ఆసీస్ విజయలక్ష్యం 128 | Sakshi
Sakshi News home page

ఆసీస్ విజయలక్ష్యం 128

Published Sat, Dec 20 2014 9:27 AM

ఆసీస్ విజయలక్ష్యం 128

బ్రిస్బేన్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.   ఓపెనర్ శిఖర్ థవన్ (81) చటేశ్వర పూజారా(43)పరుగులు మినహా ,మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చెందడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులకే పరిమితమైంది. 76 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ వికెట్టును కోల్పోయిన టీమిండియా.. ఆ తరువాత క్రీజ్ లో నిలబడటానికే బెంబేలెత్తింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు.

 

ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో వైఫల్యం చెందిన శిఖర్ ఈ మ్యాచ్ లో మాత్రం హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా.. టీమిండియా స్కోరును రెండు వందలు దాటించి పరువు దక్కించాడు.  ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా, హజిల్ వుడ్ ,స్టార్క్, లాయన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగే ఆసీస్ గెలుపు దాదాపు ఖాయంగానే కనబడుతోంది.

Advertisement
Advertisement