విదేశీ ఉద్యోగాలతో జర భద్రం | Sakshi
Sakshi News home page

విదేశీ ఉద్యోగాలతో జర భద్రం

Published Mon, May 27 2024 6:20 PM

విదేశీ ఉద్యోగాలతో జర భద్రం

సాక్షి,చైన్నె: విదేశీ ఉద్యోగాలతో జర భద్రం అంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. కొన్ని దేశాలకు ఉద్యోగ నిమిత్తం వచ్చే ఆఫర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే వెళ్లాలని ఆదేశించారు. విదేశాలలో ఉద్యోగం పేరిట బ్రోకర్ల ద్వారా, ఏజెంట్ల ద్వారా తమిళ యువతను మోసగించే ప్రయత్నాలు పెద్దఎత్తున సాగుతున్నాయన్నారు. విదేశాలలో అష్టకష్టాలు పడుతున్న తమిళ యువకులను రక్షించేందుకు పాలకులు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రవాస తమిళ సంక్షేమ శాఖ కమిషనర్‌ బీ కృష్ణమూర్తి ఆదివారం ప్రత్యేక ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. వివిధ ఉద్యోగ అవకాశాలు అంటూ తమిళ యువతకు గాలం వేస్తున్న వారూ పెరిగారని వివరించారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల పేరిట కంబోడియా, థాయిలాండ్‌, మయన్మార్‌ (బర్మా) వంటి దేశాలకు టూరిస్టు వీసా ద్వారా యువతను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలియ వచ్చిందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోందని, కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా జరుగుతున్న ఈ ప్రక్రియను తిప్పి కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే యువత వీరి ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లకు తలొగ్గిన పక్షంలో ఆయా దేశాలలో అష్టకష్టాలు పడక తప్పదని హెచ్చరించారు. గత ఏడాది ఈ దేశాలకు వెళ్లిన 83 మంది యువతను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం పలు దేశాలలో ఉద్యోగాల పేరిట అధిక జీతం, వసతులు అంటూ నమ్మబలికి యువతను తీసుకెళ్లి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా వేదిస్తున్నారని, లేని పక్షంలో పని ఒత్తిడితో హింసిస్తున్నారని ఆరోపించారు. యువత మోసగాళ్లల వలలో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ హెచ్చరికలు చేస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలకు సంబంఽధించిన ఆఫర్లు వచ్చిన పక్షంలో తక్షణం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, కాన్సులేట్‌ అధికారులను సంప్రదించినానంతరమే ఆ ఉద్యోగాలలో చేరేందుకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విదేశాలకు వెళ్లే యువత 18003093793 (భారతదేశం) 8069009901 (విదేశాలలో కమ్యూనికేషన్‌ కోసం), 8069009900 (మిస్డ్‌ కాల్‌ నెంబరు) ద్వారా లేదా, చైన్నెలోని ఇమిగ్రేషన్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌– 90421 49222ను సంప్రదించాలని సూచించారు.

యువతకు ప్రభుత్వం సూచన వెళ్లే ముందు అధికారులను

సంప్రదించాలని సూచన

Advertisement
 
Advertisement
 
Advertisement