రుణమాఫీకి కసరత్తు ! | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి కసరత్తు !

Published Sat, May 18 2024 7:25 AM

రుణమాఫీకి కసరత్తు !

సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాల మాఫీకి కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ఆగస్టు 15లోగా రూ.2లక్షల లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌ వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తింపజేయాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు బ్యాంకుల వారీగా ఎంత మంది రుణాలు తీసుకున్నారు. వడ్డీ ఎంత, ప్రస్తుతం ఉన్న రుణం ఎంత తదితర వివరాలను క్రోడీకరిస్తున్నారు. అయితే రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి విధివిధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

2019 నుంచి రుణాలు పొందిన వారికి..

2019 ఏప్రిల్‌ 1నుంచి 2023 డిసెంబర్‌ 10 మధ్య రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న, రెన్యూవల్‌ చేసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం అర్హులైన జాబితా పంపాలని జిల్లా బ్యాంకర్లను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారం మేరకు జిల్లాలో సుమారుగా 1,42,786 మంది రైతులు రూ.2,135.96 కోట్ల పంట రుణాలను తీసుకున్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల వారీగా ప్రభుత్వం అర్హుల వివరాలను సేకరిస్తోంది. అయితే ఒకే కుటుంబంలో ఒక్కరికే ఈ మాఫీ వర్తిస్తుందా.. లేదా అన్నది తెలియాల్సి ఉంది. రూ.2లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో లక్ష మంది వరకు రైతులు లబ్ధి పొందనున్నారు.

రెన్యూవల్‌ చేయించకుంటే అనర్హులేనా..?

గత ప్రభుత్వం నాలుగేళ్లలో దశలవారీగా రుణమాఫీ చేసింది. మొదటగా రూ.25వేలు, రూ.50వేలు.. ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఈక్రమంలో రుణాలను సకాలంలో రెన్యూవల్‌ చేయని వారికి రూ.లక్ష లోపు రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేయలేదు. అయితే కొత్త ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వీరికి వర్తించనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కటాఫ్‌ తేదీల్లో వీరు రుణాలు తీసుకోకపోగా.. కనీసం రెన్యూవల్‌ సైతం చేయకపోవడమే కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం విడుదల చేసే రుణమాఫీ మార్గదర్శకాల్లో స్పష్టత రానుంది.

ఫ ఆగస్టు 15లోగా చేస్తామని

సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

ఫ బ్యాంకర్లను వివరాలు కోరిన ప్రభుత్వం

ఫ జిల్లా రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

ఫ లక్ష మంది రైతులకు చేకూరనున్న లబ్ధి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement