వివాదాస్పద 'ముద్దు'పై స్పందించిన సింగర్ | Singer Papon releases a letter over kissing a minor girl | Sakshi
Sakshi News home page

వివాదాస్పద 'ముద్దు'పై స్పందించిన సింగర్

Feb 23 2018 6:34 PM | Updated on Apr 3 2019 7:03 PM

Singer Papon releases a letter over kissing a minor girl - Sakshi

బాలికకు ముద్దిస్తున్న సింగర్ పాపన్

సాక్షి, ముంబై: 'బాలికకు అసభ్య ముద్దు' అంటూ గత కొన్నిరోజులుగా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సింగర్ కమ్ కంపోజర్ పాపన్ అంటున్నాడు. లేనిపోని రాద్ధాంతం చేయడం వల్ల బాలిక కుటుంబంతో పాటు తన ఫ్యామిలీ చిక్కుల్లో పడుతుందని, తాను ఎలాంటి తప్పుచేయలేదని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ వివాదానికి సంబంధించి ఓ లేఖ విడుదల చేశాడు పాపన్. పాపన్‌గా పేరుపొందిన అన్గరాగ్‌ మహంతా ఓ ఛానెల్‌ లో ప్రసారమవుతున్న వాయిస్‌ ఇండియా కిడ్స్‌ ప్రోగ్రాంకి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. మెంటర్‌గా ఉన్న పాపన్.. హోలీ ఎపిసోడ్ అనంతరం ఓ బాలిక(11) ముఖానికి రంగురుద్ది పెదాలపై ముద్దాడాడు. దీంతో సింగర్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. 

బాలీవుడ్ సింగర్ లేఖలో ఏమన్నాడంటే.. 'నాకు పెళ్లయి 14 ఏళ్లయింది. సంతానంగా ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఏదైనా విషయాన్ని వెంటనే వ్యక్తం చేయడం నాకు అలవాటు. అందులో భాగంగానే ఓ 11 ఏళ్ల చిన్నారికి ముద్దు పెట్టాను. దురుద్దేశంతో చేసిన చర్య ఎంత మాత్రం కాదు. అలా అనుకుంటే నా ఫేస్‌బుక్ లైవ్ వీడియోగా ఎందుకు అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తానో మీరే ఆలోచించండి. ఏ తప్పుచేయలేదని భావిస్తున్నాను. ముద్దు పెట్టుకున్నందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ నేను చేసిన దాంట్లో తప్పుందనుకుంటే ఇదివరకే నా ఫేస్‌బుక్‌లో ఆ వీడియోను డిలీట్ చేసేవాణ్ని. మీరు చేసే విమర్శలు, వ్యాఖ్యలు రెండు కుటుంబాల్లో చిచ్చు పెడుతాయి. ఓ అమాయక చిన్నారి జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దంటూ' పలు విషయాలను పాపన్ రాసుకొచ్చాడు. 

మరోవైపు మైనర్ బాలిక తండ్రి సైతం సింగర్‌ పాపన్‌ను వెనకేసుకొచ్చారు. 'పాపన్ కావాలని ఆ పని చేయలేదు. అతడిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదని' బాలిక తండ్రి ఇదివరకే స్పందించారు. తన గురించి తెలిసిన వాళ్లు పాపోన్ తప్పుచేశాడని భావించడం లేదని,ఈ వివాదంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పాపన్ తెలిపాడు. 

కాగా, సుప్రీం కోర్టు న్యాయవాది రునా భుయాన్‌.. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘంలో సింగర్ పాపన్‌పై ఫిర్యాదు చేశారు. పోక్సో(POCSO) యాక్ట్‌ కింద పాపోన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని భుయాన్‌ కోరుతున్నారు. వివాదం ముదురుతున్న కొద్దీ దీనిపై సింగర్ పాపన్ లేఖ ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement