అవాంఛనీయ పరిణామం | Sakshi
Sakshi News home page

అవాంఛనీయ పరిణామం

Published Sat, Jan 13 2018 1:08 AM

 undesirable evolution in supreme court - Sakshi

దేశ రాజకీయ వ్యవస్థపై పౌరుల్లో ఇంకా విశ్వాసం సన్నగిల్లనప్పుడూ...అదింకా రాజీ లేని ధోరణిని కొనసాగిస్తున్నదని అందరూ భావిస్తున్నప్పుడూ 1958లో రూపొందిన 14వ లా కమిషన్‌ నివేదిక న్యాయమూర్తుల నియామకం వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నియామకాల్లో పెరుగుతున్న కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం గురించి ప్రస్తావించింది. సరిగ్గా అరవైయ్యేళ్ల తర్వాత స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ దేశ ప్రజల ముందుకొచ్చారు. ఆ సర్వోన్నత న్యాయ పీఠంలో కొంతకాలంగా సాగుతున్నాయంటున్న ‘అవాంఛనీయ’ పరిణామాలను మీడియా సమావేశం వేదికగా రేఖామాత్రంగా స్పృశించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ఉద్దేశించి తాము లోగడ రాసిన లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. ఇలా న్యాయవ్యవస్థ అంతర్గత పనితీరునూ, వైరు ధ్యాలనూ బట్టబయలు చేయడాన్ని సాహసమంటున్న వారున్నారు. దుస్సాహస మని తప్పుబడుతున్న వారున్నారు. ఈ తీరు అరాచకమని చెబుతున్నవారున్నారు.  కానీ ఆ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు అప్రధానమైనవని మాత్రం ఎవరూ అనడం లేదు. వాటిని అంతర్గతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చును కదా అని కొందరు చెబుతున్నారు. నిజానికి అలాంటి ప్రయత్నం తమవైపు నుంచి జరిగిందన్నదే జస్టిస్‌ చలమేశ్వర్‌ మాటల సారాంశం. అవన్నీ విఫలం కావడం వల్లే దేశ ప్రజల ముందుకు రాకతప్పలేదని ఆయన వివరణ.

సంక్షోభాలు ఏర్పడి నప్పుడూ... సంచలనాలు చోటు చేసుకున్నప్పుడూ ఉన్నత స్థానాల్లోనివారు మాట్లాడే మాటలను దేశం మొత్తం చెవులు రిక్కించుకుని వింటుంది. అంతకన్నా ముఖ్యంగా వారు చెప్పని మాటలేమిటో, చెప్పదల్చుకోనివేమిటో(బిట్వీన్‌ ది లైన్స్‌) ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది.  సీనియర్‌ న్యాయమూర్తులు నలుగురూ ఇప్పుడు రాసిన ఏడు పేజీల లేఖలో ఆ మాదిరి అంశాలు అనేకం ఉన్నాయి. తాజా పరి ణామం ఎటు దారితీస్తుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే అంచనాల సంగతలా ఉంచి... ఉరుము లేని పిడుగులా, ప్రశాంత వాతావరణంలోకి దూసు కొచ్చిన పెను తుఫానులా వచ్చిపడిన ఈ సమస్య రాగల రోజుల్లో సైతం చర్చ కొస్తూనే ఉంటుంది. 

మన న్యాయవ్యవస్థకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్నాయి. మన సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన పలు విలువైన తీర్పులను దేశదేశాల్లోని సుప్రీం కోర్టులూ తమ తీర్పుల్లో ప్రస్తావించిన సందర్భాలున్నాయి. దాంతోపాటే మన న్యాయవ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్న ఉదంతాలు లేకపోలేదు. ముఖ్యంగా ‘అంకిత న్యాయవ్యవస్థ’ పేరిట ఇందిరాగాంధీ 1975–77 మధ్య న్యాయవ్యవస్థ నియామకాల్లో జోక్యం చేసుకున్న తీరుపై ఎన్నో విమర్శలొచ్చాయి.

రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో నిలిచిపోతాయని 1976లో మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య ప్రియులకు దిగ్భ్రాంతి కలిగించింది. ఈ తీర్పుతో విభేదించిన జస్టిస్‌ హెచ్‌ ఆర్‌ ఖన్నాకు అనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి రావాల్సి ఉన్నా నిరాకరించారు. అందుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. అనంతరకాలంలో సైతం న్యాయవ్యవస్థ తీరుతెన్నులను ప్రశ్నించినవారు న్నారు. ఇలా ప్రశ్నించినవారిలో అత్యధికులు న్యాయమూర్తులుగా పనిచేసినవారే. అయితే వారు పదవి నుంచి వైదొలగాక మాత్రమే అలా మాట్లాడారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది.  

ఈ దేశంలో అన్ని వ్యవస్థలూ విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నా దాన్ని అంతో ఇంతో ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నది ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే. తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందనుకున్నప్పుడు ఈ దేశంలో అందరూ ఆశగా చూసేది న్యాయవ్యవస్థవైపే. ఎక్కడ ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నా ‘సిట్టింగ్‌ జడ్జి’తో విచారణ జరిపించాలని కోరడం తరచు వినిపిస్తుంది. కానీ కొన్ని కీలకమైన కేసుల విచారణను వివిధ ధర్మాసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్‌ న్యాయమూర్తులు అనడం చూస్తే... దేశ ప్రజలకు ఇదంతా చెప్పవలసిన అవసరం ఉన్నదని భావిస్తున్నట్టు ప్రకటించడం గమనిస్తే ఆ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నార్థకాలు తలెత్తకమానవు. అయితే సమస్య ఎంతటి తీవ్రమైనదైనా న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం సమంజసం కాదు. అది వాంఛనీయమూ కాదు.

వారేమీ సాధారణ వ్యక్తులు కారు. ఏదో ఒక వ్యాపార సంస్థలో భాగ స్వాములూ కారు. వారు లేవనెత్తిన సమస్యలు వ్యక్తిగతమైనవి అంతకన్నా కాదు. సీనియర్‌ న్యాయమూర్తులు న్యాయపరమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించి ఆ సమ స్యను అంతర్గతంగా పరిష్కరించుకోవడానికి అన్నివిధాలుగా ప్రయత్నించి ఉంటే బాగుండేది. సుప్రీంకోర్టులో ఉన్న 31 మంది న్యాయమూర్తులూ సమష్టిగా వ్యవ హరించి చర్చించుకుని ఉంటే హుందాగా ఉండేది. ప్రధాన న్యాయమూర్తిగా ఆ విషయంలో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చొరవ తీసుకుని ఉండాల్సింది. లేదా సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు సోలీ సోరాబ్జీ అన్నట్టు సీనియర్‌ న్యాయమూర్తులు నలుగురూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి తమ ఆందోళనను ఆయన దృష్టికి తీసు కురావలసింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. కోవింద్‌ తనకు తానుగా న్యాయ మూర్తులందరినీ పిలిచి మాట్లాడి అపోహలనూ, అపార్థాలనూ తొలగించడానికి, ఈ సంక్షోభానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. వ్యక్తులు కాదు... వ్యవస్థలు ముఖ్యం. వాటి పరువు ప్రతిష్టలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రాణప్రదం. తాజా పరిణామాల కారణంగా దెబ్బతిన్న న్యాయవ్యవస్థ ప్రతిష్ట పునరుద్ధరణకు అందరూ సమష్టిగా పనిచేసి, ఈ సంక్షోభ దశను అధిగమిస్తారని ఆకాంక్షిద్దాం. 

Advertisement
Advertisement