తొలుత హైజంప్‌- చివరికి అక్కడక్కడే | Sakshi
Sakshi News home page

తొలుత హైజంప్‌- చివరికి అక్కడక్కడే

Published Wed, Jul 15 2020 4:03 PM

Market ends flat due to fag end selling - Sakshi

విదేశీ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల ఫలితాలు ఆశలు రేకెత్తించడంతో తొలుత దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఇవే అంచనాలతో మంగళవారం అమెరికా మార్కెట్లు సైతం జోరందుకోవడంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఎగబడ్డారు. అయితే చివరి గంటన్నరలో కొనుగోళ్లు నెమ్మదించడంతోపాటు అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో మార్కెట్లు నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. వెరసి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 36,052 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం నామమాత్రంగా 11 పాయింట్లు బలపడి 10,618 వద్ద స్థిరపడింది. 

రోలర్‌ కోస్టర్‌ 
ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దాదాపు 300 పాయింట్ల లాభంతో 36,315 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌కల్లా 36,810వరకూ ఎగసింది. ఆపై చివర్లో ఊపందుకున్న అమ్మకాలతో 35,895 దిగువకు చేరింది. అంటే గరిష్టం నుంచి 800 పాయింట్లకుపైగా కోల్పోయింది. ఈ బాటలో 10701 వద్ద మొదలైన నిఫ్టీ మధ్యాహ్నానికల్లా 10,827ను అధిగమించింది. చివర్లో 10,578 దిగువకు చతికిలపడింది.

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ అత్యధికంగా 5.25 శాతం జంప్‌చేయగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. అయితే రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2-1.4 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో 17 శాతం దూసుకెళ్లగా.. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, యాక్సిస్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హీరో మోటో, బజాజ్‌ ఆటో 6.5-1.5 శాతం మధ్య ఎగశాయి. గూగుల్‌ పెట్టుబడులను సైతం ఆకట్టుకున్న ఆర్‌ఐఎల్‌ 4 శాతం పతనంకాగా.. ఎయిర్‌టెల్‌, జీ, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌, శ్రీ సిమెంట్‌ 3.6-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

నిట్‌ టెక్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో నిట్‌ టెక్‌ 10 శాతం జంప్‌ చేయగా.. నౌకరీ, జూబిలెంట్‌ ఫుడ్‌, అరబిందో, ఎస్కార్ట్స్‌, సీమెన్స్‌ 6.5-3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఐడియా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, భెల్‌, గోద్రెజ్‌ సీపీ, ఐబీ హౌసింగ్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, మెక్‌డోవెల్‌ 6.4-3.2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1528 నష్టపోగా.. 1096 లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్‌, ఒమాక్సీ, ఇండియాబుల్స్‌, గోద్రెజ్ ప్రాపర్టీస్‌, శోభా, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌ 9-2 శాతం మధ్య పడిపోయాయి.

భారీ అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1566 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 650 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 222 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 1459 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.

Advertisement
Advertisement