‘రణ’మూల్‌

Party Profile Trinamool Congress Mamata Banerjee - Sakshi

పార్టీ ప్రొఫైల్‌  తృణమూల్‌ కాంగ్రెస్‌

పశ్చిమబెంగాల్‌ యువజన కాంగ్రెస్‌ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో 26 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని స్థాపించిన పార్టీయే ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (ఏఐటీసీ/టీఎంసీ). బెంగాల్‌లో ప్రస్తుత పాలకపక్షంగా ఉన్న ఈ పార్టీ 1998 జనవరి 1న ఆవిర్భవించింది. దీదీ, అంతకు ముందు బెంగాల్‌ ‘అగ్నికన్య’గా పేరు సంపాదించిన మమత పోరాట పటిమ, 34 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలకాలనే పట్టుదలతో స్థాపించిన 13 ఏళ్లకే (2011) తృణమూల్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా తిరుగులేని మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. సీపీఎం మొదటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో కాంగ్రెస్‌ నేతగా మార్క్సిస్ట్‌ సర్కారుపై ఎడతెగని పోరాటం చేశారు. 2000 నవంబర్‌లో జ్యోతిబసు వారసునిగా వచ్చిన సీనియర్‌ సీపీఎం నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య హయాంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పదిన్నరేళ్ల కాలం హింసాత్మక ఉద్యమాలతో సంచలనం సృష్టించింది. చివరికి 2011 మే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకుంది.

మమత ‘నిరసన నృత్యం’
1970ల చివర్లో జనతా పార్టీకి స్ఫూర్తిప్రదాత జయప్రకాశ్‌ నారాయణ్‌ కారు బానెట్‌పై యూత్‌ కాంగ్రెస్‌ నేతగా ఎదుగుతున్న మమత డాన్స్‌ చేసి మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం సమరశీల కార్యకర్తల ధాటికి కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడి పారిపోయే రోజుల్లో ఆమె వారికి ఎదురొడ్డి నిలిచి దెబ్బలు తిన్నారు. జ్యోతిబసు హయాంలో 1991లో వామపక్ష కార్యకర్తల దాడిలో మమత తల పగిలి కుట్లుపడ్డాయి.

తృణమూల్‌ పార్టీ ఆవిర్భావం
1996–98 మధ్య కేంద్రంలో పాలన సాగించిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలకు లోక్‌సభలో బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రయోగం కారణంగా బెంగాల్‌లో సీపీఎంతో కాంగ్రెస్‌ రాజీపడుతోందని మమత గ్రహించారు. ఈ క్రమంలోనే 1998 జనవరి 1న పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించారు. కొన్ని నెలలకే జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే టీఎంసీకి 7 సీట్లు రాగా, మిత్రపక్షం బీజేపీకి ఒక స్థానం దక్కింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుని పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లు తృణమూల్‌ కైవసం చేసుకుంది. వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడో ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రి అయ్యారు. 2001 వేసవిలో జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి మమత సహా తృణమూల్‌ మంత్రులు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు 226 స్థానాలకు పోటీచేసి 60 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది. మళ్లీ 2003 సెప్టెంబర్‌లో తృణమూల్‌ (మమతా) వాజ్‌పేయి ప్రభుత్వంలో చేరింది.

2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు
2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తృణమూల్‌ పొత్తుపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో పాటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. టీఎంసీకి ఒకే ఒక సీటు దక్కింది. 2006 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. తృణమూల్‌ బలం 60 నుంచి 30కి పడిపోయింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ 235 సీట్లు సాధించింది. మమత, తృణమూల్‌ పని ఇక అయిపోయిందనుకున్న ఈ దశలో బుద్ధదేవ్‌ సర్కారుపై బ్రహ్మాండమైన పోరు సాగించడానికి తృణమూల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో సింగూరులో సారవంతమైన వేయి ఎకరాల భూమిని సీపీఎం సర్కారు టాటా మోటార్స్‌ నానో కారు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించింది. భూసేకరణను రైతులు వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా మమత కోల్‌కతాలో 25 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మరో విదేశీ సంస్థకు నందిగ్రామ్‌లో కెమికల్‌ కాంప్లెక్స్, స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి కేటాయించడమేగాక 70 వేల మంది ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమంతోనూ తృణమూల్‌ లబ్ధిపొందింది. సింగూర్, నందిగ్రామ్‌తోపాటు భాంగోర్, సాల్బొనీ లాల్‌గఢ్, నయాచార్‌లో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల హింస, అత్యాచారాల ఫలితంగా బుద్ధదేవ్‌ ప్రభుత్వం, కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. పరిస్థితులు తృణమూల్‌కు అనుకూలంగా మారాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని టీఎంసీ 19 సీట్లు గెలుచుకుంది.

అధికార పీఠంపై మమత
2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన తృణమూల్‌ సొంతంగానే మెజారిటీ సీట్లు సాధించింది. తృణమూల్‌ కూటమికి 227 సీట్ల భారీ మెజారిటీ లభించింది. ఒక్క తృణమూల్‌కే 184 స్థానాలు దక్కడంతో మంత్రివర్గంలో ఇతర పార్టీలకు స్థానం కల్పించలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మమత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఐదేళ్ల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో తృణమూల్‌ పలుకుబడి విపరీతంగా పెరిగింది. సీపీఎం సహా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఎంసీలో చేరారు. టీఎంసీని రాజకీయంగా ఎదుర్కొనలేక సీపీఎం, ఇతర వామపక్షాలు చతికిలపడ్డాయి. ముస్లింలు కూడా పాలకపక్షానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 34 కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్రమోదీతో ఓ పక్క, కమ్యూనిస్టులతో మరోపక్క పోరాడుతూనే టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లకు పోటీచేసి 211 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకు 200 లేదా అంతకన్నా తక్కువ సీట్లు వస్తే ప్రధాని అయ్యే అవకాశం వస్తుందనే అంచనాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు.  

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ సీట్లు
1998 - 7
1999 - 8
2004 - 1
2009 - 19
2014 - 34

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top