వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer comments after India won against New Zealand | Sakshi
Sakshi News home page

వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్‌ అయ్యర్‌

Oct 24 2026 5:15 PM | Updated on Oct 24 2026 5:54 PM

Shreyas Iyer comments after India won against New Zealand

PC: BCCI/X

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠపోరులో 4 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. ఒక దశలో ఓటమి తప్పదనుకున్న చోట తెలుగు తేజాలు నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్), తిలక్ వర్మ (51 నాటౌట్) అద్భుత పోరాటంతో మెరిశారు. 

ఆఖరి ఐదు ఓవర్లలో ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 68 పరుగులు సాధించి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ముందంజ వేసింది. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఇలాంటి ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడికి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. ఈ మ్యాచ్‌లో మరోసారి అది నిజమని నిరూపించాం. నిజం చెప్పాలంటే.. ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మా చేజారిపోతుందేమో అనిపించింది. కానీ తిలక్, నితీశ్ అద్భుతమైన పోరాటపటిమను కనబరిచారు. ఓడిపోయే మ్యాచ్‌ను మా వైపు తిప్పుకొని గెలిపించారు" అని అయ్యర్‌ కొనియాడు.

నమన్‌ ఒక అద్భుతం
"ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నమన్ తన సత్తా చాటాడు. అతడి గురించి బయట పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, నమన్ ఒక అద్భుతమైన ఆల్‌రౌండర్. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలడు. వెస్టిండీస్ సిరీస్‌లో కూడా అతడు అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాకుండా ఫీల్డింగ్‌లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతడు కచ్చితంగా మా జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్.

లక్ష్య ఛేదనలో మేము ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని అనుకున్నాం. కానీ కివీస్ స్పిన్నర్లు బ్రేస్‌వెల్, శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్‌ప్లేలో మేము ఎక్కువగా డాట్ బాల్స్ ఆడాం, దీంతో రన్ రేట్ కూడా పెరిగిపోయింది. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను వాళ్ళు పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. 

మేము బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించి అక్కడే పొరపాటు చేశాం. గ్యాప్‌లు చూసుకుని బౌండరీలు సాధించే ప్రయత్నం చేసి ఉంటే మరింత ఈజీగా లక్ష్యాన్ని చేరుకోగలిగేవాళ్లం. ఏదేమైనప్పటికీ, చివరికి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం చాలా సంతోషంగా ఉంది" అని శ్రేయస్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు.. ఒకే ఒక్కడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement