
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.
‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్‌బీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.
కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్‌వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి.