విద్వాంసులకు దారిదీపం

Sri Rangacharya Pitikalu Book Introduction - Sakshi

పరిచయం 

ప్రాచీన తెలుగు కావ్యాల పాఠపరిష్కరణ సంప్రదాయం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న కాలమిది. మానవల్లి, వేటూరి, చిలుకూరి నారాయణరావు, రాళ్లపల్లి, దీపాల పిచ్చయ్య శాస్త్రుల వంటి పండిత పరంపర సమాప్తమై పట్టుమని పదిమంది పాఠ పరిష్కర్తలు లేని యుగమిది. ప్రాచీన తెలుగు కావ్య పాఠ పరిష్కరణే తమ ధ్యేయంగా, విస్మృత కావ్య ప్రకాశనమే తమ ఏకైక లక్ష్యంగా సంప్రదాయ మార్గంలో పయనిస్తున్న పథికులు డాక్టర్‌ పెరుంబుదూరు శ్రీరంగాచార్యులు.

రంగాచార్యులు 1969 నుంచి 2019 వరకు పరిష్కరించి సంపాదకత్వం వహించిన 30 గ్రంథాల పీఠికల సమాహారమే ఈ గ్రంథరాజం. మొదటి పీఠిక ‘దశరథరాజ నందన చరిత్ర’ ఆచార్యులు పైలాపచ్చీసు వయస్సులో(1969) రచించిన పాండిత్య పూర్ణమైన రచన. నల్లగొండ జిల్లాకు చెందిన మరింగంటి సింగరాచార్యులు వెలార్చిన దశరథరాజ నందన చరిత్ర నిరోష్ఠ్య రామాయణ కావ్యం. సింగరాచార్యులు నిరోష్ఠ్యంగా అనువదించడంలో చాలాచోట్ల కుదించారనీ, సుందరకాండను మరింతగా సంక్షిప్తం చేయడం విచారకరమనీ అన్నారు. నిరోష్ఠ్య కావ్యరచన కావించడంలోని సాధక బాధకాల్నీ, ఆ కావ్య రచనా వైశిష్ట్యాన్నీ విశదపరచడం విశేషం.

 ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్య విరచిత ‘తాలాంక నందినీ పరిణయము’ నకు రాసిన పీఠికలో కావ్యంలోని అలంకార సౌందర్యాన్నీ, అర్థ భావ పద చమత్కారాల్నీ రసవంతంగా విశ్లేషించి, శృంగార రస వైలక్షణ్యాన్ని వెల్లడించారు. అలాగే కావ్యంలోని సంశయాల్నీ, అనౌచిత్యాల్నీ నిస్సంకోచంగా ప్రస్తావించారు.
గోవర్ధనం వెంకట నరసింహాచార్యుల ‘శ్రీలక్ష్మీ నృసింహ వైభవం–లాలి–ప్రహరి’ సుకృతికి రాసిన పీఠిక ‘సుదర్శనం’లో మహావిష్ణువుల పవ్వళింపు సేవ సందర్భంలో పాడే ప్రహరి(హెచ్చరిక) పద్యగద్యాలు భక్తిప్రపత్తుల్ని సుందరంగా, సుతారంగా, సుశోభితంగా చాటుతాయని పేర్కొన్నారు. ప్రహరి తెలుగు సాహిత్యంలో ఉదాహరణ వాజ్ఞయంలాగానే ప్రత్యేక ప్రక్రియ అని వాక్రుచ్చారు.

 భైరవకవి ‘శ్రీరంగ మహత్త్వము’నకు రాసిన పీఠిక 99 పేజీల విస్తారం కలది. ఇది చిలుకూరి నారాయణరావు, నిడదవోలు వెంకటరావు గార్ల భూమికల్ని జ్ఞప్తికి తెస్తుంది. ఇందులో మాహాత్మ్య కావ్యాల పుట్టుపూర్వోత్తరాల్ని సమీక్షించారు. భైరవకవి వంశ చరిత్రను వివరిస్తూ, అతనిపై ప్రభావం చూపిన ఎర్రన, శ్రీనాథ, పోతన, నాచన సోముల్ని ప్రస్తావించి, భైరవ కవి ప్రభావం పొందిన కవుల్ని కూడా స్థూలంగా పేర్కొన్నారు. గ్రంథంలోని ఐదాశ్వాసాల కథాసారాంశాన్ని ఇస్తూ, భైరవకవి కవితాకళను విశ్లేషించారు. తెలంగాణ కవి పండితులు రాసి శాస్త్ర గ్రంథాల్ని ప్రచురించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 
రంగాచార్యుల భాష గ్రాంథికమైనా, సరళ గ్రాంథికంగా ఎలాంటి తికమకలు లేకుండా కావ్యప్రియుల హృదయాలకు హత్తుకుంటుంది. ఈ పీఠికలు రంగాచార్యుల పాండిత్యాన్నీ, పాఠ పరిష్కరణా విధానాన్నీ, ఆయా కవుల వైదుష్య సృజనాత్మక ప్రతిభల్నీ తేటతెల్లం చేస్తాయి.
-ఘట్టమరాజు

పీఠికలు
రచన: డాక్టర్‌ శ్రీరంగాచార్య; పేజీలు: 652; వెల: 350; ప్రచురణ: పూర్ణోదయ 
పబ్లికేషన్స్, వనస్థలిపురం, 
హైదరాబాద్‌–70. 
ఫోన్‌: 9440466636

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top