నారాయణ విద్యార్థి మృతిపై అనుమానాలెన్నో.. | Sakshi
Sakshi News home page

నారాయణ విద్యార్థి మృతిపై అనుమానాలెన్నో..

Published Sun, Jan 28 2024 2:14 AM

- - Sakshi

మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్‌–2 పీఎంపాలెం నారాయణ క్యాంపస్‌లో 9వ తరగతి విద్యార్థి నెల్లూరు అఖిల్‌ వినాయక్‌(15) మృతిపై అతని తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిది శ్రీకాకుళం టౌన్‌. కుమారుడి చదువు కోసం నారాయణలో చేర్పించారు. 6వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాడు. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడానికి పీఎంపాలెంలో నారాయణ బైపీసీ పేరిట 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు శిక్షణ నిచ్చే క్యాంపస్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు మించి ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధిక ఒత్తిడి తట్టులేక విద్యార్థి మృతి చెంది ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిలువెత్తు నిర్లక్ష్యం
సాధారణంగా విద్యార్థులకు బాగాలేకపోతే వారిని సిక్‌ రూమ్‌కి తరలిస్తారు. అయితే అఖిల్‌ వినాయక్‌ను మాత్రం ఒంటిరిగానే 203 నంబర్‌ హాస్టల్‌ గదిలో వదిపెట్టారు. పీఎంపాలెం పోలీసుల సమక్షంలో విద్యార్థి తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించారు. ఇందులో నిర్ఘాంతపోయే విషయాలను వారు గుర్తించారు. వీటి ఆధారంగా మృతుడి తండ్రి రవికుమార్‌ పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆత్మహత్యకి పాల్పడినట్టు గుర్తించారు. అప్పటికి అతడు కొన ఊపిరితో ఉన్నాడని, 45 నిమిషాల పాటు ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా యాజమాన్యం జాప్యం చేసిందని ఆరోపించారు.

దీంతో తన కుమారుడు అంద ని లోకాలకు వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశా రు. వినాయక్‌ శరీరంపై రక్తపు మరకలు ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని ఆయన అంటున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా.. విద్యార్థి మృతిపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు గొండు సీతారాం పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

 

Advertisement
Advertisement