యెల్లో కార్డ్‌ చూపించి సెల్ఫీ దిగిన మహిళా రిఫరీ

హైఫా(ఇజ్రాయిల్‌): సాధారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో రిఫరీలు ఏం చేస్తారు.. ఆటగాళ్లను నియంత్రణలో ఉంచడానికి యత్నిస్తారు. వారు కూడా పరుగులు పెడుతూ ఆటగాళ్లతో మమేకం అవుతూ వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తారు. అదే సమయంలో ఆటగాళ్లు ప్రవర్తన శ్రుతి మించితే యెల్లో కార్డు..ఆపై రెడ్‌ కార్డు చూపెట్టడం కూడా వారి విధి నిర్వహణలో భాగమే. అయితే ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒక మహిళా రిఫరీ ఆటగాడిగా యెల్లో కార్డుతో వార్నింగ్‌ ఇవ్వడమే కాకుండా అతన్ని అక్కడే ఆపి ఒక సెల్ఫీ దిగడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇటీవల బ్రెజిల్‌-ఇజ్రాయిల్‌ మధ్య హైఫాలో ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 4-2 తేడాతో ఇజ్రాయిల్‌పై గెలిచింది. ఇదిలా ఉంచితే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ కాకాతో మహిళా రిఫరీ సెల్ఫీ దిగిన ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. గేమ్‌లో భాగంగా తొలుత కాకాకు యెల్లో కార్డు చూపించిన రిఫరీ లిలాచ్‌ అసులిన్‌.. అక్కడే అతన్ని ఉండమంటూ విజ్ఞప్తి చేసింది. కాగా, యెల్లో కార్డు చూపించడంతో అక్కడికి పరుగెత్తుకొచ్చి రిఫరీతో వాగ్వాదానికి దిగబోయిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది.

యెల్లో కార్డు చూపించిన సదరు రిఫరీ ఏం చేస్తుందా అని చూస్తుంటే, తన జేబులోంచి ఒక సెల్‌ ఫోన్‌ను నెమ్మదిగా తీసి సెల్ఫీ ఇవ్వాలంటూ కాకాను అడిగింది. ఇక చేసేదేమీ లేని కాక.. సెల్ఫీ దిగక తప్పలేదు. దీనిపై ప్రత్యర్థి ఇజ్రాయిల్‌ ఆటగాళ్లు కూడా షాక్‌ అయ్యారు. రిఫరీ ఇలా చేస్తుందేమిటీ అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడైనా ఫ్యాన్స్‌ ఫోటోలు దిగడానికి పోటీ పడతారు కానీ రిఫరీనే ఇలా చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి అంటూ ముసిముసి నవ్వులు  నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top