జీవనాడికి రెండేళ్లలో జీవం! | State Government steps towards achieving Polavaram | Sakshi
Sakshi News home page

జీవనాడికి రెండేళ్లలో జీవం!

Aug 18 2019 3:56 AM | Updated on Aug 18 2019 3:56 AM

State Government steps towards achieving Polavaram - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వెన్నెముక లాంటిది. రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసే శక్తి పోలవరానికి ఉంది. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం పనుల్లో అవినీతిని ప్రక్షాళన చేసి రెండేళ్లలోగా ప్రాజెక్టును సాకారం చేసి ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కేంద్రం నుంచి నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న తర్వాత పోలవరం ప్రాజెక్టును అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ‘ఏటీఎం’గా మార్చుకున్నారు. హెడ్‌వర్క్స్‌(జలాశయం), కుడి, ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచి పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది.

దొడ్డిదారిన పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశించిన గడువులోగా పనులు చేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలవరం పనుల్లో అవినీతిని నిర్మూలించి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టు పనులపై క్షుణ్నంగా విచారణ జరిపిన నిపుణుల కమిటీ పోలవరం పనుల్లో రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలంటే హెడ్‌ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఒకే కాంట్రాక్టర్‌ పనులు చేయడం వల్ల సమన్వయ లోపం సమస్య ఉత్పన్నం కాదని నిపుణులు కమిటీ సూచించింది. 

భారీ ఎత్తున ప్రజాధనం ఆదా..
పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను రూ.3,220.22 కోట్లకు దక్కించుకున్న నవయుగ తట్టెడు కూడా మట్టెత్తకున్నా గత సర్కారు రూ.787.20 కోట్లను చెల్లించింది. అదే సంస్థకు హెడ్‌వర్క్స్‌ను నామినేషన్‌పై కట్టబెట్టడాన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో పనులను ప్రక్షాళన చేసి.. అవినీతిని నిర్మూలించి.. ఖజానాకు నిధులను ఆదా చేసేందుకే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తున్నారు. దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి ఆయకట్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడమే కాకుండా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీటిని సరఫరా చేయవచ్చు. విశాఖ నగరం తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చవచ్చు. గోదావరి డెల్టాలో రెండో పంటకు పుష్కలంగా  నీటిని అందించవచ్చు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించేందుకు పోలవరం ప్రాజెక్టు దోహదపడుతుంది. అంతేకాదు 960 మెగావాట్ల జలవిద్యుత్‌ చౌకగా అందుబాటులోకి వస్తుంది. అందువల్లే పోలవరాన్ని రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్నారు.


ఎందుకీ రివర్స్‌ టెండరింగ్‌..?
- పోలవరం హెడ్‌వర్క్స్‌ను 2013 మార్చి 30న ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.4,054 కోట్లకు దక్కించుకుంది. 2018 మార్చి నాటికి పనులు పూర్తి కావాలి. కానీ టీడీపీ సర్కార్‌ అధికారంలో ఉండగా కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు  పెంచేసింది. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి అదనపు నిధులు కట్టబెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధం.
ట్రాన్స్‌ట్రాయ్‌ 2017 నాటికే దివాళా తీసి ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)లో దరఖాస్తు చేసుకుంది. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి మళ్లీ టెండర్‌ పిలవాలి. కానీ ట్రాన్స్‌ట్రాయ్‌తో కుదుర్చుకున్న ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా 60 సీ నిబంధన కింద రూ.3,302.22 కోట్ల విలువైన పనులను ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో నవయుగ, బీకెమ్‌లకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. ఇది నిబంధనలకు విరుద్ధం.
నవయుగ, బీకెమ్‌లకు స్టీలు, సిమెంటు, డీజిల్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. అంటే ఆ రెండు సంస్థలు కేవలం లేబర్‌ కాంట్రాక్టు మాత్రమే చేస్తున్నాయి. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. 
ఎక్కడా లేని రీతిలో వెసులుబాట్లు కల్పించినా ఆ రెండు సంస్థలు నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో ఫాస్ట్‌ట్రాక్‌లో రెండేళ్లలోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సమర్థవంతమైన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement