పాడిరైతూ... బహుపరాక్‌ | El Nino Livestock Care Tips Telangana Dairy Farmers | Sakshi
Sakshi News home page

పాడిరైతూ... బహుపరాక్‌

Oct 11 2026 4:46 AM | Updated on Oct 11 2026 4:46 AM

El Nino Livestock Care Tips Telangana Dairy Farmers

ఎల్‌నినో కారణంగా పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల జీవనంపై ప్రభావం ఉంటుంది

గడ్డి కొరత మాత్రమే కాదు పశువుల ఆరోగ్యం, ఉత్పాదకతలు కూడా క్షీణిస్తాయి

పశుసంపద బలహీనపడే అవకాశముంది... దాణా రేట్లు పెరిగి పోషణ ఖర్చు పెరుగుతుంది

ఖర్చు తగ్గాలంటే ఇంట్లోనే పశువుల దాణా తయారు చేసుకోవచ్చు

సంకరజాతి ఆవులు ఉష్ణోగ్రతను అసలు తట్టుకోలేవు... వడదెబ్బ తగిలితే చాలా ప్రమాదం

పాకలు పరిశుభ్రంగా ఉండాలి... ఉదయం పూట మాత్రమే మేతకు పంపాలి

పునరుత్పత్తిపై కూడా ప్రభావం ఉంటుంది... వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి

కోళ్లు, మేకలు, గొర్రెల విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తప్పనిసరి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పశువైద్య విశ్వవిద్యాలయం కూడా అండగా ఉంటుంది

‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో పీవీఎన్‌ఆర్‌టీవీయూ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం. కిషన్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పశుసంపద కూడా గణనీయంగానే ఉంది. రమారమి 90 లక్షల వరకు ఆవులు, గేదెలు, రెండున్నర కోట్లకు పైగా గొర్రెలు, మేకలు... కోట్ల సంఖ్యలో కోళ్ల జీవితం మన రాష్ట్ర ప్రజానీకంతో మమేకమై ఉంటుంది. ఈ పశుసంపదకు కనీసం ఏటా 2 కోట్ల టన్నులకు పైగా గడ్డి అవసరమవుతుంది. సాధారణ పరిస్థితుల్లోనే 30 శాతానికి పైగా గడ్డి కొరత ఉంటుందన్న అంచనాలున్నాయి. ఎల్‌నినోతో ఈ కొరత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. తద్వారా పశుపోషణ భారంగా మారుతుందనే భయం పాడిరైతుల్లో కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పాడి రైతులు భయపడాల్సిన అవసరమేమీ ఉండదని, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఎల్‌నినోను సులువుగా ఎదుర్కోవచ్చని, అటు పశువుల జీవితాలకు, పాడి రైతు ఆదాయానికి భరోసా కల్పించవచ్చని పీవీ నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయం డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ (విస్తరణ సంచాలకులు) ప్రొఫెసర్‌ ఎం.కిషన్‌కుమార్‌ అంటున్నారు. పచ్చిగడ్డి, దాణా, పశువుల పాకల నిర్వహణ తదితర అంశాల్లో తీసుకునే జాగ్రత్తలే పాడి రైతుకు శ్రీరామరక్ష అని అంటున్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

పశువులపై ఎల్‌నినో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? 
ఎల్‌నినో ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దీని ప్రభావం పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలపై కచ్చితంగా ఉంటుంది. వాతావరణంలోని హెచ్చుతగ్గులు, వర్షాల లేమి కారణంగా కేవలం పశుగ్రాసం కొరతనే కాకుండా వాటి ఆరోగ్యం, ఉత్పాదకతలపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది.

పశుగ్రాసం కొరత కారణంగా ఏం జరుగుతుంది? 
ఆరోగ్యంగా ఉండి 10 లీటర్ల పాలిచ్చే పశువులకు రోజుకు 4 కిలోల దాణా, 25–30 కిలోల పచ్చిగడ్డి, 7 కిలోల వరకు ఎండుగడ్డి అవసరమవుతుంది. అయితే, అన్ని పశువులకు ఈ మేరకు అవసరం లేకపోయినా పచ్చిగడ్డి కొరత ఏర్పడితే పశువుల్లో పోషకాలు తగ్గిపోతాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. పశు సంపద బలహీనమవుతుంది. దాణా ఎక్కువ వాడాల్సి వస్తుంది. దాణా రేట్లు పెరుగుతాయి. పోషణ ఖర్చు పెరుగుతుంది. తద్వారా పాల రేట్లు పెరుగుతాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతు ఏం చేయాలి? 
ఇలాంటి పరిస్థితుల్లో మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పశుపోషకులు ఎల్‌నినోను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం ద్వారా పశువులను కాపాడుకోవడమే కాకుండా పోషణ ఖర్చును తగ్గించుకొని ఆదాయాన్ని స్థిరీకరించుకోవచ్చు.

ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? 
ఖరీఫ్‌ సీజన్‌ ముగియకముందే తెలంగాణలో పచ్చిగడ్డికి ఇబ్బందులు వస్తున్నాయి. ఎండాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. అందుకోసం పశుపోషకులు మాగుడుగడ్డిని తయారు చేసుకోవాలి. ఎండు గడ్డిని నిల్వ చేసుకోవాలి. జొన్న, మొక్కజొన్న చొప్పలు వేసుకోవాలి. ఖరీదైన దాణాపై ఆధారపడకుండా పాడి మేపునకు అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు.

దాణా ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు? 
దాణాను మార్కెట్‌లో కొనడం కంటే రైతు తయారు చేసుకోవడమే బెటర్‌. 10 పశువులున్న ఓ రైతు 100 కిలోల దాణా తయారు చేసుకుంటే ఐదు రోజులు వాడుకోవచ్చు. అందుకోసం 30 కిలోల జొన్న, మొక్కజొన్నలు, 30 కిలోల వేరుశనగ, పత్తిచెక్క, 30 కిలోల వరి, గోధుమ తవుడుతోపాటు 2 కిలోల ఖనిజ లవణ మిశ్రమం, కిలో ఉప్పు కలుపుకొని ఈ దాణా తయారు చేసుకోవచ్చు. ఒకట్రెండు పశువులున్న రైతుకు అయితే ఈ దాణా సుమారు నెలరోజులు వస్తుంది. ఖనిజ లవణ మిశ్రమం కిలో రూ.150 వరకు మార్కెట్‌లో ధర పలుకుతోంది. పశువైద్య విశ్వవిద్యాలయంలో అయితే కిలో రూ.45కే ఇస్తున్నాం. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పత్తికట్టె, కంది కట్టె, జొన్నచొప్పలతో దాణా తయారు చేసుకోవచ్చు. వేరుశనగ పొట్టును కూడా దాణాగా మార్చవచ్చు.

పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా?
పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయం కాదు కానీ.. కొరత రాకుండా ముందు జాగ్రత్తగా సాగు చేసుకోవచ్చు. వారానికి 1,2 తడులు సరిపోయే బహువార్షిక గడ్డిని సాగు చేయాలి. కో4, కో5, సూపర్‌ నేపియర్, ఏపీబీఎన్‌1, బాదిరా నేపియర్‌ లాంటి రకాల సాగు చేపట్టాలి. ఈ గడ్డి సాగుకు అవసరమైన సాయం మా విశ్వవిద్యాలయం నుంచి అందుతుంది.

ఎండలు పెరిగితే పశువులను కాపాడుకోవడం ఎలా?
ఉష్ణోగ్రతలు పెరిగితే పశువులను కాపాడుకోవడం సవాల్‌తో కూడినదే. అయితే, పశువులను ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మేతకు వదిలివేయకూడదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా పాకలు, కొట్టాలు, షెడ్‌లలోనే ఉంచాలి. ఆ పాకలు, కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పశువులు తాగే నీటి కోసం 40 లీటర్ల సామర్థ్యమున్న తొట్టెలను నీడలో ఉంచాలి. తడి గోనె సంచులను పాకకు ఇరువైపులా కట్టాలి. సిమెంట్‌ రేకులపై వరిగడ్డి పేర్చుకోవాలి. స్తోమతను బట్టి స్ప్రింక్లర్లు, షవర్లు, కూలర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సంకరజాతి ఆవులు ఎండను ఎక్కువగా తట్టుకోవలేవన్న విషయాన్ని గమనించాలి. పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల షెడ్‌లలో గాలి ప్రసరణ బాగా ఉండాలి. నీడ ఉండాలి.

ఎల్‌నినో ప్రభావం పశువుల పునరుత్పత్తిపై ఉంటుందా?
కచ్చితంగా ఉంటుంది. అందుకే పశువుల ఎదను రోజుకు 2 సార్లు గమనించాలి. ఎదకు వచ్చినట్టు అనిపిస్తే వెంటనే కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఈనిన తర్వాత మళ్లీ 3నెలల్లోపు పశువులు ఎదకు వస్తాయి. ఈ లక్షణాలను గమనించాలి. ఒకవేళ ఎదకు రాకపోతే వైద్యులను సంప్రదించాలి.

వ్యాధుల బారిన పడే అవకాశముందా?
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులకు గొంతు వాపు, జబ్బ వాపు లాంటి వ్యాధులు వస్తాయి. ఇవి రాకుండా టీకాలు వేయించాలి. గాలికుంటు టీకాలు, గోమార్లు, పేలు రాకుండా నట్టల నివారణ మందులు వాడాలి. దూడల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పుట్టిన తర్వాత 3,4 రోజులు జున్నుపాలు తాగించి, 10–15 రోజుల్లో నట్టల నివారణ మందు వేయిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కోళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎల్‌నినో ప్రభావం కోళ్లపై కూడా ఉంటుంది. ఎండలను కోళ్లు అసలు తట్టుకోలేవు. వాటికి ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. పశువుల షెడ్ల తరహాలోనే కోళ్లఫారాలకు కూడా గోనె సంచులు కట్టుకోవచ్చు. వేడి తక్కువగా ఉన్న సమయాల్లోనే మేత ఇవ్వాలి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల నుంచి ఏమైనా సాయం అందుతుందా?
కచ్చితంగా అందుతుంది. ఇప్పటికే జాతీయ పశుసంపద మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా పశుగ్రాసం యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు 50 శాతం సబ్సిడీతో పథకం ఉంది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ద్వారా చాలా పథకాలు అందుబాటులో ఉంటాయి. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడూ పాడి రైతుకు అందుబాటులో ఉంటుంది. ఎలాంటి సందేహాలున్నా, సాయం కావాలన్నా వర్సిటీని సంప్రదించొచ్చు.

- పీవీఎన్‌ఆర్‌టీవీయూ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎం. కిషన్‌కుమార్‌

ఇదీ చదవండి: హేయ్‌..బతికే ఉన్నవా? పురుగు మందు తాగలే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement