చిత్తూరు సెక్స్ రాకెట్లో నిర్ఘాంతపోయే నిజాలు ! | one man sent to prostitution houses for 90 members in chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు సెక్స్ రాకెట్లో నిర్ఘాంతపోయే నిజాలు !

Sep 20 2016 9:09 AM | Updated on Sep 4 2017 2:08 PM

నిందితులు పాండియన్, రఫీ (ఫైల్‌)

నిందితులు పాండియన్, రఫీ (ఫైల్‌)

90 మంది మహిళల్ని మలేషియా, సింగపూర్, గల్ఫ్‌ దేశాలకు పంపించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

 విదేశాలకు మహిళల తరలింపులో నోరువిప్పిన నిందితుడు
 గొలుసుకట్టులా వెళుతున్న దర్యాప్తు
 
► ‘ఎర్ర’ కేసుల్ని తలదంటున్న అక్రమ తరలింపు

చిత్తూరు : అతనొక్కడే 90 మంది మహిళల్ని విదేశాల్లో వేశ్యా గృహాలకు తరలించాడు. మహిళలను ఉద్యోగాల పేరు చెప్పి విదేశాల్లోని వ్యభిచార గృహాల్లో విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు రఫీని విచారించిన పోలీసులు పలు వివరాలను రాబట్టారు. ఉద్యోగాల పేరుతో విదేశాల్లోని వేశ్యాగృహాలకు విక్రయిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా సత్యవేడులో ఓ మహిళ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమేరకు చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇరవై రోజుల క్రితం చెన్నైలో తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే ముఠాకు చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోమేశ్వర రావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏసుప్రేమ, చెన్నైకి చెందిన ఫాతిమాలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో రఫీ, పాండియన్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.

ఈ సందర్భంగా సోమవారం రఫీ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. చెన్నైకి చెందిన రఫీ చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఏజెంట్లను నియమించుకున్నాడు. భర్తతో విడిపోయిన మహిళలు, వితంతువులు, పెద్దగా బంధువులు లేనివాళ్లను, ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసేవాడు. ఈ క్రమంలో తానొక్కడే 90 మంది మహిళల్ని మలేషియా, సింగపూర్, గల్ఫ్‌ దేశాలకు పంపించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దాదాపు అందర్నీ వ్యభిచార గృహాలకు అమ్మేసినట్లు చెప్పడంతో పోలీసులే షాక్‌కు గురయ్యారు. కాగా వీళ్లల్లో ఎంతమంది విదేశాల్లో ఉన్నారు..? ఎంతరు స్వదేశానికి తిరిగొచ్చారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహిళల పేర్లను పాస్‌పోర్టు కార్యాలయాల్లో పరిశీలిస్తున్న పోలీసులు ఈ కేసు విచారణలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

చైన్‌ లింక్‌...
మరోవైపు మహిళల అక్రమ తరలింపులో నిందితుల గుట్టు లాగే కొద్దీ ఇదో గొలుసు కట్టుగా అల్లుకుంటూ పోతోంది. గత 20 రోజుల్లో చిత్తూరు జిల్లాలో మహిళల అక్రమ తరలింపులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన నేరాంగీకార ఒప్పుకోలు పత్రంలో  40 మందికి పైగా పేర్లు చెప్పారు. వీళ్లను పట్టుకునేందుకు పోలీసులు పలు జిల్లాల్లో బృందాలుగా వెళ్లి విచారణ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఎలాగయితే కూలీలు, మేస్త్రీలు, పైలెట్‌లు, జిల్లా, అంతర్‌ జిల్లా, అంతరాష్ట్ర, జాతీయ, విదేశీ స్మగ్లర్లు ఉన్నారో.. ఇదే తరహాలో మహిళల అక్రమ తరలింపులో కూడా వెలుగు చూస్తోంది. ఈ గూడుపుఠాణీను కిందిస్థాయి వరకు పెకలించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement