బిగ్‌ స్క్రీన్‌పై ఫైనల్‌ ఫైట్‌ | Sakshi
Sakshi News home page

బిగ్‌ స్క్రీన్‌పై ఫైనల్‌ ఫైట్‌

Published Sun, Nov 19 2023 1:10 AM

-

విశాఖ స్పోర్ట్స్‌: క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌–ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ కోసం యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అసలు సిసలైన క్రికెట్‌ మజాను ఆస్వాదించేందుకు ఎవరి ఏర్పాట్లలో వారు తలమునకలయ్యారు. అభిమానుల కోసం స్టేడియంలో మ్యాచ్‌ను చూస్తూ పొందే అనుభూతిని అందించేందుకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భారత్‌–న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను విశాఖ, విజయవాడ, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ స్క్రీన్‌లపై ప్రత్యక్ష ప్రసారం చేసింది. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి మ్యాచ్‌ను ఆద్యంతం ఎంజాయ్‌ చేశారు. ఈ నేపథ్యంలో టైటిల్‌ పోరును రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బిగ్‌ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ సాగరతీరంలోని కాళీమాత ఆలయం ఎదురుగా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి.. ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో బిగ్‌స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ట్రాఫిక్‌ ఆంక్షలివీ..

దొండపర్తి: భారత్‌–ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఆర్‌.కె.బీచ్‌లో భారీ స్క్రీన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్‌ సమావేశ మందిరంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

●ఆదివారం ఉదయం 10 నుంచి పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి నోవాటెల్‌ వరకు బీచ్‌రోడ్డులో ఎటువంటి వాహనాలు అనుమతించరు.

●క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు ఎంవీపీ కాలనీ, అప్పుఘర్‌, చిన వాల్తేరు మీదుగా వచ్చే వాహనచోదకులు ఎంజీఎం గ్రౌండ్‌లో వాహనాలు పార్క్‌ చేసుకోవాలి. ● సిరిపురం సీఆర్‌ రెడ్డి జంక్షన్‌ మీదుగా ఆర్‌.కె.బీచ్‌కు వెళ్లే వాహనచోదకులు ఏయూ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ జంక్షన్‌ నుంచి వెళ్లి ఏయూ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పార్క్‌ చేసుకోవాలి.

●సీఆర్‌ రెడ్డి, ఆల్‌ ఇండియా రేడియో జంక్షన్‌ మీదుగా ఆర్‌.కె.బీచ్‌కు వెళ్లే వాహనచోదకులు తమ వాహనాలను ఏపీఐఐసీ మైదానంలో పార్క్‌ చేసుకోవాలి. ● పందిమెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్‌.కె.బీచ్‌కు వచ్చే వారు తమ వాహనాలను ఏఎంసీ వద్ద నిర్దేశించిన పార్కింగ్‌ స్థలాల వద్ద పార్క్‌ చేసుకోవాలి.

●బీచ్‌ రోడ్డులో బాణసంచా కాల్చ కూడదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

నేడు భారత్‌–ఆస్ట్రేలియా మధ్య టైటిల్‌ పోరు

సాగరతీరంలో ఏసీఏ ఆధ్వర్యంలో భారీ తెరపై ప్రత్యక్ష ప్రసారం

Advertisement

తప్పక చదవండి

Advertisement