పాక్‌ జట్టులో రాజకీయాలు!

Reports Suggest Mohammad Amir And Imad Wasim Promoting Groupism in Pakistan Team - Sakshi

రెండు గ్రూప్‌లుగా ఆటగాళ్లు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ జట్టులో గ్రూప్‌ రాజకీయాలు చోటుచేసుకున్నాయా? ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారా? కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాటను ఆటగాళ్లెవరు ఖాతరు చేయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి.. పాక్‌ మీడియా వర్గాలు. పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌, ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీంల నేతృత్వంలో ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారని, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాటలను ఖాతరు చేయడం లేదని ఆ దేశ మీడియా కథనాలు వడ్డిస్తోంది. ఈ గ్రూప్‌ రాజకీయాల వ్యవహారంలో పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ హస్తం కూడా ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్‌ మైదానంలో వ్యూహాలు రచించలేకపోయాడని, ఆటగాళ్ల వర్గపోరుతో అతను ప్రశాంతత కోల్పోయాడని తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఇమాద్‌ వసీం, షోయబ్‌ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఏమాత్రం లెక్కచేయడం లేదంటున్నాయి. ఇక భారత్‌తో ఘోర ఓటమి అనంతరం సర్ఫరాజ్‌ జట్టు ఆటగాళ్లను మందలించాడని, గ్రూప్‌ రాజకీయాలు విడిచిపెట్టి కనీసం టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా బాగా ఆడాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే..? తనతో పాటు స్వదేశంలో ఒంటరిగా ఎవరూ అడుగు పెట్టలేరని సర్ఫరాజ్‌ హెచ్చరించినట్లు వివరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ ఆడియోక్లిప్‌ ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధికారి, నటుడు రాజు జమిలి మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియోక్లిప్‌.. ప్రస్తుతం ఆ దేశ క్రికెట్‌ వర్గాల్లో దుమరాన్ని రేపుతోంది. ఆ ఆడియోలో పాక్‌ జట్టులో ఇమామ్‌ , ఇమాద్‌, షోయబ్‌ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఖాతరు చేయడం లేదని, ఆటగాళ్లు మహ్మద్‌ ఆమిర్‌, ఇమాద్‌ గ్రూప్‌లుగా విడిపోయారన్న రాజు జమిలి.. ఈ గ్రూప్‌ రాజకీయాల్లో చీఫ్‌ సెలక్టర్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ పాత్ర కూడా ఉందన్నారు. సర్ఫరాజ్‌ను జట్టు నుంచి దూరం చేయడానికి కొంత మంది ఆటగాళ్లు కుట్రపన్నుతున్నారని తెలిపారు. ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా తనకు షోయబ్‌ మాలిక్‌ తారాసపడ్డాడని, సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడని రాజు జమిలి అన్నట్లు ఆ ఆడియోక్లిప్‌లో ఉంది. రాజు జమిలి ఆరోపణలపై స్పందించిన పీసీబీ.. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. అతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top