ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం

Published Sat, May 4 2024 3:55 AM

ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం

‘స్పందన’తో

అక్రమాలు వెలుగులోకి

గత ప్రభుత్వాల నేతలు, అధికారులు అండదండలతో చెలరేగిన మైనింగ్‌ అక్రమాలకు జగనన్నకు చెబుతాం కార్యక్రమం ద్వారా చెక్‌ పడిందనే చెప్పాలి. అక్రమ మైనింగ్‌ ద్వారా వేల కోట్లు దోచుకున్న డాన్‌ అక్రమాలపై గట్టుపల్లి గ్రాస్తులు జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు.

ఎంపీపీ పదవి ఇస్తేనే.. రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టాడు

ఇక ఎమ్మెల్యే పదవిస్తే..

కావలినే కబళిస్తాడేమో!

పాతికేళ్ల క్రితం అద్దె కట్టలేని స్థితి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి

అక్రమ మైనింగ్‌తో ప్రకృతి సంపద దోపిడీ

ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

పదవి కోసం ప్రశాంతంగా ఉన్న

కావలిలో చిచ్చుపెట్టేలా కుట్రలు

డబ్బు, మద్యంతో యువతకు ఎర

కావ్య కృష్ణారెడ్డి అలియాస్‌ దగుమాటి కృష్ణారెడ్డి.. జిల్లాలోనే మైనింగ్‌ మాఫియా డాన్‌గా ఎదిగాడు. తనకు భవిష్యత్‌ను ప్రసాదించిన పుట్టిన గడ్డనే విధ్వంసం చేసి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఉదయగిరి నుంచి సూళ్లూరుపేట వరకు కంకర రాయి, గ్రావెల్‌, ఇసుక వంటి సహజ వనరులను దోచేశాడు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్‌ వెంచర్లు వేసి విక్రయించి ప్రజలను నట్టేట ముంచేశాడు. ఒక్కసారి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష పదవి ఇస్తేనే ఇదంతా చేయగలిగాడు. ఇక.. ఎమ్మెల్యే పదవిని ఇస్తే కావలి పరిస్థితి ఏమవుతుందోనని ఊహించుకుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.

కావలి: మైనింగ్‌ మాఫియా డాన్‌ కన్ను ఇప్పుడు కావలి మీద పడింది. అక్రమ మైనింగ్‌, క్రషర్లతో జలదంకి మండలంలో ఆయన సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రశ్నించిన వారిని తన దండోపాయాలతో తొక్కేశాడు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్లు, పారిశ్రామికవాడల తో కనకపట్నంగా మారుతున్న కావలిని కబ్జా చేసేందుకు, ప్రశాంతతకు మారు పేరైన కావలిని తన అడ్డాగా చేసుకునేందుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. డబ్బు, మందుతో యువతను, ఓటర్లను ప్రలోభపెట్టి గొడవలు సృష్టించడం ప్రారంభించాడు.

సుమారు పాతికేళ్ల క్రితం కావ్య కృష్ణారెడ్డి కావలిలో అద్దె ఇంట్లో ఉంటూ కామర్స్‌ అధ్యాపకుడిగా జీవితాన్ని ఆరంభించారు. ఆర్థిక పరిస్థితులు చాలక అద్దె చెల్లించలేని స్థితిలో అధ్యాపక వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటి రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జలదంకి మండల పరిషత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవిని అడ్డం పెట్టుకుని రియల్‌ ఎస్టేట్‌, క్వారీలతో కోట్లు కొల్లగొట్టడం ప్రారంభించాడు. రోడ్డు మెటల్‌ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలతో పాటు సమీపంలోని అనధికార భూముల్లో మెటల్‌ తవ్వేసి వందల కోట్ల రూపాయలు దోపిడీకి తెర తీశాడు. గడువు పూర్తయినా గనులను వదలకుండా సహజ వనరుల దోపిడీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ మైనింగ్‌ భూముల్లో స్టోన్‌ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్‌ బంకులు వంటివి ఏర్పాటు చేశాడు. జలదంకి మండలానికి చెందిన ఆ చోట నేత అనతికాలంలోనే మిడిల్‌ క్లాస్‌.. నుంచి వందల రూ.కోట్లు ఆర్జించి శ్రీమంతుడిగా ఎదిగాడు.

