ఏసీబీ దాడితో అధికారుల్లో వణుకు | Sakshi
Sakshi News home page

ఏసీబీ దాడితో అధికారుల్లో వణుకు

Published Fri, May 15 2015 12:23 AM

Location panchayat officials caught by ACB officials

- తెల్లవారుజాము వరకు కొనసాగిన విచారణ  
- ఫోన్లు స్విఛాఫ్ పెట్టుకున్న బడంగ్‌పేట పంచాయతీ సిబ్బంది
సరూర్‌నగర్:
బడంగ్‌పేట నగరపంచాయతీ కార్యాలయంలో అవినీతి అధికారులకు ఏసీబీ అధికారులు చెక్ పెట్టడంతో మిగతా అధికారులతో పాటు, కొంతమంది కౌన్సిలర్లకు వణుకు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కమిషనర్ త్రిల్లేశ్వర్‌రావు, సీనియర్ అసిస్టెంట్ చిత్రం నరేష్‌ను గురువారం తెల్లవారుజూము వరకు కార్యాలయంలోనే విచారించారు. వర్క్‌లకు సంబంధించిన బుక్కులను, ఎంబీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పంచాయతీలో పనిచేస్తున్న ఇతర సిబ్బందిని కూడా విచారించినట్టు తెలిసింది.

టెండర్ల గోల్‌మాల్
మునిసిపల్ చట్టం ప్రకారం రూ. లక్ష ఆపై పనులకు కచ్చితంగా ఆన్‌లైన్ ద్వారా టెండర్  వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవాలి. అయితే లక్ష దాటనీయకుండా రూ.98, 96, 88 వేలకే పనులు ఉన్నాయని చెబుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, కోట్ల రూపాయల పనులు చేసినట్లుగా రికార్డుల్లో చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.  

వందకు పైగా అనుమతిలేని వెంచర్లు:
నగరపంచాయితీ పరిధిలో నాలుగు వెంచర్లు తప్పా మిగతా 150కి పైగా వెంచర్లు అనుమతులు లేనివే. అయితే వీటిపై చర్యలు తీసుకోవాలని ఎవరైన ఫిర్యాదులు చేస్తే చాలు వాటిని ఆసరాగా చేసుకొని కమిషనర్, పంచాయతీ సిబ్బంది వెంచర్ యజమాని నుంచి డబ్బు దండుకుంటున్న వ్యవహారంపై కూడా ఏసీబీ కూపీలాగుతోందని సమాచారం.

అధికారుల్లో వణుకు
ఏసీబీ అధికారుల దాడి విషయం తెలిసి ఇదే కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అవినీతి అధికారులు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకొని అందుబాటులో లేకుండాపోయారు.  గురువారం కొద్దిమంది ఉద్యోగులు పంచాయతీ కార్యాలయానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది లేక కార్యాలయం బోసిపోయింది.

Advertisement
Advertisement