పోలింగ్‌ రోజున వేతనంతో కూడిన సెలవు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ రోజున వేతనంతో కూడిన సెలవు

Published Tue, Apr 23 2024 8:25 AM

చింతాలమ్మ గుడి ఆవరణలోనే 
టీడీపీలో చేరిన వారితో గోరంట్ల - Sakshi

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలోని వివిధ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. జిల్లా సహాయ కార్మిక కమిషనర్‌ బీఎస్‌ఎం వలీ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనిని ఉల్లంఘించిన యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

కొండెక్కిన ఎన్నికల కోడ్‌

కడియం: టీడీపీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల కోడ్‌ను కొండెక్కించేశారు. కడియం మండలం పొట్టిలంకలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన.. గ్రామస్తుల ఇలవేల్పు చింతాలమ్మ ఆలయంలోకి నేరుగా పార్టీ కండువాలతోనే వెళ్లిపోయారు. ఆ పార్టీ నాయకులందరూ కండువాలతోనే గుడి లోపలికి వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు. అదే ఆలయ ఆవరణలో మాజీ ఉప సర్పంచ్‌ కొత్తపల్లి రాజుబాబు తదితరులకు గోరంట్ల టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రతిసారీ రూల్స్‌పై మాట్లాడే గోరంట్ల.. స్వయంగా ఇలా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడంపై గ్రామస్తులు విస్తుబోయారు.

ఘనంగా సీతారాముల

వనవిహారోత్సవం

అన్నవరం: రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన సోమవారం స్వామి, అమ్మవార్ల వనవిహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వెంట రాగా నవదంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండ దిగువన గార్డెన్‌ వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ప్రత్యేక సింహసనాలపై సీతారాములను, సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వేంచేయించి, పండితులు పూజలు చేశారు. నవదంపతులకు దేవస్థానం అధికారులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం వనవిహారోత్సవం నిర్వహించారు.

నేడు శ్రీచక్రస్నానం

శ్రీరామ నవమి ఉత్సవాల ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 8 గంటలకు పవర్‌హౌస్‌ వద్ద పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. నదిలో నీరు లేకపోవడంతో స్నానఘట్టాలకు దూరంగా నీరు ఉన్న చోట గుంత తవ్వి, అందులో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 నుంచి వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు.

బీఎస్‌ఎం వలి
1/1

బీఎస్‌ఎం వలి

Advertisement
Advertisement