స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో..

గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, డి.కవిత పేర్లతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వే నంబరు 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్‌ తవ్వకానికి 10 ఏళ్ల కాల పరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్‌ లీజు హక్కులు పొందారు. అదే మండలం అన్నవరంలో సర్వే నంబరు 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో రోడ్డు మెటల్‌ తవ్వకానికి 10 ఏళ్ల కాల పరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్‌ లీజు హక్కులు పొందారు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్‌ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్‌ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం విశేషం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్‌ శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరులు, ప్రభుత్వానికి చెందిన భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు మైనింగ్‌శాఖ తనిఖీల్లో బట్టబయలు అయింది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను మైనింగ్‌ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతో పాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్‌ చేపట్టి 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను దోచేసిన వైనం వెలుగు చూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ ఈ ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పర్మిట్‌తోనే విచ్చలవిడిగా మైనింగ్‌ చేపట్టి మొత్తంగా 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వినట్లు మైనింగ్‌ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్‌ విలువ ప్రభుత్వ పరంగా సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్‌ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెల్లడైంది.

గుట్టు రట్టు చేసిన కరెంట్‌ బిల్లులు

గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌, రాఘవేంద్ర స్టోన్‌ క్రషర్స్‌ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్‌ జరగలేదని తప్పించుకునేందుకు కావ్య కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కరెంట్‌ బిల్లుల ఆధారంగా మైనింగ్‌ అధికారులు అక్రమ తవ్వకాల గుట్టును రట్టు చేశారు. క్రషర్లకు వినియోగించిన కరెంట్‌ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. టన్ను మెటల్‌ ప్రాసెస్‌ చేయడానికి 2.5 యూనిట్లు వినియోగం అవుతుందని లెక్కించి ఆ మేరకు 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. విజయవాడ నుంచి వచ్చిన మైనింగ్‌ అధికారులు తనిఖీలు చేస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనుమతులు లేకుండానే వేల కోట్ల విలువైన సహజ వనరులను దోచుకున్నట్లు గుర్తించి రూ.140 కోట్లు జరిమానా విధించారు. అయితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నాడు.

గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లతో..

కావ్య కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నది తీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కంకర, సిమెంట్‌ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి అను నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్‌ మిక్సర్‌ వ్యాపారం జరుగుతోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండేది. దీంతో యథేచ్ఛగా రూపాయి ఖర్చు లేకుండా నదీ తీరాలను నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చింది. ఇసుకకు ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్‌ మిక్సర్‌ ప్లాంట్లలో ఈ ఐదేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడ కొనుగోలు చేశారనే వివరాల్లోకి వెళ్తే ఇక్కడి అక్రమాలు కూడా బట్టబయలు అవుతాయి. ఈ రెండు క్రషన్ల వద్ద కరెంట్‌ వినియోగాన్ని లెక్కిస్తే మరి కొన్ని నిజాలు కూడా వెలుగు చూస్తాయి.

నా పోరాటం ఫలించింది

– గుమ్మలపాటి సుబ్బారావు, గట్టుపల్లి పంచాయితీ ఉప సర్పంచ్‌

గురు రాఘవేంద్ర స్టోన్‌ క్రషన్‌ యజమాని డీవీ కష్ణారెడ్డి ఏళ్ల కాలంగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రుపాయి కూడా పంచాయతీకి సీనరేజ్‌ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి జగనన్నకు చెబుతాం ద్వారా నా కల నెరవేరింది.

– దివి నరేంద్ర చౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం

గురు రాఽఘవేంద్ర స్టోన్‌ క్రషన్‌ ద్వారా కావ్య కృష్ణారెడ్డి గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతులు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మైనింగ్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం.

Advertisement
Advertisement