పల్లెపాలన అస్తవ్యస్తం | Sakshi
Sakshi News home page

పల్లెపాలన అస్తవ్యస్తం

Published Sat, May 25 2024 12:20 PM

పల్లె

అమరచింత: గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం అధికమైంది. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకాకపోవడంతో కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం క్లస్టర్‌ గ్రామాలుగా ఎంపిక చేసి జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం విద్యుత్‌ బిల్లులు, బోరు మరమ్మతులు, చెత్త సేకరణ వాహనాలకు డీజిల్‌ సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. అలాగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్లకు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఉంది.

నిధులు లేక ఇబ్బందులు..

గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ప్రధాన ఆధారం. జనాభా అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15 ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాని 2022, ఆగస్టు నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. పెద్ద పంచాయతీల్లో ఇంటి, వ్యాపార పన్నులు, తైబజార్‌, ఇంటి నిర్మాణ ఫీజులు, వ్యాపార వాణిజ్య లైసెన్స్‌ ఫీజుల ద్వారా డబ్బులు జమ అవుతాయి. కాని చిన్న గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పా ఇతర ఆర్థిక మార్గాలు లేవు. ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీల వైపు కన్నెత్తి చూడటం లేదు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పడటంతో తప్పని పరిస్థితుల్లో చెత్త తరలింపు వాహనాలతో పాటు నీటిని సరఫరా చేసే ట్యాంకర్‌కు డీజిల్‌ కొనుగోలుకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నిధులు కరువు..

ఐదు నెలలుగా పంచాయతీలకు నిధులు రావడం లేదు. దీంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాగునీటి బోర్ల మరమ్మతులకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను ప్రత్యేక అధికారులకు విన్నవిస్తున్నా నిధులు లేక పరిష్కరించలేకపోతున్నాం.

– రాజీక్‌, పంచాయతీ కార్యదర్శి, ధర్మాపురం

ప్రభుత్వం మంజూరు

చేయాల్సి ఉంది..

గ్రామపంచాయతీల్లో కొత్త పాలక వర్గం ఏర్పడాలి. ఇందుకుగాను పంచాయతీ ఎన్నికలు జరగాలి. ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకాకపోవడంతో చిన్న పంచాయతీల్లో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

– రమణమూర్తి,

జిల్లా పంచాయతీ అధికారి

కొరవడిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ

నిధులు లేక నిర్వహణ భారం

ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులు

జిల్లాలో 255 గ్రామపంచాయతీలు

కార్యదర్శులపై ఆర్థిక భారం..

గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. గతంలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ఆటోలు పంచాయతీ కార్యదర్శుల పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. దీంతో పంచాయతీల్లో ఉన్న నిధులను ముందస్తుగానే కిస్తులకు చెల్లించడంతో పంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులైన మురుగు కాల్వల మరమ్మతులు, తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలు సరిచేసేందుకు డబ్బులు లేక తప్పని పరిస్థితుల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయక తప్పడం లేదు.

పల్లెపాలన అస్తవ్యస్తం
1/3

పల్లెపాలన అస్తవ్యస్తం

పల్లెపాలన అస్తవ్యస్తం
2/3

పల్లెపాలన అస్తవ్యస్తం

పల్లెపాలన అస్తవ్యస్తం
3/3

పల్లెపాలన అస్తవ్యస్తం

Advertisement
 
Advertisement
 
Advertisement