సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురు

Published Wed, May 7 2014 2:41 AM

సల్మాన్‌ఖాన్‌కు చుక్కెదురు

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ‘హిట్ అండ్ రన్’ కేసులో చుక్కెదురైంది. మంగళవారం ముంబైలోని సెషన్స్ కోర్టులో ఈ కేసు పునర్విచారణ సందర్భంగా నాటి ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు (మనూఖాన్, మొహమ్మద్ కలీం ఇక్బాల్ పఠాన్, ముస్లిం షేక్ లు) సల్మాన్ ఖాన్‌ను నిందితుడిగా గుర్తించారు. స్థానికులు చుట్టుముట్టి కార్లోంచి దిగాల్సిం దిగా అరవడంతో మద్యం మత్తులో ఉన్న సల్మాన్ కారులోంచి దిగినట్లు చెప్పారు.
 
 అప్పుడు స్థానికులు సల్మాన్‌ను పట్టుకోగా కార్లోంచి దిగిన అతని భద్రతాధికారి (రవీంద్ర పాటిల్) తాను పోలీసునని చెప్పడంతో వారు సల్మాన్‌ను విడిచిపెట్టారని సాక్షులు కోర్టుకు వివరించారు. కేసు విచారణకు సల్మాన్ కూడా హాజరయ్యారు. 2002 సెప్టెంబర్ 28న రాత్రి సబర్బన్ బాంద్రాలో ఓ బేకరీ సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై సల్మాన్ నడిపిన కారు (టొయోటా లాండ్ క్రూజర్) దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. సల్మాన్‌పై ఆరోపణలు రుజువైతే అతనికి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. కాగా, రూ. ఐదు లక్షలు తీసుకొని ఈ కేసు నుంచి తప్పుకోవాలని ముస్లిం షేక్‌ను ఓ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement
Advertisement