బిగ్‌బాష్‌ విజేత రెనెగేడ్స్‌ | Melbourne Renegades beat Melbourne Stars to win title | Sakshi
Sakshi News home page

బిగ్‌బాష్‌ విజేత రెనెగేడ్స్‌

Feb 18 2019 2:39 AM | Updated on Feb 18 2019 2:39 AM

 Melbourne Renegades beat Melbourne Stars to win title - Sakshi

మెల్‌బోర్న్‌:  ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌ టి20 టోర్నీ టైటిల్‌ను తొలిసారి మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెల్‌బోర్న్‌లోని డాక్‌ల్యాండ్స్‌ స్టేడియంలో అదే నగరానికి చెందిన రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన తుది పోరులో చివరకు రెనెగేడ్స్‌దే పైచేయి అయింది. టాస్‌ ఓడి  బ్యాటింగ్‌కు దిగిన రెనెగేడ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేయగా... అనంతరం స్టార్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. ముందుగా రెనెగేడ్స్‌ తరఫున టామ్‌ కూపర్‌ (35 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్‌ క్రిస్టియాన్‌ (30 బంతుల్లో 38 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆరో వికెట్‌కు అభేద్యంగా 58 బంతుల్లో 80 పరుగులు జోడించి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు.

15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 91 పరుగులే. అయితే చివరి 5 ఓవర్లలో రెనెగేడ్స్‌ 54 పరుగులు రాబట్టింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టార్స్‌కు ఓపెనర్లు బెన్‌ డంక్‌ (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మార్కస్‌ స్టొయినిస్‌ (38 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 77 బంతుల్లో 93 పరుగులు జోడించారు. చేతిలో 10 వికెట్లు ఉండగా... గెలుపు కోసం స్టార్స్‌ మిగిలిన 43 బంతుల్లో 53 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ దశలో ట్రైమెన్‌ (2/21), బాయ్‌స్‌ (2/30), క్రిస్టియాన్‌ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరి దెబ్బకు స్టార్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.

ఫలితంగా ఆ జట్టు 43 బంతుల్లో 7 వికెట్లు చేజార్చుకొని 39 పరుగులే చేయగలిగింది. ప్రధాన ఆటగాళ్లు హ్యాండ్స్‌కోంబ్‌ (0), మ్యాక్స్‌వెల్‌ (1), మ్యాడిసన్‌ (6), డ్వేన్‌ బ్రేవో (3) విఫలమయ్యారు. క్రిస్టియాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇది ఎనిమిదో టోర్నీ. వీటిలో పెర్త్‌ స్కార్చర్స్‌ మూడు సార్లు విజేతగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్‌ హీట్, అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ఒక్కోసారి టైటిల్‌ గెలుచుకున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement