
PC : IPL Twitter
ఐపీఎల్ 2022లో సీఎస్‌కే, ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పాలిట విరాట్ కోహ్లి విలన్‌గా మారాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కోహ్లి తప్పిదం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతిని కోహ్లి కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్‌కు అవకాశం లేనప్పటికి.. రావాలా వద్దా అనే సంశయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపుకు కోహ్లి కదిలాడు.
అయితే కోహ్లి కదలికలను కాస్త ఆలస్యంగా పసిగట్టిన మ్యాక్సీ పరిగెత్తినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే బంతిని అందుకున్న ఊతప్ప ధోనికి త్రో వేశాడు. మ్యాక్స్‌వెల్ క్రీజులోకి చేరకముందే ధోని వికెట్లు గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సీజన్‌లో కోహ్లి ఒక రనౌట్‌లో భాగస్వామ్యం కావడం ఇది నాలుగోసారి. రెండుసార్లు తాను రనౌట్ కాగా.. మరో రెండుసార్లు తన పార్టనర్‌ను ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒక సీజన్‌లో అత్యధిక రనౌట్లలో పాలుపంచుకున్న ఆటగాడిగా కోహ్లి చెత్త రికార్డు నమోదు చేశాడు.