కో‘ఢీ’  పందాలకు సర్వం సిద్ధం..

All Set For Cock fight In Konaseema - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. డూడూ బసవన్నలు, హరిదాసులు పల్లెటూర్లలో సందడి చేస్తున్నారు. ఇంటిముందు తీర్చిదిద్దిన రంగ వల్లులతో ప్రతి పల్లె కలర్ ఫుల్ గా కనపడుతోంది. సంక్రాంతి పండుగ స్పెషల్ కోడి పందాలకు నిర్వాహకులు బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో నిర్వహించే కోడి పందాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా జనాలు తరలివస్తున్నారు. వీఐపీల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భీమవరం, ఏలూరు, నరసాపురం, అమలాపురం, కాకినాడ ప్రాంతాల్లోని హోటల్‌ గదులు ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. 

కోడి పందాలతో పాటు గుండాట, పేకాటకు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పందాలను నిర్వహించడానికి ఫ్లడ్‌ లైట్లను కూడా వాడుతున్నారు. పోలీసులు తమ జోలికి రాకుండా చూడాలంటూ అధికార పార్టీ నేతలపై పందెం రాయుళ్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ సారి పందేలు 100 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు పందాలు జరగకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం..
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో పొట్టేళ్లు, కోడి పందాలకు బరులు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో పందాలు నిర్వహణకు సర్వం సిద్దమయ్యాయి.  పందాలకు హైదరాబాద్‌ నుంచి అంపాపురంకు పొట్టేళ్లు చేరుకున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పందెం కోళ్లను తరలించారు.

దివిసీమలో ఘనంగా పడవ పోటీలు..
సంక్రాంతి పండుగను పురస్కరించుకోని కృష్ణా జిల్లా నాగాయలంకలో దివిసీమ సంప్రదాయ పడవ పోటీలు ప్రారంభం అయ్యాయి. మండలి చైర్మన్‌ బుద్ధప్రసాద్‌ ఆదివారం ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు నాటు(కోల) పడవల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 40 టీమ్‌లు పాల్గొన్నాయి.

తెలంగాణలోను కోడి పందాలు..
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మంతో పాటు.. తెలంగాణలోని పలు పల్లెల్లో కూడా కోడి పందాలు నిర్వహణకు రంగం సిద్దమైంది. సత్తుపల్లిలో పందెం రాయుళ్లు కోడి పందాలకు బరులు సిద్ధం చేశారు. పండుగ సంబరాల పేరుతో చేపడుతున్న ఈ పందాలను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని పోలీసులు చెబుతున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top