ఇక భారీ చిత్రాల హంగామా | Ready to make clamor screen in big budget films | Sakshi
Sakshi News home page

ఇక భారీ చిత్రాల హంగామా

Oct 17 2014 12:45 AM | Updated on Sep 2 2017 2:57 PM

ఇక భారీ చిత్రాల హంగామా

ఇక భారీ చిత్రాల హంగామా

ఇక భారీ చిత్రాల హంగామా త్వరలో మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్, సియాన్ విక్రమ్, ఇళయదళపతి విజయ్, విశాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు

 ఇక భారీ చిత్రాల హంగామా త్వరలో మొదలు కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్, సియాన్ విక్రమ్, ఇళయదళపతి విజయ్, విశాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా తెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయి. దీంతో జనవరి వరకు చిన్న బడ్జెట్ చిత్రాలు విడుదలకు అవకాశం లేదు. ఇది చిన్న నిర్మాతలకు బాధాకరమైన విషయమే. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ నిర్మాతలు వడ్డీల భారం మోయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ఇక వచ్చే వారం నుంచి విడుదలయ్యే భారీ చిత్రాల వివరాల్లోకెళితే దీపావళికి విజయ్ కత్తి, విశాల్ పూజై బరిలోకి దిగుతున్నాయి.
 
   దీపావళికి కత్తి
 విజయ్, సమంత జంటగా నటించిన చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కత్తి చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.
 
   మాస్ మసాలా పూజై
 విశాల్ నటించిన పూజై చిత్రం కూడా మాస్ మసాలా చిత్రమే. క్రేజీ బ్యూటీ శ్రుతిహాసన్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ పూజైపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కారణం ఈమెకి అర్జంటుగా ఇక్కడ హిట్ అవసరం. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన మరో హై వోల్టేజ్ యాక్షన్‌చిత్రం పూజై. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. నటి ఆండ్రియూ ఐటమ్‌సాంగ్‌అదనపు ఆకర్షణగా నిలుస్తుందంటున్నారుు చిత్ర యూనిట్ వర్గాలు.
 
   శంకర్ చిత్రం ఐ
 ఈ చిత్రాల హవా కొనసాగుతుండగానే స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన అత్యంత భారీ బ్రహ్మాండమైన చిత్రం ఐ తెరపైకి రానుంది. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు అందించారు. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన మరో అద్భుత చిత్రం ఐ. సినిమా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం క్రేజ్ డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
 
   రజనీ బర్త్‌డే కానుక
 డిసెంబర్ 12కు ఒక ప్రత్యేకత ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజది. ఆ రోజున ఆయన నటిస్తున్న మెస్మరైజింగ్ చిత్రం లింగాను విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకపాత్ర 80 కాలంలోనిది కాగా మరో పాత్ర సమకాలానికి చెందిందని సమాచారం. ఈ పాత్రలో రజని జీన్స్ ప్యాంటు, షర్టు ధరించి నడిచొస్తున్న స్టిల్స్ చూసి ఆయన అభిమానుల మనసు ఇప్పుడే ఉరకలేస్తోంది. ఇక చిత్రం విడుదలైన తరువాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనే అంచనాలు పెరుగుతున్నారుు. ముంబయి బ్యూటీ సోనాక్షి సిన్హా, అందాల భామ అనుష్కతో లింగా చిత్రానికి అదనపు ఆకర్షణే. ఈ చిత్రం హవా జనవరి వరకు సాగుతుందనడానికి ఎలాంటి సందేహం ఉండదు.
 
   చివర్లో విశ్వరూపం 2
 ఈ ఏడాది చివరిలోనే విశ్వనాయకుడు కమల్ విశ్వరూపం-2 తెరపైకి రానున్నట్లు సమాచారం. విశ్వరూపం చిత్రంలోనే సంచలనం సృష్టించిన కమల్ దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండటం సహజమే. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి రెండు రోజులు షూటింగ్ జరపాల్సి ఉందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి కమల్ నటించిన ఉత్తమ విలన్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ముందుగా ఈ చిత్రాన్నే విడుదల చేయాలనుకున్నారు. కారణాలేమైనా ఈ చిత్రం జనవరి తరువాతనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కమలహాసన్ నటిస్తున్న పాపనాశం చిత్రాన్ని కూడా 2015లోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా భారీ చిత్రాలు వరుసగా తెరపైకి రానుండడంతో చిన్న చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు లేదు. అయితే ఈ చిత్రలు ఓవర్ ఫ్లోపై ఆశపెట్టుకున్న కొందరు చిన్న నిర్మాతలు తమ చిత్రాలను ధైర్యం చేసి వాటితో పాటు రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు. ధనుష్ నటించిన అనేగన్, ఆర్య హీరోగా నటిస్తున్న మిగామాన్, శివకార్తికేయన్ కాకీచట్టై, విజయ్ సేతుపతి నటించిన ఇడం పొరుల్, ఎవల్, జయంరవి నటించిన భూలోకం తదితర 15 చిత్రాలు జనవరి తరువాతనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement