిద్వానీ, రక్షణశాఖ అధికారి ఆర్.సి.ఠాకూర్ వంటి కొద్దిమంది బడా వ్యక్తుల కోటరీ చేతుల్లోనే ఉంది. సొసైటీకి కొత్త సభ్యులను ప్రతిపాదించడంలో వారు కీలకమైన, ప్రభావవంతమైన పాత్ర పోషించారు. సభ్యుల పేర్ల ప్రతిపాదనలో వారి మాటే చలామణీ అయ్యేది. మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కూడా ఈ వ్యవహారంలో తప్పటడుగులు వేశారు. ‘ఆదర్శ్’ నిర్మాణానికి దేశ్‌ముఖ్ అదనపు ఎఫ్ఎస్ఐకి (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్-నిర్మాణ హక్కు) అనుమతి మంజూరు చేశారు. అయితే, దేశ్‌ముఖ్‌కు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్‌కుమార్ షిండే (ప్రస్తుత కేంద్ర హోంమంత్రి) ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ్‌ముఖ్ సొసైటీ ప్రమోటర్లకు రాసిన లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) కూడా విమర్శలకు దారితీసింది. అదనపు ఎఫ్ఎస్ఐకి అనుమతి మంజూరులో దేశ్‌ముఖ్ హేతుబద్ధతను గాలికొదిలేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన నిర్ణయం పూర్తిగా అసమంజసమని జ్యుడీషియల్ కమిటీ తప్పుపట్టింది. మాజీ ముఖ్యమంత్రి నీలంగేకర్ పాటిల్ (1985-86లో పది నెలలు సీఎంగా పనిచేశారు), గత దశాబ్దంలో కొద్దికాలం రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. నీలంగేకర్తో పాటు షిండే ‘ఆదర్శ్’ సొసైటీ గృహ సముదాయం కోసం స్థలం కేటాయింపులో పొరపాట్లు చేసినట్లు జ్యుడీషియల్ కమిటీ స్పష్టం చేసింది. భూమి విలువపై ఆర్థికశాఖ చేసిన సూచనలను షిండే ఏమాత్రం పట్టించుకోలేదని, స్థలం కేటాయింపు కోసం కేబినెట్ ఆమోదం పొందడంలోనూ ఆయన విఫలమయ్యారని తెలిపింది. ‘ఆదర్శ్’ నిర్మాణానికి అనుమతులు మంజూరైన కాలంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన నీలంగేకర్ పాటిల్ సొసైటీకి స్థలం కేటాయింపు అనుమతి మంజూరు విషయంలో అనవసర ఆత్రాన్ని ప్రదర్శించారని ఎత్తిచూపింది. అదో చేదు ఘట్టం: మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ‘ఆదర్శ్’ కుంభకోణాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఒక చేదు ఘట్టంగా అభివర్ణించారు. అయితే, దీనిపై జ్యుడీషియల్ కమిటీ నివేదికను తోసిపుచ్చాలన్నది కేబినెట్ నిర్ణయమని ఆయన చెప్పారు. కుంభకోణం చోటు చేసుకున్నప్పటి నుంచి... నాయకత్వ మార్పునకు దారి తీసేంత వరకు... మొత్తం వ్యవహారమంతా చేదు ఘట్టమేనని ఆయన అన్నారు. అయితే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులను అభిశంసించిన జ్యుడీషియల్ కమిటీ నివేదికను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించగా, బదులిచ్చేందుకు నిరాకరించారు. జ్యుడీషియల్ కమిటీ నివేదికను తిరస్కరించడం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తగలవని ప్రశ్నించగా, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తనకు తెలియదని, జరిగిందేదో జరిగిపోయిందని బదులిచ్చారు. ఇదిలా ఉండగా, ‘ఆదర్శ్’ దోషులపై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నివేదికను రూపొందించగా, రాష్ట్ర కేబినెట్ దానిని తోసిపుచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. దానికి బదులుగా, జ్యుడీషియల్ కమిటీ నివేదికలోను తొలి రెండు అంశాలను ఆమోదిస్తూ, మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నట్లు ముసాయిదా నివేదికను రూపొందించినట్లు వెల్లడించాయి. కాగా, మాజీ సీఎం అశోక్ చవాన్‌పై సీబీఐ దర్యాప్తుకు గవర్నర్ తన విచక్షణాధికారాలతోనే అనుమతి నిరాకరించారని అధికార వర్గాలు చెప్పాయి.