
గుంటూరులో సెక్స్ రాకెట్..
రాజధాని ప్రాంతంలోని వ్యభిచార కూపాల్లో మహిళల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
♦ గుంటూరులో చక్రం తిప్పుతున్న రౌడీ షీటర్లు, మధ్యవర్తులు
♦ మహిళలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్న వైనం..
♦ పట్టుబడిన మహిళలు, విటుల అరెస్టులు
♦ నామమాత్రంగా రైడింగ్‌లు
గుంటూరు: రాజధాని ప్రాంతంలోని వ్యభిచార కూపాల్లో మహిళల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ పలుకుబడులు, బడాబాబుల అండదండలు ఉన్న కొందరు వ్యక్తులు మహిళల అవసరం, ఆర్థిక ఇబ్బందులు, నిస్సహాయతను అదునుగా తీసుకుని ‘సెక్స్ రాకెట్’లోకి దింపుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర పట్టణాల్లో ఇంకా వెలుగు చూడని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. బయటకు చెప్పుకోలేక కొందరు.. బయటకు చెప్పిన తర్వాత వేధింపులకు తాళలేక మరికొందరు..
ఇలా ఎందరో జీవితాలు చీకటి గృహాల్లోనే మగ్గిపోతున్నాయి. అయితే.. వీరిలో తెలిసి తప్పులు చేస్తున్న వారు ఉండొచ్చుగాక.. కానీ పరిస్థితుల ప్రభావంతో ఈ రొంపిలోకి దిగన వారూ లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ పోలీస్ యంత్రాంగం హత్య, ఆత్మహత్యాయత్నం వంటి ఘటనలు జరిగినప్పుడు కూడా వాటిపై దృష్టి సారించకపోవడంతో షరా మామూలైపోయింది. పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడంతో మునుపు జరిగిన ఘటనల లాంటివే తిరిగి పునరావృతం అవుతున్నాయి. మహిళలు పట్టుబడిన తర్వాత పునరావాసం కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
► పోలీసుల స్పందన అంతంతమాత్రం..
గుంటూరు నగరంలో ఒకప్పుడు కొత్తపేటకు పరిమితమైన వ్యభిచారం అరండల్‌పేట, పట్టాభిపురంలోని నివాస ప్రాంతాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అపార్టుమెంట్లు, నగర శివారులు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వ్యాపారం జోరందుకుందని తెలుస్తోంది. వ్యభిచార గృహాలకు చుట్టుపక్కన ఉన్నవారు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు రైడింగ్‌లు చేసి పట్టుబడిన వారిని అరెస్టు చేస్తున్నారే తప్ప వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కొన్నిరోజుల క్రితం గుంటూరు కొత్తపేటలోని శనక్కాయల ఫ్యాక్టరీ సమీపంలోని ఓ భవనంలో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు అక్కడికి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వారికి, నిర్వాహకులకు మధ్య రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో కూడా రాజీ మార్గాలు వెదుకుతుండటం, డబ్బుకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఇప్పటికే పోలీస్ వ్యవస్థ అపఖ్యాతి మూటగట్టుకుంది.
► గతంలో గట్టి చర్యలు..
గతంలో ఎస్పీగా సీతారామాంజనేయులు, ఏఏస్పీగా భావనా సక్సేనా ఉన్నప్పుడు వారు ప్రత్యే బృందాలు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయించారు. సమస్యల మూలాల దాకా వెళ్లి విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిపై, నిర్వాహకులపై కఠిన చర్యలూ తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో ‘సెక్స్ రాకెట్’ తన పరిధుల్ని విస్తరించుకుంటోంది. ఎవరూ పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో రౌడీ షీటర్లు, రాజకీయ నాయకుల పలుకుడి బడి ఉన్న వారు కూడా వ్యాపారంగా ఎంచుకుంటున్నట్లు జిల్లాలో కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఎస్పీలు స్పందించి సెక్స్ రాకెట్ల ఆగడాలను ఆరికట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
► కఠిన చర్యలు తీసుకుంటాం..
సెక్స్ రాకెట్ ఆగడాలను ఆరికట్టేందుకు పటిష్ట నిఘా పెడతాం. వ్యభిచారం జరుగుతుందని తెలిస్తే చుట్టుపక్కన ఉండే వారు నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించవచ్చు. వారి వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచుతారు. ప్రజలు సహకరిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ విజయారావు, అర్బన్ ఎస్పీ