భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాం  | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాం 

Published Tue, Nov 20 2018 4:24 AM

Chandrababu Naidu Comments after meeting with Mamata banerjee - Sakshi

సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల కూటమి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక విషయంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారం ఆయన కోల్‌కతాలో మమతతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేయాలన్నదానిపై తాము చర్చించామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని, సీనియర్‌ నాయకులుగా అది తమ బాధ్యత న్నారు. తమ రాష్ట్రాల్లోకి సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు రాకుండా సమ్మతిని ఉపసంహరించుకున్న అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్‌బీఐ, కాగ్‌ తదితర సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఈ నెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న సమావేశం ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, ఎప్పుడు సమావేశమయ్యేది తరువాత నిర్ణయిస్తామన్నారు. డిసెంబరు 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయని, ఆ సమావేశాల ఆరంభానికి ముందే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమావేశమయ్యే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతితో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ప్రశ్నకు.. మోదీ కన్నా తామందరం సీనియర్లమని చంద్రబాబు జవాబిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 19న మమతాబెనర్జీ కోల్‌కతాలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తాను హాజరవుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశాన్ని పరిరక్షించుకొనేందుకే కలిసి నడుస్తున్నామని, ఇకపై కూడా కలిసే పనిచేయబోతున్నామని చెప్పారు. ఇంతకుముందు కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినప్పుడు తామందరం  మద్దతుగా నిలిచామని గుర్తుచేశారు. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నిటినీ ఎవరు ముందుండి నడిపిస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆమె  సమాధానమిస్తూ... అందరూ ముందుండి నడిపిస్తారన్నారు. మమతాబెనర్జీని కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులున్నారు.

22న ఢిల్లీలో సమావేశానికి మమత నో
ఈనెల 22న ఢిల్లీలో కాంగ్రెస్‌తో పాటు వివిధ బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి మమతాబెనర్జీ అంగీకరించలేదని తెలిసింది. దీనిపై కొన్ని షరతులు విధించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశానికి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ తదితరులు హాజరుకానున్న నేపథ్యంలో మమతా షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముందే తేల్చాలన్న దానితో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఆమె తెరపైకి తెచ్చినట్లు చెపుతున్నారు. దీంతో ఈనెల 22న జరగాల్సిన సమావేశం వాయిదా పడిందని రాజకీయ వర్గాలు చెప్పాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement