సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ | Sakshi
Sakshi News home page

సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

Published Sun, May 26 2024 4:45 AM

సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

అమరచింత: ప్రజా సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. ఆ దిశగా ప్రజల పక్షాన ఆందోళనలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మార్క్స్‌ భవనంలో జరిగిన మాస్‌లైన్‌ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు శనివారం ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. భారత్‌ ఎంతో చరిత్ర గల దేశమని.. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ ప్రభుత్వం, మోఘలాయిలు, తురుష్కులు, నవాబులు దేశ సంపదను దోచుకున్నారని.. వారి అవసరాల మేరకు ఇక్కడ రవాణ, వర్తక సదుపాయాలు, విద్యాలయాలు ఏర్పాటు చేశారే తప్పా ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనతో కాదన్నారు. ఇదే విధానాన్ని ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోందని.. ప్రధాని మోది ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలు ముఖ్యమంటునే.. ప్రజలకు అందాల్సిన సంక్షేమాలను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల ధనం పేరుతో ధనవంతులు దాచుకున్న డబ్బును వారికే సొంతం చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని తుంగలో తొక్కి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ నిరుద్యోగులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆరాచకాలు ఎక్కువయ్యాయని.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఐ మాస్‌లైన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రాంచందర్‌, ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌కుమార్‌, హన్మంతు, సాంబశివుడు, ప్రసాద్‌, వెంకటేష్‌, గణేష్‌, దేవదానం, కొండారెడ్డి, శివారెడ్డి, చంద్రన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement