కోలాహలం | Sakshi
Sakshi News home page

కోలాహలం

Published Tue, Apr 23 2024 8:25 AM

సతీమణి మోనాతో కలిసి నామినేషన్‌కు వెళుతున్న ఎంపీ, రాజమండ్రి సిటీ అభ్యర్థి భరత్‌ - Sakshi

అట్టహాసంగా వైఎస్సార్‌ సీపీ

అభ్యర్థుల నామినేషన్లు

భారీగా ర్యాలీలు

ఎంపీ స్థానానికి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే స్థానానికి మార్గాని భరత్‌ నామినేషన్‌

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరం తొలి ఘట్టమైన నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మంచి తేదీ, ముహూర్తం చూసుకుని వైఎస్సార్‌ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమ ఇష్ట దైవం వద్ద పత్రాలు పెట్టి పూజలు చేస్తున్నారు. భారీ జన సమీకరణ, ర్యాలీతో కుటుంబ సమేతంగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. వారు వెళ్తున్న మార్గాలు భారీగా తరలుతున్న ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. అభ్యర్థులపై అభిమానులు పూల జల్లులు కురిపిస్తున్నారు. నామినేషన్ల కోలాహలంతో నియోజకవర్గ కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. జిల్లావ్యాప్తంగా రాజమండ్రి రూరల్‌, అనపర్తి మినహా మిగిలిన ఒక పార్లమెంట్‌, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడం పూర్తయ్యింది. వీరితో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు.

వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా

డాక్టర్‌ గూడూరి

రాజమండ్రి లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. తొలుత తిలక్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, అభిమానులతో ర్యాలీగా సోమాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం రామాలయం జంక్షన్‌, బొమ్మూరు మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌కు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన వెంట రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావు, గూడూరి సతీమణి రాధిక ఉన్నారు. కార్యక్రమంలో శాఖ రాష్ట్ర మంత్రి, పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్‌ సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, ఎన్నికల పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు పాల్గొన్నారు.

రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్‌రామ్‌

రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ నామినేషన్‌ వేశారు. నగరంలోని వీఎల్‌ పురం మార్గాని ఎస్టేట్స్‌కు వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు అభిమానులతో ఉదయం ర్యాలీగా బయలుదేరారు. విశేష సంఖ్యలో బైక్‌లు, కార్లు, ఆటోలపై తరలివచ్చిన ప్రజలతో మార్గాని ఎస్టేట్స్‌ నుంచి సాగిన ఈ ర్యాలీ జనప్రవాహాన్ని తలపించింది. కంబాల చెరువు వరకూ ర్యాలీ కొనసాగగా.. అక్కడి నుంచి పాదయాత్రగా నగరపాలక సంస్థ కమిషనర్‌ కార్యాలయం వరకూ వెళ్లారు. ఎంపీ భరత్‌, ఆయన సతీమణి మోనా, భరత్‌ తల్లి ప్రసూన రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

ఇప్పటికే పలువురి నామినేషన్లు

● ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజానగరం సాయిబాబా ఆలయంలో సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం వందలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.

● నిడదవోలులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలసి తన క్యాంపు కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

● గోపాలపురం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హోం మంత్రి తానేటి వనిత యర్నగూడెంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం భారీ ఊరేగింపుగా గోపాలపురం చేరుకున్నారు. సుమారు 12 కిలో మీటర్ల మేర ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు.

● కొవ్వూరు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. ప్రభుత్వ సలహాదారు, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రాజీవ్‌కృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, భారీ సంఖ్యలో ప్రజలు వెంట రాగా ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

● ఇదిలా ఉండగా, రాజమండ్రి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్‌ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, రాజమహేంద్రవరం రూరల్‌, సిటీ, గోపాలపురం, కొవ్వూరు స్థానాలకు టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి వెంకట్రాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు ఇప్పటికే నామినేషన్లు వేశారు.

● జిల్లాలోని ఒక పార్లమెంటు, 7 అసెంబ్లి నియోజకవర్గాల్లో సోమవారం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. వీరిలో అనపర్తి నుంచి బీజేపీ తరఫున ములగపాటి శివరామ కృష్ణంరాజు తదితరులున్నారు.

1/1

Advertisement
Advertisement