చైల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయమై.. అంచెలంచెలుగా ఎదిగి..! | Sakshi
Sakshi News home page

చైల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయమై.. అంచెలంచెలుగా ఎదిగి..!

Published Tue, Dec 12 2017 9:07 AM

Actor vijay relatives and friends shares memories with him - Sakshi

సాక్షి, ఒంగోలు: బాల నటుడిగా సినీ ప్రేక్షకులకు పరిచయమై హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు, అమ్మాయిలు... అబ్బాయిలు ఫేం కాలే విజయ్‌ (42) మృతితో ఆయన స్వస్థలం ఒంగోలులో విషాదఛాయలు  అలముకున్నాయి. స్థానిక రంగుతోటకు చెందిన విజయ్‌ కుటుంబం 18 ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు తరలివెళ్లింది. ఆయన బంధువులు రంగుతోటలో ఉంటున్నారు. విజయ్‌ పాఠశాల విద్య ఒంగోలులోనే పూర్తయింది. అతడి స్నేహితులు విజయ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గురించి చర్చించుకుంటున్నారు.

చైల్డ్‌ ఆర్టిస్టుగా పరిచయమై..
రంగుతోట నివాసి కాలే సుబ్బారావు, లక్ష్మీదేవిలకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు విజయ్‌. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ ఎదురుగా అప్పట్లో ఉన్న సాగర్‌ పాఠశాలలో పదో తర గతి వరకు విద్యను అభ్యసించాడు. ఆ తరువాత కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు మకాం మార్చడం, తరువాత చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 1992లో స్వాతి కిరణం సినిమాలో నటించాడు. అక్కడనుంచి సినీ జీవితంలోకి మారిన విజయ్‌ కాస్తా విజయ్‌సాయిగా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు దాదాపు 60 వరకు సినిమాలలో నటించినట్లు బంధువులు పేర్కొంటున్నారు. ఇతను సోలో హీరోగా నటించిన తొలి సినిమా బ్యాక్‌పాకెట్‌.

తరువాత కొంటె కుర్రాళ్లు సినిమాలో నటించాడు. కానీ రవిబాబు నిర్మించిన అమ్మాయిలు... అబ్బాయిలు సినిమా విజయ్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. విజయ్‌ భార్య వనిత. వీరికి ఒక కుమార్తె ఉంది. ఇటీవల విజయ్‌కు, వనితకు మధ్య పొరపొచ్చాలు రావడంతో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం విజయ్‌ హైదరాబాద్‌ యూసఫ్ గూడ నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు దంపతుల మధ్య విబేధాలే కారణమని సమాచారం.

నిర్మాణ దశలో అలకనంద..
విజయ్‌ నిర్మాతగాను రంగ ప్రవేశం చేశాడు. ప్రస్తుతం హీరోగాను, నిర్మాతగాను అలకనంద అనే సినిమా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఇది సెట్స్‌లో ఉంది. ఇది కాకుండా విజయ్‌ నటించిన మరో మూడు సినిమాలు 2018లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో అలలు సినిమా ఫిబ్రవరిలోను, తమిళ్‌ సినిమా కలప్పాదం మేలోను, పయనం నవంబరులోను విడుదల చేసేందుకు నిర్ణయం జరిగింది. ఒంగోలు నుంచి  ఒక మంచి ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకుంటున్నాడని అందరు ఆశిస్తున్న తరుణంలో అర్ధంతరంగా తనువు చాలిచడంతో అటు బంధువులు, ఇటు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement