మరో బోస్‌

Special story to Political leader Rash Behari Bose - Sakshi

ధ్రువతారలు

1911లో రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి, బెంగాల్‌ విభజనను ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించింది. రెండో కీలక పరిణామం– బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనా కేంద్రాన్ని  కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. డిసెంబర్‌ 23, 1912న నాటి వైస్రాయ్‌ హార్డింజ్‌ ఏనుగు ఎక్కి ఆడంబరంగా ఢిల్లీ నగరంలో ప్రవేశించాడు. చాందినీ చౌక్‌ ప్రాంతంలోని ఒక ఇంటి ముందు ఒక బాలిక ఆత్రంగా ఎదురు చూస్తోంది, ఆ ఏనుగు రాక కోసం. దగ్గరకి రాగానే రహస్యంగా పట్టుకున్న నాటుబాంబును ఏనుగు మీది అంబారీ మీదకి విసిరింది. జనం కకావికలయ్యారు. హార్డింజ్‌ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ చర్యను ఖండిస్తు డెహ్రాడూన్‌లో ఉన్న అటవీ పరిశోధన సంస్థ ఒక సభ నిర్వహించింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినవాడు అక్కడే పని చేస్తున్న రాస్‌ బిహారీ బోస్‌. 

నిజానికి ఢిల్లీలో బాంబు విసిరినది బాలిక కాదు, ఆ వేషంలో ఉన్న 16 ఏళ్ల బసంత్‌ విశ్వాస్‌ అనే బాలుడు. సాక్షాత్తు వైస్రాయ్‌ హత్యకు పథకం వేసినవాడు మరెవ్వరో కాదు, రాస్‌ బిహారీ బోస్‌. హత్యాయత్నం విఫలం కావడంతో డెహ్రాడూన్‌ వెళ్లిపోయి అనుమానం రాకుండా విధులలో చేరాడు. కానీ  ఈ పథకం వేసినవాడు రాస్‌ బిహారీ అన్న సంగతి త్వరలోనే పోలీసులు పసిగట్టారు.  భారతదేశం నుంచి బ్రిటిష్‌ పాలనను సాగనంపాలంటే హింసామార్గం తప్ప వేరుదారి లేదని నమ్మినవారిలో రాస్‌ బిహారీ ఒకరు. విప్లవకారులతో, విప్లవ కార్యకలాపాలతో ఆయన మమేకత్వం గమనిస్తే విస్తుపోతాం. చాలా చిన్నతనంలోనే ఆయన బాంబులు చేయడం నేర్చుకున్నాడు. తరువాత సైన్యంలో చేరాలని అనుకున్నాడు. సాధ్యం కాలేదు. గదర్‌ పార్టీలో పనిచేశాడు. ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ అనే సంస్థను స్థాపించాడు. ఆపై తన నాయకత్వంలో పనిచేస్తున్న అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌కు అప్పించారు. దేశంలో ప్రవేశించే అవకాశం లేక జపాన్‌ గడ్డ మీద కన్నుమూశారు. \ రాస్‌ బిహారీ (మే 25, 1886– జనవరి 21, 1945) అఖండ బెంగాల్‌లోని బురద్వాన్‌ జిల్లా సుబల్‌దహ గ్రామంలో పుట్టారు. ఆయన మూడో ఏటనే తల్లి మరణించారు. తండ్రి బిపిన్‌బిహారీ బోస్‌. తాతగారు కాళీచరణ్‌ బోస్‌ పర్యవేక్షణలో రాస్‌ బిహారీ ప్రాథమిక విద్య సుబల్‌దహలోనే జరిగింది. తరువాత చంద్రనాగోర్‌లో ఉన్నత విద్యకు వెళ్లారు. చంద్రనాగోర్‌ అప్పుడు ఫ్రెంచ్‌ ఏలుబడిలో ఉండేది. దీనితో 1789 నాటి ఫ్రెంచ్‌ విప్లవం గురించి చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశం ఆయనకు వచ్చింది. దీనితో పాటు బంకించంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠం’ నవలతో కూడా ఆయన దృష్టి వికసించింది. ఇంకా నవీన్‌ సేన్‌ కవితల సంకలనం ‘ప్లాసి యుద్ధం’ కూడా ఆయనను ఉత్తేజపరిచింది. వీటితో పాటు సురేంద్రనాథ్‌ బెనర్జీ, వివేకానంద వంటి వారి ఉపన్యాసాలు కూడా రాస్‌ బిహారీలో చిన్నతనంలోనే ఒక కొత్త ప్రాపంచిక దృష్టికి అవకాశం కల్పించాయి. 

ఢిల్లీలో హార్డింజ్‌ హత్య పథకం విఫలమైన తరువాత రాస్‌ బిహారీ కొద్దికాలం చంద్రనాగోర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన దొరికితే ఉరిశిక్ష ఖాయం.  భారతదేశం నుంచి బయటపడాలని 1915లో భావించారాయన. పీఎన్‌ ఠాకూర్‌ పేరుతో, ఒక కవి అవతారం దాల్చి జప  బయటుదేరారు. మొదట కోబ్‌ నౌకాశ్రయానికి, తరువాత టోక్యో  చేరుకున్నారు. అక్కడే విశాల ఆసియావాదులను ఆశ్రయించారు. మిత్సుర టొయోమా అందులో ఒకరు. ఈయనే మొదట రాస్‌ బిహారీకి ఆశ్రయం ఇచ్చారు. కానీ కొద్దికాలానికే బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆయన ఆచూకీ తెలిసిపోయింది. తమకు అప్పగించవలసిందిగా ఇంగ్లండ్‌ జపాన్‌ను కోరింది. భారతీయ విప్లవకారులను వెతికే పని ఆరంభించిన జపాన్‌ పోలీసు యంత్రాంగం టొయోమా ఇంటిని కూడా సోదా చేసింది. అయితే మితవాద నాయకుడైనందువల్ల ఆ ఇంటిని ఎక్కువ సేపు సోదా చేయలేదు. దీనితో బోస్‌ టోక్యోలోనే షింజుకు అనే కొత్త రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. అక్కడ సోమా కుటుంబీకులు నడుపుతున్న నకామురయా బేకరీలో ఆశ్రయం పొందారు. టొయోమో, సోమా కుటుంబం వీరంతా భారత స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి కలిగినవారే. ఐజో, కొత్సుకొ సోమా కూడా అలాంటివారే. వారు తమ బేకరీలోనే రహస్య ప్రదేశంలో రాస్‌ బిహారీని ఉంచారు. ఈ విషయం ఇతరులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తమ కుటుంబ సభ్యుల మధ్యనే దాచారు. రాస్‌ బిహారీని అంత జాగ్రత్తగా కాపాడారు. ఆ సమయంలోనే ఒక బ్రిటన్‌ నౌక జపాన్‌ వారి వాణిజ్య నౌకను పేల్చింది. దీనితో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసిపోయాయి. ఫలితంగా రాస్‌ బిహారీని అప్పగించాలంటూ బ్రిటన్‌ చేసిన విజ్ఞాపన రద్దయింది. అప్పుడు ఆయన బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా అడుగు పెట్టారు.

