సంస్కరణల జోరులో సమిధలు | Sakshi
Sakshi News home page

సంస్కరణల జోరులో సమిధలు

Published Thu, Nov 16 2017 3:36 AM

D. Paparao writes on effects of economic reforms - Sakshi

సంస్కరణలను ఆశించిన స్థాయిలో వేగిరపర్చనందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి తెగడ్తలు, వాటిని నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తున్నందుకు ప్రధాని మోదీకి ప్రశంసలూ.. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలూ, రేటింగ్‌ ఏజెన్సీల కథ ఇదే మరి.

ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలకు ఇచ్చే, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకింగులు ప్రకటించారు. ఈ ర్యాంకింగులలో మన దేశానికి 100వ ర్యాంకు వచ్చింది. 3 సం‘‘ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ సూచికపై మన ర్యాంకింగ్‌ మొత్తం 189 దేశాలలో 130కి పైబడే ఉంది. అంటే మూడేళ్ల కాలంలో ఈ ర్యాంకింగ్‌ బాగా వృద్ధి చెందింది. అందుకే మోదీ ఈ ర్యాంకింగ్‌ను తానూ, తన ప్రభుత్వం అమలు జరిపిన సంస్కరణల తాలూకు ఘనతగా చెప్పుకొంటున్నారు.

అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా భిన్నమైన, ప్రతికూలమైన ఆర్థిక ముఖచిత్రాన్ని మన కళ్ళముందుంచుతున్నాయి. 2017–18 ఆర్థిక సం‘‘ తాలూకు తొలి త్రైమాశికం (ఏప్రిల్‌–జూన్‌)లో దేశ స్థూల జాతీయ వృద్ధి రేటు అంతకుముందరి కాలం కంటే భారీగా దిగజారి 5.7%గా నమోదు అయ్యింది. గత ఆర్థిక సం‘‘ (2016–17) ప్రథమ త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు సుమారుగా 7.9%గా ఉంది. అంటే ఈ సం‘‘ కాల వ్యవధిలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 2.2% మేరన దిగజారింది. దీనికి ప్రస్తుతం కళ్ళముందు కనబడే కారణాలు పెద్ద నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్‌.టి అమలుదలలు. అయితే నిజానికి ఈ రెండు అస్తవ్యస్త ఆర్థిక నిర్ణయాలు మాత్రమే నేటి జి.డి.పి దిగజారుడుకు కారణాలు కావు.

2014 మే నెలలో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికి ఆయనపైన ప్రజలు ఏర్పరచుకొన్న సానుకూల భావన తాలూకు సెంటిమెంటూ, నాటి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఆయనకు బాగా అనుకూలించాయి. వీటిల్లో ప్రధానమైనవి ముడి చమురు ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో కమోడిటీల ధరలు కూడా తగ్గుతుండటం. ముఖ్యంగా అంతకు ముందటి కాలంలో బ్యారల్‌కు సుమారుగా 130 డాలర్ల వరకూ చేరిన ముడిచమురు ధరలు మోదీ పాలన ఆరంభం నుంచీ వేగంగా తగ్గుతూ ఒకానొక దశలో బ్యారల్‌కు 30 డాలర్లకు కూడా చేరాయి. దీని ఫలితంగా ముడిచమురును భారీగా దిగుమతి చేసుకొనే మన దేశానికి, పెద్ద స్థాయిలో విదేశీమారక ద్రవ్యం పొదుపు అయ్యింది. ఫలితంగా మోదీ ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రజలకు ఆకర్షణీయంగా కని పించే అవకాశం లభించింది. కానీ గత సం‘‘ కాలంపై నుంచీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్రమేణా పెరుగుతూ నేడు సుమారుగా బ్యారల్‌కు 60 డాలర్ల పైకి చేరుకున్నాయి. ఈ పరిస్థితికి తోడుగా మూలిగే నక్కపై తాటికాయలా నోట్ల రద్దు, హడావుడి జి.ఎస్‌.టి అమలు తోడయ్యాయి.

తాను అమలు జరిపిన సంస్కరణల వలన దేశంలో వ్యాపారం చేసేందుకూ, పెట్టుబడులు పెట్టేందుకు పరిస్థితులు మెరుగు కావటంతో గత 3 సం‘‘లో దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 67% దాకా పెరిగాయని మోదీ చెప్పుకుంటున్నారు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు పెరిగినా నిరుద్యోగం మాత్రం మరింత వేగంగా ఎందుకు పెరుగుతోందో జవాబు చెప్పే బాధ్యత ఆయన పైనే ఉంది.
1991లో దేశంలో సంస్కరణల ఆరంభం అనంతరం ఆర్థిక అసమానతలు, నిజవేతనాల పతనం, పెరిగిన అవినీతి వంటివన్నీ మనం చూసినవే. కాగా నేడు మోదీ ఈ దుష్పరిణామాల సంస్కరణలనే, తాను వేగంగా అమలుజరిపాననీ, ఇక ముందు మరింత వేగంగా అమలు జరుపుతాననీ చెబుతున్నారు.

నేడు వేగవంతమవుతోన్న ఆర్థిక సంస్కరణలు ముందుముందు ఖచ్చితంగా సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మరింత దిగజారుస్తాయి. ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రప్రభుత్వం ఆలోచనలూ, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలూ, ఎరువులవంటి వాటిపై సబ్సిడీల ఎత్తివేత ద్వారా రైతాంగంపై మరింత పెరుగుతోన్న భారాలు, గ్యాస్‌ సబ్సిడీ వంటి వాటిని మెల్లమెల్లగా తొలగించి వేస్తుండటంతో మధ్యతరగతీ, పేదవర్గాలపై పడుతోన్న అదనపు ఆర్థిక భారాలు తది తరం రానున్న రోజులలో ప్రజల కడగండ్లను మరింత పెంచుతాయి.

కాగా, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు అనుకూలమైన తీరులో సంస్కరణలను వేగిరపరచ లేకపోయినందుకే  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు అంతర్జాతీయ మీడియా నిష్క్రియాపరుడని స్టాంపులు వేసింది. సంస్కరణలను వ్యతిరేకిస్తున్నందుకు వామపక్షాలను ప్రగతి విఘాతమైనవిగా చిత్రీకరిస్తున్నారు. దీనికి భిన్నంగా అదే సంస్కరణలను నిర్ధాక్షిణ్యంగా, వేగంగా అమలు జరుపుతున్నందుకు అదే అంతర్జాతీయ సంస్థలు, మీడియా మోదీని ఉక్కుమనిషిగా, క్రియాశీలుడిగా అభినందిస్తున్నాయి. ఇంత జరిగి ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌’ ర్యాంకింగ్‌ భారీగా మెరుగుపడినా అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మాత్రం, ఇంకా తృప్తిపడలేదు. 10 ఏండ్ల క్రితం తామిచ్చిన బి.బి.బి. రేటింగును పెంచాలంటే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ తో పాటుగా ద్రవ్యలోటు, స్థూల జాతీయ ఉత్పత్తిలో ఋణ శాతం అంశాలలో కూడా మెరుగుదల తేవాలని ఆ సంస్థలంటున్నాయి. మొత్తం దేశాన్నే తమ ఆర్థిక ఆకలికి అర్పించుకొన్న తీరని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలూ, రేటింగ్‌ ఏజెన్సీల కథ ఇదే మరి.


- డి. పాపారావు

వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615

Advertisement
Advertisement