బిల్లివ్వకుండా కాఫీ తాగండి

Article On Annapareddy Venkateswara Reddy Autobiography - Sakshi

ఆత్మకథ

ఫ్రాయిడ్‌ను తెలుగు చేసినవాడిగా, ‘మిసిమి’ సంపాదకుడిగా, బౌద్ధ రచనల మీద విశేష కృషి చేసి తన పేరునే అన్నపరెడ్డి బుద్ధఘోషుడుగా మార్చుకున్న ‘కళారత్న’, ‘బౌద్ధరత్న’, ‘సద్ధర్మ మహోపాధ్యాయ’ అన్నపరెడ్డివెంకటేశ్వర రెడ్డి స్వీయచరిత్ర ‘ఓ అనాత్మవాది ఆత్మకథ’. 192 పేజీల ఈ పుస్తకాన్ని పల్లవి పబ్లికేషన్స్‌ ప్రచురించింది. ‘ఏసుర్లు’ 1933లో జన్మించారు. 21 సంవత్సరాల వయసులో 13 ఏళ్ల లక్ష్మీకాంతమ్మను పెళ్లాడారు. పుస్తకంలోని రెండు ఘట్టాలు.

‘‘నా వివాహానంతరం నా భార్యను మా ఊరు తీసుకెళ్తూ, తూముబారి ఊరి మధ్యలో బస్సు దిగి(కారు దిగి)– కారుకు బస్సుకు తేడా అప్పటి పల్లెటూరి జనాలకు తెలియదు– ఇంటికి నడిచి వెళ్తుంటే, ఆమె నా వెనుకనే వెన్నంటి నడుస్తుంటే, పెద్దవాళ్లు చూసి, ‘‘ఏంట్రోయ్‌! నీ పెళ్లాం మడాలు (మడమలు) తొక్కుతూ నడుస్తుంది. కొంచెం దూరంగా నడవమను. ఇది పల్లెటూరు, బస్తీ కాదు’’ అనేవారు.

‘‘తెనాలి గురించి, అది కళా సాహిత్య రంగాలకు ఎలాంటి ‘బౌద్ధిక వాతావరణాన్ని’ సృష్టించిందో చెప్పాలి. దీనికొక చిన్న ఉదాహరణ: నేను వి.యస్‌.ఆర్‌. కళాశాలలో చేరిన తరువాత హితశ్రీ(కథకుడు; అసలు పేరు మతుకుమల్లి వెంకట నరసింహ ప్రసాదరావు), డాక్టర్‌ జి.వి. కృష్ణారావు (కీలు బొమ్మలు నవలా రచయిత), మా ఆంగ్లశాఖలో పనిచేసే పి.సత్యనారాయణ (బైటింగ్‌ క్రిటిక్‌), నేను గాఢ స్నేహితుల మయ్యాము. రోజూ కళాశాల వదిలిన తరువాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నలుగురం సైకిళ్ల మీద తెనాలి నడిబొడ్డున బోస్‌ రోడ్డులో వీనస్‌ థియేటర్‌ పక్కన ఉన్న హోటల్‌ డె ప్రెసిడెంట్‌ (ఆ హోటలుకు ఆ పేరు పెట్టడంలో తెనాలి సాహితీ వైభవం తెలుస్తుంది) కు కాఫీ సేవనానికి వెళ్లేవాళ్లం. మేము రోజూ రావడాన్ని, అదే మూల ఒక టేబుల్‌ వద్ద కూర్చోవడాన్ని హోటల్‌ యజమాని గ్రహించాడు. ఒక రోజు, మా వద్దకు వచ్చి ‘‘మీలాంటి సాహితీమూర్తులు మా హోటలకు వచ్చి సాహితీ చర్చ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. దీనిని నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పి, మా బల్లకు సంబంధించిన సర్వరును పిలిచి, ‘‘ఆ నలుగురు ఎన్నిసార్లు కాఫీ అడిగితే అన్నిసార్లు ఇవ్వు. బిల్లు మాత్రం రాయవద్దు’’ అని ఆదేశించాడు. మేము రాత్రి పది గంటల దాకా కూర్చునేవాళ్లం. అప్పటికే బల్లలు, కుర్చీలు ఖాళీచేసి సర్దివేసేవారు. కాని మా బల్లను ఖాళీ చేయమని అడిగేవారు కాదు. ఒక హోటలు నడుపుకునే యజమానికి అంతటి సంస్కారం ఉందంటే ఊహించండి, నాటి క్లైమేట్‌ ఆఫ్‌ ఒపీనియన్‌.’’ 

ఓ అనాత్మవాది ఆత్మకథ
అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
పల్లవి పబ్లికేషన్స్‌
ఫోన్‌ : 9866115655

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top