 సోమా కుటుంబంతో ఏర్పడిన అనుబంధంతో ఐజో, కొత్సుకొ సోమా పెద్ద కుమార్తె తొషికోను వివాహం చేసుకుంటానని రాస్‌ బిహారీ కోరాడు. అందుకు ఆ దంపతులు అంగీకరించారు. అసలు ఆ సమయంలో రాస్‌ బిహారీని అల్లుడిగా చేసుకోవడానికి ఆ దంపతులు అంగీకరించడం. భర్తగా స్వీకరించడానికి తొషికో ఇష్టపడడం పెద్ద విషయమే. ఎందుకంటే విదేశీయులని పెళ్లి చేసుకోవడానికి ఆనాటి జపాన్‌ సమాజం అంగీకరించేది కాదు. పైగా విదేశాల నుంచి వచ్చి ప్రవాసం గడుపుతున్న వారితో వివాహాలు అసలే నిషిద్ధం కూడా. అందుకే తొషికో గురించి చెప్పకుండా రాస్‌ బిహారీ జీవిత చిత్రం పరిపూర్ణమని అనిపించదు. అంతేకాదు, జపాన్‌ చేరుకున్న తరువాత కూడా రాస్‌ బిహారీ తన భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని విరమించలేదు. అందుకోసం ఆయన విదేశాలకు వెళుతూ ఉండేవారు. అలాంటి సమయంలో తొషికో కుటుంబ బాధ్యత అంతా చూసుకునేవారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత తొషికో క్షయ బారిన పడి తన 28వ ఏటనే హఠాత్తుగా కన్నుమూశారు. ఆమె మరణం బోస్‌ను బాగా కుంగదీసింది. ఆయన మరోసారి వివాహం చేసుకోలేదు కూడా. నకామురయా బేకరీ పై అంతస్తులో చిన్న రెస్టారెంట్‌ ప్రారంభించి, మామగారితో కలసి వ్యాపారం చేశారు. ఈ చిన్న రెస్టారెంట్‌లో తయారు చేసే భారతీయ వంటకాల కోసం జపాన్‌ జాతీయులు విరగబడేవారు. ఇది ఎంతగా ఎదిగిపోయిందంటే జపాన్‌ స్టాక్‌ ఎక్సె ్చంజ్‌లో వాటాలు అమ్మిన తొలి జపాన్‌ ఆహారాల సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇది సహజంగానే స్థానికులలో ఆసూయకు కారణమైంది. ఒక సామ్రాజ్యవాద వలస దేశానికి చెందిన మనిషితో తొషికో ప్రేమ వ్యవహారం అంటూ ఆమె గురించి చెడుగా రాసేవి. కానీ ‘నకామురయా బోస్‌’గా ఆయన ఎందరో జపనీయులకు ఇష్టుడిగా మారిపోయారు. ఆయన తయారు చేసిన కూరకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

 ఒకపక్క ఆ రెస్టారెంట్‌  పని చేస్తూనే భారత దేశ విముక్తి గురించి ఆలోచించేవారు రాస్‌ బిహారీ. టోక్యోలోనే ఇండియన్‌ క్లబ్‌ పేరుతో ఒక చిన్న సంస్థను స్థాపించి, దాని ద్వారా ఇంగ్లిష్‌ పత్రికలకు అనేక వ్యాసాలు రాసేవారాయన. రేడియో ప్రసంగాలు ఇచ్చేవారు. భారతీయులు సాగిస్తున్న స్వాతంత్య్రం పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆయన ప్రపంచ దేశాలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తూ ఉండేవారు. అనేక మందికి ఉత్తరాలు రాసేవారు. భారత్‌కు స్వాతంత్య్రం అంటే అది భారత్‌కు మాత్రమే ప్రయోజనం కాదు. ప్రపంచానికి ప్రయోజనం అని భావించారాయన. అందుకు కారణం కూడా చూపించారు. భారత్‌లో ఇంగ్లండ్‌ తిష్ట అలా కొనసాగుతూ ఉంటే, పేద, బడుగు దేశాలకు రక్షణ నానాటికీ కరువైపోతుందని ఆయన భావించారు. భారత్‌ను ఇంగ్లండ్‌ పాలించినంత కాలం ప్రపంచంలో శాంతి ఉండదు అని కూడా ఆయన రాశారు. దీనితో పాటు జపాన్‌లోనే ఉంటున్నప్పటికీ భారతదేశంలో సాగుతున్న ఉద్యమాన్ని కూడా   క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. ‘గాంధీజీ గతకాలపు మనిషి. సుభాశ్‌ చంద్రబోస్‌ ఈ కాలం మనిషి’ అని ఒక సందర్భంలో రాస్‌ బిహారీ వ్యాఖ్యానించారు కూడా. 

ఆసియా దేశాల మధ్య ఐక్యతకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదో రాస్‌ బిహారీ అద్భుతంగా ఆనాడే గుర్తించారని అనిపిస్తుంది. ఆ ఐక్యతను ఆయన మనసారా ఆకాంక్షించారు. ఆగస్టు 1, 1926న నాగసాకిలో ఆయన నిర్వహించిన సభ చరిత్రాత్మకమైనదని చెప్పాలి. డాక్టర్‌ హోక్వా అనే ప్రముఖునితో కలసి రాస్‌ బిహారీ ఆసియా దేశాల ప్రతినిధుల గోష్టి నిర్వహించారు. దీనికి  42 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో చైనా వారు 11 మంది. భారతీయులు 8, అప్ఘాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి ఒక్కొక్కరి వంతున హాజరయ్యారు. ఇంకా జపాన్‌వారు 20 మంది పాల్గొన్నారు. ఆసియా ఆసియావాసులకే అన్న నినాదం రాస్‌ బిహారీ అక్కడ ఇచ్చారు. 1926లో ఆయన స్థాపించిన పాన్‌ ఆసియన్‌ అసోసియేషన్, 1930లో నెలకొల్పిన జపాన్‌–ఇండియా మిత్రమండలి కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ఈ మిత్రమండలి ఏటా మూడు లేదా నాలుగు పర్యాయాలు సమావేశాలు జరిపేది. జపాన్, భారత్‌ దేశాల మధ్య సత్సంబంధాల గురించి చర్చించేది.  ప్రధానంగా పురాతన సంస్కృతులు కలిగిన జపాన్, భారత్‌ల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హిందూ మహాసభ జపాన్‌ శాఖను ఆయనే ప్రారంభించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేశారు బోస్‌. ఇంతలోనే రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధంలో బ్రిటన్‌ కీలకంగా ఉంది. ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టడానికి  ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకోవాలని విప్లవవాదుల ఆశయం. 1942లో సింగపూర్‌ జపాన్‌ అధీనంలోకి వచ్చింది. ఆగ్నేయాసియాలో 32,000 మంది భారతీయ సిపాయిలను జపాన్‌ యుద్ధఖైదీలుగా పట్టుకుంది. వీరిందరికీ భారత స్వాతంత్య్రం కోసం పోరాడే అవకాశం కల్పిస్తానని  సింగపూర్‌లో జపాన్‌ సైనిక వ్యవహారాల అధిపతి మేజర్‌ ఫుజీవరా ప్రమాణం చేశాడు. ఈ వ్యవహారం చూడడానికి సింగపూర్‌ వచ్చిన రాస్‌ బిహారీ అక్కడే ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ను 1924లో స్థాపించారాయన.

ఈ యుద్ధఖైదీల సాయంతో భారత్‌ను విముక్తం చేసే పనిలో తోడ్పడేందుకు రాస్‌ బిహారీ టోక్యో నుంచి బ్యాంకాక్‌ వెళ్లారు. తరువాత ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు నాయకత్వం వహించవలసి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలోనే మేజర్‌ మోహన్‌సింగ్‌ నాయకత్వంలో పోరాడుతున్న 40 వేల మంది భారతీయ సైనికులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. వీరందరితో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవలసిందని జపాన్‌ సైనికాధికారులు అవకాశం ఇచ్చారు. ఆ పని మొదలయింది. అయితే ఆగ్నేయాసియాలో యుద్ధం గురించి సింగ్‌కూ, జపాన్‌ అధికారులకు మధ్య విబేదాలు వచ్చాయి. దీనితో సింగ్‌ను అరెస్టు చేసి, ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌కు, అంటే రాస్‌బిహారీకి అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను అప్పిగించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత రాస్‌ బిహారీ అజాద్‌ హింద్‌ పౌజ్‌ను భారతదేశం నుంచి రహస్యంగా సింగపూర్‌ వచ్చిన నేతాజీ బోస్‌కు అప్పచెప్పారు.  1945 నాటికి రాస్‌ బిహారీ నిరంతరం రేడియో ప్రసారాలను వినడానికి అలవాటు పడ్డారు. అందులో ఒక వార్త కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అది భారతదేశం స్వాతంత్య్రమైందన్న వార్త. కానీ ఆ వార్త వినకుండానే ఆయన కన్నుమూశారు. ఆయన పార్ధివదేహాన్ని తీసుకువెళ్లడానికి జపాన్‌ రాజకుటుంబం ప్రత్యేక వాహనాన్ని పంపించింది. 1924 నాటికే జపాన్‌లొ రాస్‌ బిహారీ ఒక ప్రముఖ పౌరుడు. 
- ∙డా. గోపరాజు నారాయణరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top