శాసనసభా పక్ష నేతగా వైఎస్‌ జగన్‌ నేడు ఎన్నిక | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఎన్నిక

Published Sat, May 25 2019 3:41 AM

YSRCP MLAs to elect YS Jagan as Legislative Leader today - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన వైఎస్సార్‌ శాసనసభాపక్షం నేతగా ఎన్నిక కాబోతున్నారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం విజయవాడ తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. శనివారం ఉదయం సరిగ్గా 10.31 గంటలకు వైఎస్సార్‌ ఎల్పీ సమావేశం ప్రారంభం అవుతుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఎమ్మెల్సీలు ఉదయం 9.45 నుంచి 10 గంటలలోపు క్యాంపు కార్యాలయానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

శాసనసభాపక్షం నేతగా జగన్‌ను ఎన్నుకున్న తర్వాత 11.32 గంటలకు అక్కడే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారని వారు వివరించారు. జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారన్నారు. అనంతరం విజయవాడలో 30వ తేదీన జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మొదలవుతాయని చెప్పారు. 

ఇకపై వైఎస్సార్‌ఎల్పీ, వైఎస్సార్‌పీపీ
తమ పార్టీ శాసనసభాపక్షాన్ని ఇకపై వైఎస్సార్‌ ఎల్పీ (లెజిస్లేచర్‌ పార్టీ)గా, పార్లమెంటరీ పార్టీని వైఎస్సార్‌ పీపీగా పిలుస్తామని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఈ మేరకు తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని, ఇకపై అందరూ ఇలాగే పిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   

Advertisement
Advertisement