రాముడు – రాకాసి

Sakshi Editor Murali Article On Dharma

జనతంత్రం

రామో విగ్రహవాన్‌ ధర్మః అంటారు. ధర్మం మూర్తిమంతమయితే రాముడవుతాడు. ఆ రాముని కథ స్ఫూర్తితో ధర్మం ప్రకాశిస్తుంది. యుగయుగాలుగా భారతీయ సామాజిక కట్టు బాట్లను, కుటుంబ సంబంధాలను ఒక పద్ధ తిలో నిలిపివుంచిన ధర్మసంహిత శ్రీరామ కథ అనేది మన విశ్వాసం. రాముడు ఒక సాధారణ రాజకుమారుడు. కానీ ధర్మనిష్ఠతో పురుషోత్త ముడవుతాడు. ఒకటే మాట – ఒకే బాణం అని చెబుతారు రాముని గురించి. కష్టనష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే ఆ మర్యాద పురుషోత్తముని ప్రథమ లక్షణం. అబద్ధాలు చెప్పడమే అలవాటు లేని సత్యసంధుడు. పెద్దల మాటను జవదాటని వినయ విధేయ రాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, నలువైపులా ప్రమాదాలు ముంచుకొస్తున్నా సరే మనో నిబ్బరం కోల్పోని ధీరుడు. ఒక పరిపాలకుడిగా ప్రజాభీష్టానికే పెద్దపీట వేసినవాడు. ప్రజాభిప్రాయమే రాజ్యాంగంగా పరిపాలన చేసినవాడు. అందుకే రామరాజ్యం అనేది నేటికీ ఒక ఆదర్శ రాజ్యంగా మిగిలి పోయింది. యుగమేదైనా కాలమేదైనా ఈ ఐదు రకాల ధీర గుణాలు పరిపాలకునిలో ఉంటే అతని రాజ్యం ఆదర్శ రాజ్యంగా నిలబడే అవ కాశాలుంటాయి. రాముడు అంటే ధర్మం అనేదే ఇక్కడ మన భావన.

రాముని ప్రతినాయకుడు రావణుడు లేదా రాక్షసుడు. జన్మరీత్యా రావణుడు బ్రాహ్మణుడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మకు స్వయాన మనవడు. విశ్రావముని కుమారుడు. సకల శాస్త్ర పారంగతుడు. సంగీత విశారదుడు. తన పేగులు తీసి వీణగా చేసి వినిపించిన గానం కైలాసగిరినే కరిగిస్తుంది. అలాంటి వాడు రాక్షసుడెట్లయ్యాడు? మితిమీరిన స్వార్థం అతడిని మార్చింది. లంకాపురి సింహాసనం అతని తండ్రి వారసత్వం కాదు. అమ్మమ్మ తరుపు చుట్టాల చెంత చేరి, వారి రాజ్యాన్ని లాక్కొని తాను రాజయ్యాడు. తనివి తీరని రాజ్య కాంక్షతో ఇరుగు పొరుగు రాజ్యాలతో తగువులు తెచ్చుకున్నాడు. వాలి చేతిలో ఒకసారి, కార్తవీర్యార్జునుని చేతిలో మరోసారి చావుదెబ్బలు తిన్నాడు. అయినా బుద్ధి మారలేదు. ధనకాంక్ష, రాజ్యకాంక్షల చేత దహించుకుపోయాడు. పర స్త్రీ వ్యామోహం రాక్షసునిగా మార్చింది. రాముడు ఈ రాకాసిని సంహరించాడు. అంటే ధర్మం అధర్మాన్ని జయించింది.

పరిపాలకుడు ధర్మవర్తనుడైతే రాజ్యం రామరాజ్యమవుతుందనీ, ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారనీ రామాయణ కాలం నుంచీ నేటిదాకా రుజువవుతున్న నిత్య సత్యం. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధాన నేతల వ్యక్తిత్వాలను ఈ నేపథ్యం నుంచి ఒకసారి చూద్దాం. రాజకీయరంగంలో తొలి అడుగు లోనే ఇచ్చిన మాటకోసం కోరి కష్టాలు తెచ్చుకున్న వ్యక్తి ప్రతిపక్ష నేత. తన తండ్రి చనిపోయినప్పుడు తనలాగే, తన కుటుంబ సభ్యులలాగే లక్షలాది మంది తల్లడిల్లిపోయారు. కొన్ని వందల మంది షాక్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని చూసి, ఆ యువకుడు చలించిపోయాడు. ఆ కుటుంబాలన్నీ నా కుటుంబాలేనని నిండు సభలో ప్రకటించాడు. ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శిస్తానని ఆ సభలోనే ఒక హామీ ఇచ్చాడు. కానీ ఆ పార్టీ అధిష్టాన దేవత అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివం తమైన వ్యక్తుల టాప్‌ టెన్‌ జాబితాలో ఆ దేవత ఒకరు.

మాట కోసం ఆమె ఆజ్ఞను సైతం ధిక్కరించడానికి వెనుకాడలేదు. అందుకు మూల్యం చెల్లించవలసి వచ్చింది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఏకమై అతడి మీద తప్పుడు కేసులు నమోదు చేశాయి. చివరకు జైలుకు పంపారు. మౌనంగా అనుభవించాడే తప్ప మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. అసత్యాలు, అర్థసత్యాలే రాజకీయాలుగా చలామణీ అవుతున్న ఈరోజుల్లో కూడా చిన్న అబద్ధం చెప్పడానికి కూడా సిద్ధపడని అరుదైన రాజకీయ నేత అతను. గడిచిన ఎన్నికల్లో ప్రత్యర్థి ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నారు, అరచేతిలో వైకుంఠం చూపుతు న్నారు, అలాంటి హామీలు మీరు కూడా కొన్ని ఇవ్వండి, లేకుంటే గెలుపు కష్టమని శ్రేయోభిలాషులు ఆ యువకునిపై ఒత్తిడి చేశారు. ఓడిపోయినా ఫర్వాలేదుగాని, చేయలేని హామీలు నేనివ్వలేనని కరాఖండిగా చెప్పిన నిష్కపటత్వం అతని సొంతం. నీలాపనిందలు వేసి ప్రచారం చేసినప్పుడు, కుట్రలు పన్ని కేసులు పెట్టినప్పుడు, అన్యాయంగా జైలుకు పంపినప్పుడు అతను చూపిన నిబ్బరం నిరుపమానం. లక్ష కోట్లు అవినీతి చేశాడని ఊరూవాడా దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. నలభై వేల కోట్లు అవినీతి చేశాడని కోర్టుల్లో కేసులు వేశారు.

అతని మీద కక్ష సాధించాలని అప్పటి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. అతని అడ్డు తొలగితే తనకు ఎదురుండదని అప్పటి ప్రతిపక్ష నేత భావించాడు. ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యాడు. అతని నేతృత్వంలోని సిండికేట్‌ కథారచన చేసింది. దర్యాప్తు అధికారిగా సిండికేట్‌కు ఇంటి మనిషి దొరికాడు. సిండికేట్‌ స్క్రిప్ట్‌ ప్రకారం ఆయన ఛార్జిషీట్లు వేశాడు. ఇంతకూ ఏముంది ఆ కేసుల్లో... ఫలానా వ్యక్తి కొన్ని పరిశ్రమలు పెట్టాడు. ఆ పరిశ్రమల్లో కొందరు వ్యక్తులు పెట్టుబడులు పెట్టారు. అందుకుగాను ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి జరిగింది. అందుకని అది క్విడ్‌ ప్రోకో అన్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి అంతకుముందే విజయవంతమైన పారిశ్రామిక వేత్త. ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవాళ్లు ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్లు. చాలా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవాళ్లు. అలా పెట్టినందుకు వాళ్లకు అధికారికంగా ఈ సంస్థల్లో వాటాలు లభించాయి. లాభాలు లభించాయి. పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉన్నవారందరికీ ప్రభుత్వం ఏదో రూపంలో కొంత లబ్ధి చేకూర్చుతుంది. అది ప్రభుత్వాల పాలసీ కూడా. అలా లబ్ధి పొందిన వందలాది మంది వచ్చి ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టలేదు.

