‘తెలుగోడిగా గర్వపడుతున్నా; వాళ్లిద్దరికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’ | Tilak Varma-Says-Happy-Hyderabadi Boys-Gets-Win-India-2nd T20 Vs NZ | Sakshi
Sakshi News home page

‘తెలుగోడిగా గర్వపడుతున్నా; వాళ్లిద్దరికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’

Oct 25 2026 8:05 AM | Updated on Oct 25 2026 8:37 AM

Tilak Varma-Says-Happy-Hyderabadi Boys-Gets-Win-India-2nd T20 Vs NZ

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో అజేయ అర్థ‌సెంచ‌రీతో టీమిండియాను గెలిపించిన తిల‌క్ వ‌ర్మ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అవార్డు తీసుకున్న త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఇద్దరు తెలుగోళ్లు మ్యాచ్‌ను గెలిపించడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. పనిలో పనిగా న‌మ‌న్ ధీర్‌పై కూడా తిలక్‌ వర్మ ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపించాడు. న‌మ‌న్ ధీర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌క‌పోయుంటే పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 

తిల‌క్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన సమ‌యంలో నేను చివ‌రివ‌ర‌కు ఆడాల‌నే ఆలోచ‌న‌లోనే ఉన్నాను. మా ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు కూడా కోచ్ గౌత‌మ్ గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోట‌క్ కీల‌క సూచ‌న‌లు ఇచ్చారు. ‘మేమందరం నిన్ను న‌మ్ముతున్నాం, యావ‌త్ భార‌తదేశం నిన్ను న‌మ్ముతోంది. నువ్వు చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉంటే మ్యాచ్‌ను గెలిపించ‌గ‌ల‌వు. ఆట చివ‌రిదాకా ఉండేందుకు ప్ర‌య‌త్నించు’ అని వాళ్లు నాతో చెప్పారు. అందుకే క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆట చివరిదాకా ఉండాల‌ని భావించాను. 

న‌మ‌న్ ధీర్ గురించి ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా. గ‌త మ్యాచ్‌తో పోలిస్తే ఈరోజు వికెట్ కొంచెం నెమ్మ‌దిగా ఉంది. కాబట్టి స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ల మధ్య పరుగులో మరింత దూకుడుగా వెళ్దామని నేను నమన్‌తో చెప్పాను. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఇద్ద‌రం బ్యాటింగ్ చేశాము. ముఖ్యంగా న‌మ‌న్ ధీర్ ఒత్తిడిలో ఆడిన తీరు అద్భుతం. 

నాతో పోలిస్తే అంత‌ర్జాతీయ అనుభ‌వం త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, మూడు భారీ సిక్స‌ర్లు కొట్టి నాపై ఒత్తిడి త‌గ్గించాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తు సాంట్న‌ర్ బౌలింగ్‌లో న‌మ‌న్ ఔట‌య్యాడు. లేకుంటే మ్యాచ్‌ను 18 లేదా 19వ ఓవ‌ర్లోనే ముగించేవాళ్లం. ఇక్క‌డ న‌మ‌న్ ధీర్‌కు కూడా క‌చ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అత‌డు వేగంగా ఆడ‌క‌పోయుంటే మా ఇద్ద‌రి (నితీశ్‌, తిల‌క్‌) ప‌ని సులువు అయ్యేది కాదు. 

ఆ త‌ర్వాత ఇద్ద‌రు హైద‌రాబాదీ కుర్రాళ్లు క‌లిసి ఇన్నింగ్స్‌ను న‌డిపించారు. స్పిన్ బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతూనే ప‌రుగులు రాబ‌ట్టాల‌ని ఇద్ద‌రం నిర్ణయించుకున్నాం. అందుకే మా ఇన్నింగ్స్‌లు గ‌మ‌నిస్తే మీకు బౌండ‌రీల కంటే సింగిల్స్‌, డబుల్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఫాస్ట్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడ‌గ‌ల‌మ‌ని తెలుసు.. కానీ ఆ రిస్క్ చేయ‌కుండా బంతిని గాల్లోకి లేప‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడుతూ మ్యాచ్‌ను ముగించాము. ఇద్ద‌రు తెలుగోళ్లు మ్యాచ్‌ను గెలిపించడం నాకు గ‌ర్వంగా ఉంది. థాంక్యూ నితీశ్ రెడ్డి’’ అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: 'నువ్వు వ‌చ్చేసేయ్.. నేను వ‌చ్చేస్తా ఆరాంసే'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement