
నెట్ అడ్డుగా ఉంచటంతో అందరూ క్షేమం
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్‌టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్‌లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.
దూకిన వారిలో జిర్వాల్‌తోపాటు ఎన్‌సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్‌ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది.