సెన్సెక్స్‌ 424 పాయింట్లు క్రాష్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 424 పాయింట్లు క్రాష్‌

Published Sat, Feb 9 2019 7:52 AM

Sensex Falls Near 450 Points - Sakshi

యూరప్‌ వృద్ధి మందగిస్తుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ చేసిన హెచ్చరిక ప్రపంచ మార్కెట్లలో చిన్న కల్లోలాన్ని సృష్టించింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం శుక్రవారం పడిపోయాయి. రెండు రోజుల క్రితం సాధించుకున్న 11,000 పాయింట్ల స్థాయిని నిఫ్టీ తిరిగి వదులుకుంది.  అటో, మెటల్‌, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్ల అమ్మకాలతో చివరి అరగంటలో జరిగిన విక్రయాలు సూచీల తీవ్ర నష్టాలకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌ 424 పాయింట్ల నష్టపోయి 36,546 వద్ద, నిఫ్టీ 125.80 పాయింట్లు కోల్పోయి 10,943.60 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 27,294.40 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ నేడు నష్టాలతో మొదలైంది.

సెన్సెక్స్‌ 92 పాయింట్ల క్షీణతో 36,773 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 11,015 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. టాటామోటర్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 22శాతం నష్టపోవడంతో అటో రంగ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని నెలకొంది.  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో సైతం అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటసేపటికి నిఫ్టీ సూచీసాంకేతికంగా కీలకమైన 11000 స్థాయిని కోల్పోయింది. తదుపరి మార్కెట్లో కొంత అ‍మ్మకాలు తగ్గడంతో సూచీల నష్టాలు కొంత మేర తగ్గాయి.

అయితే మిడ్‌సెషన్‌ అనంతరం మెటల్‌ షేర్ల పతనంతో సూచీలకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ జనవరిలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ల్లోకి నిధుల ప్రవాహం తగ్గిందనే వార్తలతో పాటు, ఇదే నెలలో పాసింజర్‌ వాహన విక్రయాలు 2శాతం క్షీణించాయనే సియామ్‌ గణాంకాలు వెలువడంతో మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు మరింత తీవ్రతరమయ్యాయి. 
ఐషర్‌మోటర్స్‌, గ్రాసిమ్‌, వేదాంత, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌, టాటామోటర్స్‌ షేర్లు 5శాతం నుంచి 18శాతం నష్టపోగా, సిప్లా, భారతీఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 8శాతం లాభపడ్డాయి.

Advertisement
Advertisement