కొందరు మాత్రమే ఇన్వెస్ట్‌ చేశారు. ఆ కంపెనీలకు ప్రభుత్వం తరుపున జరిగిన కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని కొందరు అధి కారులపై ఇప్పటికే కేసులను కొట్టివేయడం జరిగింది. గాలికి పోయే పేలపిండి లాంటి కేసులను అడ్డుపెట్టుకుని గడిచిన ఎనిమిదేళ్లు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా నిబ్బరంగా ప్రజల మధ్య నిలబడి పోరాడుతున్న ఆత్మస్థైర్యం అతనిది. అతడిని దగ్గరగా చూసినవారికి మాత్రమే తెలిసిన సత్యం... అవినీతిపొడ అస్సలు గిట్టని తత్వం అత నిది. రేపు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ఈ సత్యాన్ని చూడబోతున్నారు. ప్రజాభిప్రాయానికి విలువనివ్వడంలో, ప్రజలతో మమేకమవడంలో సమకాలీన భారత రాజకీయ నేతల్లో అతనికి సాటి రాగలిగిన వారు లేరు. నిరంతరం ప్రజల మధ్య సంచరించినందువల్ల కాబోలు... ఈ ఎన్నికల ప్రచారంలో ‘మీ గుండె చప్పుళ్లు నేను విన్నాను... మీకు అండగా నేను వున్నాను’ అంటూ ప్రతి చోటా చెబుతున్నారు. కష్టాలు తప్పవని తెలిసినా మాట తప్పని వ్యక్తిత్వం... ఓటమి ఎదురవుతుందని తెలిసినా అబద్ధపు హామీ ఇవ్వని నిజాయితీ... తన మీద హత్యాయత్నం జరిగిన క్షణంలోనూ, నోరు విప్పితే అల్లర్లు జరుగుతాయన్న ఆలోచనతో బాధను సహిస్తూ మౌనం పాటించిన అబ్బురపరిచే నిబ్బరం... ప్రజలను గాఢంగా ప్రేమించే స్వభావం... ఇవన్నీ కలగలిసిన నాయకుడు ధర్మాన్ని నిలబెట్టగలడు.

ముఖ్య నాయకుడిగా వున్న ప్రత్యర్థిది ఇందుకు పూర్తిగా భిన్న స్వభావం. అయితే దశకంఠుడైన రావణుడికి ఉన్నట్టు ఈయనకూ పది తలలున్నాయి. అవి మీడియా తలలు. ప్రత్యర్థి ఒక్క గొంతుతో మాట్లాడితే ఈయన తరపున పది గొంతులు ఒక్కసారిగా లేస్తాయి. ఈయన ఏం చేసినా ఆ పది తలలూ ప్రతిరోజూ భజనగీతాలను ఆలపిస్తూనే ఉంటాయి. ఈ భజనల మాటున తన బాగోతాలు బయటపడకుండా ఉంటాయన్నది ఆయన భ్రమ. ఈయనకు ధన వ్యామోహం, అధికారకాంక్ష అంతులేకుండా వుందని ఆయన సన్నిహితులే చెప్పారు. తిరుపతి హోటల్‌ నుంచి హెరిటేజ్‌ వరకు అందులో పెట్టుబడి పెట్టినవారికి చివరకు శఠగోపం పెట్టాడని ఆరోపణలున్నాయి. తనది కాని పార్టీలో చేరాడు. తనది కాని అధికారాన్ని వెన్నుపోటు ద్వారా లాక్కున్నాడు. వట్టి మోసగాడనీ, ఎటువంటి విలువలూ లేవనీ ఔరంగజేబు అని స్వయంగా పిల్లనిచ్చిన మామే బహిరంగంగా చెప్పారు.

మాట తప్పడంలో ఆయనతో ఎవరూ పోటీ పడరు. ఆయన ఇచ్చే ఎన్నికల హామీలు, గెలిచిన తర్వాత వాటికి పట్టే గతి అందుకు ఉదాహరణ. ఈ వ్యక్తి మాట తప్పిన ఘటనలూ, అబ ద్ధాలు చెప్పిన ఉదాహరణలు డజన్లకొద్దీ గుర్తు చేయవచ్చు. ఈ ఎన్నికల ప్రచారంలో ఓటమి తప్పదని తెలిసిన దగ్గర్నుంచీ ఆయన మాటలు చూస్తే ఏమాత్రం మనోనిబ్బరం లేని బేలతనం బయటపడుతోంది. నామీద కేసులు పెడతారట. ప్రజలారా మీరంతా నాకు రక్షణ కవచంలా నిలబడాలంటూ చేసిన ఆక్రందనలు ఉత్తర గోగ్రహణ ఘట్టంలో ఉత్తర కుమారుణ్ణి తలపించాయి. ప్రజల పట్ల ఈయనకుండే అలక్ష్యం, లెక్క లేనితనం ఆయన మాటల్లోనే చాలాసార్లు బయటపడింది. నాయీ బ్రాహ్మణులమీద, మత్స్యకారుల మీద ఆయన కసురుకున్న తీరు, దళి తుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఈసడించుకున్న వైనం మరిచిపోయేవి కాదు. ఈ రెండు భిన్నమైన వ్యక్తిత్వాల్లోంచి ధర్మాన్ని నిలబెట్టగల వ్యక్తిని ఏపీ ప్రజలు ఎంచుకోవాల్సి ఉంది. ధర్మాన్ని మనం కాపాడినట్లయితే ధర్మం మనలను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః
వర్ధెల్లి మురళి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top