రౌడీషీట్లు ఎత్తివేత | Sakshi
Sakshi News home page

రౌడీషీట్లు ఎత్తివేత

Published Sat, Dec 2 2023 12:56 AM

ఫీల్‌ ఎట్‌ హోం కార్యక్రమంలో విదేశీ విద్యార్థులతో ఉద్యాన వర్సిటీ వీసీ టి.జానకీరామ్‌  
 - Sakshi

ఎస్పీ రవిప్రకాష్‌

భీమవరం: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులు నమోదై సత్ప్రవర్తన కలిగిన 860 మందిపై రౌడీషీట్లను మూసివేస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్‌ శుక్రవారం చెప్పారు. సత్ప్రవర్తన ఆధారంగా గత అయిదేళ్లుగా ఎలాంటి నేర ప్రమేయంలేని వారిని గుర్తించి వారిపై కేసులను తొలగిస్తున్నట్లు చెప్పారు. వారిలో 653 మంది సస్పెక్ట్‌ షీట్స్‌, 35 కేడీ, 2 డీసీ, 170 రౌడీషీట్స్‌ను మూసివేస్తున్నట్లు రవిప్రకాష్‌ వివరించారు. ప్రస్తుతం తొలగించిన వివిధ షీట్స్‌లోని వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి సమాజంలో మంచి పేరుతో జీవించాలని తిరిగి నేర ప్రవృత్తిని ఎంచుకొంటే వారిపై షీట్స్‌ ఓపెన్‌చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విదేశీ విద్యార్థులకు ప్రత్యేక వసతులు

తాడేపల్లిగూడెం: ఉద్యానవర్సిటీలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఆయా ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా ఆహారం అందచేయడంతో పాటు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని ఉప కులపతి డాక్టర్‌ తోలేటి జానకిరామ్‌ అన్నారు. ఫీల్‌ఎట్‌హోం కార్యక్రమంలో భాగంగా విదేశీ విద్యార్థులకు ఉద్యాన కళాశాల బాలుర, బాలికల వసతి గృహాలలో కల్పించిన సదుపాయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, ఆఫ్రికా దేశాల నుంచి ఐసీఏఆర్‌ కేటగిరీ కింద బీఎస్‌సీ, ఎంఎస్‌సీ హార్టీకల్చర్‌ కోర్సులు చదవడానికి వచ్చిన విద్యార్థులు సుమారు 50 మందికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫీల్‌ ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించామన్నారు. ఏసీలు, ప్రత్యేక ఆహారం అందించడం వంటివి సంతృప్తికరంగా ఉన్నాయని నేపాల్‌కు చెందిన విద్యార్ధి అశోక్‌ షా, భూటాన్‌కు చెందిన సంఘయ్‌ డంచెస్‌ అనే విద్యార్థులు వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ విద్యార్థులకు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండేలా రూ.80 లక్షలతో నూతన హాస్టల్‌ భవనాన్ని నిర్మించనున్నామన్నారు.

గుర్తు తెలియని యువకుడి మృతి

కొయ్యలగూడెం: స్థానిక బస్టాండ్‌ సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై జీజే విష్ణువర్ధన్‌ శుక్రవారం తెలిపారు. ఎస్సీ పేటలో పాడుబడి ఇంటి గోడ వద్ద తుప్పల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారన్నారు. సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని, మృతదేహాం గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిందని చెప్పారు. పాడుబడిన ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

బాలికను మోసగించిన వ్యక్తి అరెస్టు

ఏలూరు టౌన్‌: దెందులూరు మండలం సత్యనారాయణపురానికి చెందిన కొక్కిలిగడ్డ రమేష్‌బాబును అదే గ్రామానికి చెందిన బాలికను మోసగించి వివాహం చేసుకున్న కేసులో అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపారు. బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతని అక్క చందోలు వీరమ్మ, వదిన కొక్కిలిగడ్డ వనితలు నేరానికి ప్రేరేపించడం, సహకరించడంతో వారిని కూడా అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. వారికి జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. ఏలూరులోని ప్రైవేటు కాలేజీలో చదువుతున్న బాలిక కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఈ ఏడాది మే 15న ఇచ్చిన ఫిర్యాదుపై త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో బాలికను గుర్తించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి వైద్యపరీక్షల అనంతరం నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement