ప్రతి ఒక్కడు ధోని కాలేడన్నా!

Twitterati Roasts Rishabh Pant With MS Dhoni Reminder for Failed Chances - Sakshi

దినేశ్‌ కార్తీక్‌ను తీసుకోవాలంటున్న అభిమానులు

మొహాలీ : టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ప్రత్యామ్నాయం యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంతేనని, అతన్ని ప్రపంచకప్‌ రెండో వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. కీపర్‌గానే కాకుండా పంత్‌ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తాడనే వాదనలు వినిపించాయి. విటన్నిటీని.. ముఖ్యంగా లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు.. మరో సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ను పక్కనబెట్టి మరీ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. తొలి మూడు వన్డేల్లో ధోని ఉండటంతో పంత్‌కు అవకాశం రాలేదు. ఇక ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లకు ధోని విశ్రాంతి కోరడంతో పంత్‌కు తుది జట్టులో అవకాశం లభించింది.

ఆదివారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంత్‌ బరిలో దిగాడు. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో మెరుపులు కూడా మెరిపించాడు. కానీ అతని కీపింగ్‌లోని లుకలుకలే ఈ మ్యాచ్‌తో బయటపడ్డాయి. ఒక సునాయస క్యాచ్‌తో పాటు.. రెండు కీలక స్టంపౌట్‌లను చేజార్చి భారత విజయవకాశాలను దెబ్బతీశాడు. ఇక ఇందులో ఓ సునాయస స్టంపౌట్‌ను ధోని స్టైల్‌లో చేయబోయి విఫలమయ్యాడు. దీంతో మైదానంలోని ప్రేక్షకులు ధోని..ధోని.. అంటూ స్లోగన్స్‌ చేశారు. ఇక కెప్టెన్‌ కోహ్లి అయితే పంత్‌ కీపింగ్‌ పట్ల.. మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం కూడా ఓటమికి స్టంపౌట్‌, క్యాచ్‌లు చేజార్చడమేనని చెప్పుకొచ్చాడు.

పంత్‌ తాజా ప్రదర్శన పట్ల భారత అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. భారత ఓటమికి పంతే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. తమ ఎడిటింగ్‌ నైపుణ్యానికి పనిచెప్పి ఫన్నీ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నాయి. ‘ అంపైర్‌.. ఇప్పుడు పంత్‌ను మార్చవచ్చా..’ అని కోహ్లి అడుగుతున్నట్లు ఉన్న మీమ్‌ తెగ హల్‌చల్‌ చేస్తోంది. ‘ప్రతి ఒక్కడు ధోని కాలేడబ్బా.. ధోని స్థానాన్ని భర్తీ చేసేవారే లేరు. అందుకే పంత్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దన్నది’ అని కామెంట్‌ చేస్తున్నారు. పంత్‌ కన్నా కీపింగ్‌లో దినేశ్‌ కార్తీక్‌ నయమని, అతని అనుభవం ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఉపయోగపడుతుందంటున్నారు. అసలు సెలక్టర్లు కార్తీక్‌ను ఎందుకు పక్కన పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్నారు. వెంటనే దినేశ్‌ కార్తీక్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top