శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నాయకత్వం వహించనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా తిరిగి జట్టులోకి వచ్చాడు.
ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ట్రై-సిరీస్‌లో సల్మాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు 90 బంతుల్లోనే 107 పరుగులు సాధించి మంచి ఊపులో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు.
కొత్త ఆటగాళ్లకు పిలుపు
కాగా ముగ్గురు యువ బ్యాటర్లకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మహ్మద్ తహా, రైట్ హ్యాండ్ బ్యాటర్లు సమీర్ మన్హాస్, మహ్మద్ సులేమాన్‌లను లంకతో సిరీస్‌కు ఎంపిక చేశారు. అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్, అవైస్, మహ్మద్ అబ్బాస్, రజాఉల్లా, సాద్ బైగ్, సౌద్ షకీల్ తదితరులు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
వికెట్ కీపర్లుగా మహ్మద్ గాజీ ఘోరి, సాద్ బైగ్ ఎంపికవగా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోసారి సీనియర్ ప్లేయర్ షాహీన్ షా అఫ్రిదికి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌ను సైతం పక్కన పెట్టారు. నవంబర్ 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
శ్రీలంకతో సిరీస్‌కు పాక్ జట్టు ఇదే
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అరాఫత్ మిన్హాస్, అజాన్ అవైస్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ గాజీ ఘోరి (వికెట్ కీపర్), మహ్మద్ సులేమాన్, మహ్మద్ తహా, రజాఉల్లా, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, సమీర్ మన్హాస్, సౌద్ షకీల్.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్


