సన్నాలకే సై | Sakshi
Sakshi News home page

సన్నాలకే సై

Published Sat, May 25 2024 5:10 PM

సన్నా

దౌల్తాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హమీ మేరకు వరి ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం సన్నరకం వడ్లకే బోనస్‌ అందించాలని ప్రభుత్వం తెలపడంతో వరి సాగు చేసే రైతుల్లో కొందరికే తీపికబురు అందినట్లయింది. వానాకాలం నుంచి బోనస్‌ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సన్నరకం సాగు చేసే రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.

తక్కువ దిగుబడి

మండల పరిధిలో చాలా వరకు రైతులు బోరు బావుల కింద, చెరువుల కింద అత్యధికంగా వరిసాగు చేపడుతారు. సుమారు 10వేల ఎకరాలకు పైగా సాగు చేయనుండగా ఇందులో 80శాతం మంది రైతులు దొడ్డురకం సాగుకే ప్రాధాన్యతనిస్తారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో సన్నరకం వరిసాగులో దిగుబడి సైతం తక్కువగా వస్తుంది. దీంతో దొడ్డురకం సాగుకే మొగ్గుచూపుతారు.

బోనస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

తాజాగా ప్రభుత్వం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించడంతో వరిసాగు రైతులు అయోమయంలో పడ్డారు. యాసంగిలో తేమ శాతంతో పనిలేకుండా సన్నరకం ధాన్యానికి ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2వేల నుంచి 2200 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో 17లోపు ఉంటే ఏ గ్రేడ్‌ ధాన్యానికి 2,203, సాధారణ రకానికి రూ.2,183 చెల్లిస్తున్నారు. మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం చెల్లించే ధర కంటే అధికంగా వస్తుండడంతో రైతులు ప్రైవేట్‌గానే విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్‌ చెల్లించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వానాకాలంలో రైతులు ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తారా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తారా చూడాలి.

తగ్గనున్న దొడ్డురకం

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటి వరకు రైతులు వానాకాలంలో సన్నరకం, యాసంగిలో దొడ్డురకం వరిసాగు చేశారు. బోనస్‌ ప్రకటించడంతో దొడ్డురకం వరి సాగు తగ్గిపోనుంది. దొడ్డురకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేట్‌ మిల్లర్లు, ప్రైవేట్‌ వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాల్సి ఉంటుంది. క్వింటాలుకు రూ.500 బోనస్‌ వస్తుండడంతో సన్నరకం వరిసాగు పెరిగే అవకాశం ఉంది.

వానాకాలం పంటలకు రూ.500 బోనస్‌

సన్నరకానికే చెల్లింపు అంటూ ప్రభుత్వ ప్రకటన

పెరగనున్న సాగు

దొడ్డు వడ్లకు ఇవ్వాలి

ప్రభుత్వం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే బోనస్‌ చెల్తిస్తామని ప్రకటించడం సరికాదు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండిస్తున్నాం. కేవలం సన్నరకానికే రూ.500 బోనస్‌ ఇస్తామనడం సరికాదు. పంటలకు ఏదానికై నా అంతే పెట్టుబడి వస్తుంది. – బసయ్య, దౌల్తాబాద్‌

తేడాలు చూపొద్దు

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యం అంతటికీ బోనస్‌ చెల్లించాలి. దొడ్డురకం, సన్నరకం తేడా లు చూపవద్దు. దొడ్డురకం ధాన్యాన్ని సాగు చేసే రైతులను ప్రోత్సహించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. – నరోత్తంరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు

సన్నాలకే సై
1/2

సన్నాలకే సై

సన్నాలకే సై
2/2

సన్నాలకే సై

Advertisement
 
Advertisement
 
Advertisement